Pak Terrorist: లష్కరే ఉగ్రవాది షాహిద్‌ మహమూద్‌కు చైనా అండ..!

లష్కరే తొయిబా ఉగ్రవాది షాహిద్‌ మహమూద్‌కు ఐరాసలో చైనా అండదండలు లభిస్తున్నాయి. అతడిపై భారత్‌, అమెరికా ఐరాసలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని చైనా నిలిపివేసింది.

Published : 19 Oct 2022 11:30 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: లష్కరే తొయిబా కీలక నాయకుడు షాహిద్‌ మహమూద్‌కు ఐరాసలో చైనా అండదండలు లభిస్తున్నాయి. అతడిని ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించాలని కోరుతూ భారత్‌, అమెరికా దేశాలు ఐరాసలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని చైనా నిలిపివేసింది. ఉగ్రవాదులపై చర్యలు చేపట్టకుండా ఐరాసలో గత కొన్ని నెలల్లో చైనా అడ్డుకోవడం ఇది నాలుగోసారి. ఐరాస భద్రతా మండలిలో ‘1267 అల్‌ఖైదా ఆంక్షల కమిటీ’ కింద మహమూద్‌పై చర్యలు తీసుకోవాలని.. భారత్‌, అమెరికా ఈ ప్రతిపాదనలు చేశాయి. 2016లోనే అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌ షాహిద్‌ మహమూద్‌, సార్వార్‌పై ఆంక్షలు విధించింది. ఉగ్రవాదానికి వీరు నిధులను సమకూరుస్తున్నట్లు నాటి అమెరికా ఫారెన్‌ అసెట్‌ కంట్రోల్‌ అధికారి జాన్‌ ఇ స్మిత్‌ పేర్కొన్నారు.

ఎవరీ షాహిద్‌ మహమూద్‌..?

షాషిద్‌ మహమూద్‌ కరాచీలో లష్కరే తోయిబా సీనియర్‌ సభ్యుడు. 2007 నుంచి లష్కరే కోసం పనిచేస్తున్నాడు. 2013లో అతడు లష్కరే పబ్లికేషన్స్‌ విభాగ సభ్యుడిగా పనిచేశాడు. 2014 నుంచి లష్కరే అనుబంధ విభాగమైన ఫలహ్‌ ఇ ఇన్సానియత్‌ ఫౌండేషన్‌ (ఎఫ్‌ఐఎఫ్‌)లో కొనసాగి.. 2015-16 మధ్యలో ఆ సంస్థ వైస్‌ ఛైర్మన్‌గా వ్యవహరించాడు. సిరియా, టర్కీ, బంగ్లాదేశ్‌, గాజా వంటి ప్రాంతాల్లో పర్యటించి ఉగ్రవాదానికి నిధులు సమకూర్చాడు. మరో ఉగ్రనేత సాజిద్‌ మిర్‌తో కలిసి విదేశాల్లో కార్యకలాపాలు నిర్వహించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని