Wheat Exports: గోధుమ ఎగుమతులపై నిషేధం.. భారత్‌కు మద్దతు పలికిన చైనా

గోధుమ ఎగుమతులను నియంత్రిస్తూ భారత్‌ తీసుకున్న నిర్ణయంపై జీ7 దేశాలు చేస్తోన్న విమర్శలకు చైనా స్పందించింది. ఈ సందర్భంగా మన దేశానికి మద్దతిస్తూ డ్రాగన్‌

Published : 16 May 2022 17:41 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: గోధుమ ఎగుమతులను నియంత్రిస్తూ భారత్‌ తీసుకున్న నిర్ణయంపై జీ7 దేశాలు చేస్తోన్న విమర్శలకు చైనా స్పందించింది. ఈ సందర్భంగా మన దేశానికి మద్దతిస్తూ డ్రాగన్‌ వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యకరం. భారత్‌ లాంటి అభివృద్ధి చెందుతోన్న దేశాలను నిందించినంత మాత్రాన ప్రపంచం ఎదుర్కొంటోన్న ఆహార సంక్షోభానికి పరిష్కారం లభించదని చైనా అధికారిక మీడియా గ్లోబల్‌ టైమ్స్‌ వ్యాఖ్యానించింది.

‘‘గోధుమ ఎగుమతులపై భారత్‌ నిషేధం విధించకూడదని జీ7 దేశాల వ్యవసాయ శాఖ మంత్రులు అంటున్నారు. మరి ఆ దేశాలు ఎందుకు తమ ఎగుమతులను పెంచి ఆహార మార్కెట్‌ సరఫరాను స్థిరీకరించేందుకు ప్రయత్నించట్లేదు? గోధుమల ఉత్పత్తిలో ప్రపంచంలోనే భారత్‌ రెండో అతిపెద్ద దేశం అయినప్పటికీ.. ప్రపంచవ్యాప్తంగా గోధుమల ఎగుమతుల్లో భారత్ వాటా చాలా తక్కువే. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, ఈయూ లాంటి అభివృద్ధి చెందిన దేశాలు ప్రధాన ఎగుమతిదారులుగా ఉన్నాయి. ఆహార సంక్షోభం దృష్ట్యా కొన్ని పశ్చిమ దేశాలు ఇప్పటికే గోధుమ ఎగుమతులను తగ్గించాయి. అలాంటప్పుడు స్వదేశంలో ఆహార భద్రత కోసం భారత్‌ తీసుకున్న నిర్ణయాన్ని విమర్శించే హక్కు ఆ దేశాలకు లేదు. భారత్‌ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలను నిందించినంత మాత్రాన ఆహార సంక్షోభానికి పరిష్కారం లభించదు’’ అని గ్లోబల్‌ టైమ్స్‌ తన కథనంలో పేర్కొంది.

దేశంలో పెరుగుతున్న ఆహార ధాన్యాల ధరలను అదుపు చేయడానికి గోధుమ ఎగుమతులను నిషేధిస్తూ గత శనివారం కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే నోటిఫికేషన్‌ కంటే ముందు గోధుమల ఎగుమతి కోసం జారీ చేసిన లెటర్స్‌ ఆఫ్‌ క్రెడిట్‌ను గౌరవిస్తామని ప్రకటించింది. కొవిడ్‌, వాతావరణ మార్పులు, ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల తీవ్ర ఆహార కొరతను ఎదుర్కొంటున్న కొన్ని దేశాలకు గోధుమలను ఎగుమతి చేస్తామని గతంలో ఇచ్చిన హామీని నెరవేరుస్తామని విదేశీ వాణిజ్య కార్యాలయం (డి.జి.ఎఫ్‌.టి) భరోసా ఇచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని