China Covid: చైనాలో రోజుకు 9,000 మరణాలు..!

చైనాలో పరిస్థితి  ఘోరంగా ఉందని యూకేకు చెందిన హెల్త్‌ డేటా సంస్థ పేర్కొంది. డిసెంబర్‌లో అక్కడ లక్ష మంది చనిపోయి ఉండొచ్చని అంచనా వేసింది.

Updated : 01 Jan 2023 10:42 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చైనా( China)లో కొవిడ్‌ (Covid19)భయానకంగా విస్తరిస్తోందని యూకేకు చెందిన ఓ హెల్త్‌డేటా విశ్లేషణ సంస్థ ‘ఎయిర్‌ఫినిటీ’ పేర్కొంది. జీరో కొవిడ్‌ పాలసీని చైనా వదిలినప్పటి నుంచి రోజుకు సగటున 9,000 మరణాలు సంభవిస్తున్నాయని అంచనా వేసింది. ఈ అంచనాకు వచ్చేందుకు ‘ఎయిర్‌ఫినిటీ’ తీవ్ర కసరత్తు చేసింది. చైనాలోని రీజనల్‌ ప్రావిన్స్‌ల్లో ఇన్ఫెక్షన్ల సంఖ్యను రిపోర్టు చేసే విధానంలో మార్పులకు ముందు నమోదైన గణంకాలు, గతంలో జీరో కొవిడ్‌ను పాటించిన దేశాల్లో ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత నమోదైన కేసుల రేటును విశ్లేషించి ఈ అంచనాకు వచ్చింది. ఒక్క డిసెంబర్‌లోనే చైనాలో లక్ష మంది వరకు కొవిడ్‌తో మరణించి ఉండొచ్చని పేర్కొంది. ఈ సమయంలో ఎంత లేదన్నా.. 1.8 కోట్ల కొవిడ్‌ కేసులు నమోదై ఉండొచ్చని తెలిపింది. జనవరి నాటికి రోజువారీగా 34 లక్షల కేసులు రావొచ్చని వెల్లడించింది. చైనా కొవిడ్‌ గణాంకాల్లో పాదర్శకత లేకపోవడంతో మెరుగైన నిర్ణయాలు తీసుకోవడం కష్టమవుతుందని బ్రిటన్‌కు చెందిన ‘బయోసైన్స్‌ రిసోర్స్‌ ప్రాజెక్ట్‌’ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ జోనాథన్‌ లాథమ్‌  తెలిపారు.

చైనా (China)లో కొవిడ్‌ కేసుల సంఖ్యను దాచిపెట్టడం సమస్యను తీవ్రం చేస్తోందని ఆస్ట్రేలియా పత్రిక ‘న్యూస్‌.కామ్‌.ఏయూ’ పేర్కొంది. అక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద కొవిడ్‌ అవుట్‌బ్రేక్‌ ఉందని చైనా నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌ ధ్రువీకరించిన విషయాన్ని వెల్లడించింది. అక్కడ మార్చినాటికి కనీసం 100 కోట్ల మందికి వైరస్‌ సోకవచ్చని పేర్కొంది.

చైనా (China)పై విమర్శలు పెరగడంతో ఇటీవల ఆ దేశ అధికారులు ప్రపంచ ఆరోగ్య సంస్థతో భేటీ అయ్యారు. చైనా నుంచి జన్యుసమాచారం, మరణాల వివరాలు, ఆసుపత్రుల్లో చేరుతున్న రోగుల గణంకాలు మరింత లోతుగా ఇవ్వాలని డబ్ల్యూహెచ్‌వో అధికారులు చైనాను కోరారు. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు చైనాపై ఆంక్షలు విధిస్తున్నాయి. తాజాగా చైనా నుంచి వచ్చేవారికి కొవిడ్‌ టెస్టుల్లో నెగెటివ్‌ రావాలని కెనడా పేర్కొంది. మరో వైపు చైనా నుంచి వచ్చేవారిని తమ దేశంలోకి అనుమతించమని మొరాకో చెప్పింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని