Tibet: లక్షల మంది ‘డీఎన్‌ఏ’ సేకరిస్తోన్న చైనా.. అమెరికా ఆందోళన

లక్షల మంది టిబెట్‌ పౌరుల డీఎన్‌ఏలను (DNA Samples) చైనా సేకరించడంపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది.  

Published : 15 May 2023 01:33 IST

వాషింగ్టన్‌: కొన్నేళ్లుగా టిబెట్‌ పౌరుల నుంచి చైనా (China) బలవంతంగా డీఎన్‌ఏ నమూనాలను (DNA Samples) సేకరిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటికే లక్షల మంది నమూనాలను సేకరించినట్లు సమాచారం. టిబెట్‌ (Tibet) పౌరులను నియంత్రించడం, వారిని పర్యవేక్షణ కోసమే చైనా ఈ తరహా చర్యలకు పాల్పడుతోందనే వాదన ఉంది. దీనిపై తాజాగా అమెరికా విదేశాంగశాఖ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది..

టిబెట్‌ స్వతంత్ర ప్రాంతం (TAR)లో ఆరేళ్లుగా సుమారు 9.2లక్షల నుంచి 12లక్షల మంది పౌరుల నుంచి డీఎన్‌ఏ నమూనాలను చైనా పోలీసులు సేకరించినట్లు సెప్టెంబర్‌ 2022లో సిటిజెన్‌ ల్యాబ్‌ నివేదిక వెల్లడించింది. ఆ ప్రాంతంలోని మూడో వంతు ప్రజల నుంచి సేకరించినట్లు అంచనా. తల్లిదండ్రులు, కుటుంబీకుల అనుమతి లేకుండా టిబెట్‌ పౌరుల డీఎన్‌ఏలను ఒక క్రమబద్ధతిలో సేకరిస్తున్నట్లు హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌ (HRW) నివేదిక ఇటీవల వెల్లడించింది.

‘భారీ స్థాయిలో టిబెట్‌ పౌరుల డీఎన్‌ఏలను చైనా సేకరిస్తోందని వార్తలు వస్తున్నాయి. అక్కడి పౌరులపై నియంత్రణ, పర్యవేక్షణ కోసమే చైనా ఈ తరహా చర్యలకు పాల్పడటం ఆందోళన కలిగిస్తోంది’ అని అమెరికా విదేశాంగమంత్రి ఆంటోని బ్లింకెన్‌ పేర్కొన్నారు. మానవ జన్యు సమాచారం సేకరణ మానవ హక్కుల ఉల్లంఘన కిందికే వస్తుందన్నారు. మరోవైపు బ్లింకెన్‌ వ్యాఖ్యలను అంతర్జాతీయ టిబెట్‌ ప్రచార సంస్థ (ICT) స్వాగతించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని