Viral News: ఒక్కో ఉద్యోగికి ₹6 కోట్లు బోనస్‌.. కట్టలుకట్టలుగా పంచిన చైనా కంపెనీ!

ఆర్థిక మాంద్యం భయాలతో ఐటీ కంపెనీలు ఉద్యోగుల్ని తొలగిస్తుంటే.. చైనాకు చెందిన ఓ క్రేన్‌ తయారీ సంస్థ తమ ఉద్యోగులకు భారీగా బోనస్‌ ప్రకటించింది. అయితే, ఈ మొత్తాన్ని పూర్తిగా నగదు రూపంలో అందించింది.

Published : 31 Jan 2023 01:18 IST

బీజింగ్‌: ప్రపంచవ్యాప్తంగా పలు టెక్‌ కంపెనీలు ఉద్యోగుల్ని తొలగిస్తుంటే.. చైనా(China)కు చెందిన ఓ సంస్థ తమ ఉద్యోగులకు భారీ మొత్తంలో బోనస్‌ను ప్రకటించింది. అయితే, ఆ మొత్తాన్ని వారి ఖాతాలో జమ చేయకుండా పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించి నగదును కట్టకట్టలుగా వేదికపై పేర్చి అందించింది. దీంతో కంపెనీ అందించే బోనస్‌ మొత్తాన్ని చేతులతో తీసుకెళ్లలేక సదరు ఉద్యోగులు బ్యాగులు తెచ్చుకోవడం గమనార్హం. ప్రస్తుతం దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. 

చైనాకు చెందిన హెనాన్‌ మైన్‌ (Henan Mine) అనే కంపెనీ క్రేన్లను ఉత్పత్తి చేస్తుంటుంది. గతేడాది కరోనా కారణంగా పలు కంపెనీలు ఆర్థికంగా నష్టాలను చవిచూసినప్పటికీ, హెనాన్‌ మైన్‌ సంస్థకు మాత్రం భారీ లాభాలు వచ్చాయి. దీంతో కంపెనీ లాభాలకు కారణమైన ఉద్యోగులకు బోనస్‌ ఇవ్వాలని నిర్ణయించింది. అందులో భాగంగా కంపెనీ సేల్స్‌ విభాగంలో మంచి పనితీరు కనబరిచిన 30 మందికి పైగా ఉద్యోగులకు 61 మిలియన్‌ యువాన్లు (సుమారు ₹ 73 కోట్లు) బోనస్‌గా ప్రకటించింది.  

ఈ మొత్తాన్ని ఉద్యోగులకు పంచేందుకు ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో ₹ 73 కోట్ల మొత్తాన్ని నోట్ల కట్టల రూపంలో స్టేజ్‌పై పేర్చింది. తర్వాత ఉద్యోగుల్లో అత్యుత్తమైన పనితీరు కనబరిచిన ముగ్గురు ఉద్యోగులకు ఒక్కో ఉద్యోగికి ఐదు మిలియన్‌ యువాన్లు (సుమారు ₹ 6 కోట్లు) చొప్పున అందించింది. మిగిలిన వారికి ఒక్కోక్కరికి ఒక మిలియన్‌ యువాన్లు (సుమారు ₹ 1.20 కోట్లు ) బోనస్‌గా ఇచ్చింది. దీంతో కంపెనీ అందించిన నోట్ల కట్టలను ఉద్యోగులు చేతులతో తీసుకెళుతున్న వీడియోలు చైనా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని