Taiwan: ‘ఫిఫా’లో తైవాన్‌ పేరు వివాదం.. చైనా బెదిరింపులే కారణమన్న ద్వీపదేశం!

ఖతార్‌లో ఈ ఏడాది నిర్వహించనున్న ఫిఫా ప్రపంచ కప్‌లో భాగంగా క్రీడాభిమానులకు జారీ చేయనున్న గుర్తింపు కార్డులో తైవాన్‌ పేరును ‘చైనీస్ తైపీ’గా పేర్కొనడం వివాదానికి దారితీసింది......

Published : 22 Jun 2022 01:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఖతార్‌లో (Qatar) ఈ ఏడాది నిర్వహించనున్న ఫిఫా ప్రపంచ కప్‌లో (fifa world cup 2022) భాగంగా క్రీడాభిమానులకు జారీ చేయనున్న గుర్తింపు కార్డులో తైవాన్‌ (Taiwan) పేరును ‘చైనీస్ తైపీ’గా పేర్కొనడం వివాదానికి దారితీసింది. చైనా (China) బెదిరింపులకు భయపడి నిర్వాహకులు ఈ మేరకు మార్పులు చేపట్టారని తైవాన్‌ మంగళవారం ఆరోపించింది. నవంబర్‌- డిసెంబరులో జరగనున్న ఈ మెగా టోర్నీలో భాగంగా  ‘హయా’ పేరిట జారీ చేయనున్న ఈ ఐడీ కార్డులు.. ఖతార్‌లో ప్రవేశానికి వీసాగా, స్టేడియాల్లో అనుమతించేందుకు ఓ పాస్‌గా పనిచేస్తాయి.

వాస్తవానికి క్రీడా ప్రపంచం తైవాన్‌ను ‘చైనీస్ తైపీ’ పేరిట గుర్తిస్తుంది. అయితే, తైవాన్ అభిమానులను చైనీయులుగా పరిగణించే యోచనలో ఉన్న నిర్వాహకులు.. తొలుత ‘హయా’ ఆన్‌లైన్‌ పోర్టల్‌లో ఈ దేశానికి సంబంధించి తైవాన్, చైనీస్ తైపీ.. ఈ రెండు పేర్లనూ పొందుపర్చలేదు. అయితే, గత వారం తైవాన్‌ ఫిర్యాదుతో అదే పేరును చేర్చారు. కానీ, దాన్ని మళ్లీ ‘చైనీస్ తైపీ’గా మార్చారు. డ్రాగన్‌ జోక్యం కారణంగానే నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తైవాన్ విదేశాంగ శాఖ ఆరోపించింది.

రాజకీయ శక్తుల అక్రమ జోక్యాన్ని నివారించడంలో ప్రపంచ కప్ నిర్వాహకులు విఫలమయ్యారని తైవాన్‌ ప్రతినిధి త్సూయి చింగ్-లిన్ విచారం వ్యక్తం చేశారు. చైనా ప్రభుత్వ బెదిరింపులను, అంతర్జాతీయ క్రీడా కార్యక్రమాల్లో రాజకీయ అవకతవకలను ఖండిస్తున్నామన్నారు. ఇదిలా ఉండగా.. తైవాన్‌ను చైనా తమ దేశంలో అంతర్భాగంగా పరిగణిస్తోన్న విషయం తెలిసిందే. అవసరమైతే బలప్రయోగంతో ఆ దేశాన్ని కలిపేసుకుంటామని స్పష్టం చేసింది. ఈ వైఖరిని తైవాన్‌ గట్టిగా తిరస్కరిస్తూ వస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని