Ukraine Crisis: రష్యాకు చైనా షాక్‌..! భారీగా కోత పెట్టిన డ్రాగన్‌ దేశం!

రష్యా అత్యంత కఠిన ఆంక్షలను ఎదుర్కొంటోంది. చైనా సాయంతో వీటి నుంచి బయటపడవచ్చని రష్యా భావిస్తోంది.

Published : 18 May 2022 19:20 IST

సాంకేతిక పరికరాల ఎగుమతుల్లో కోత

ఇంటర్నెట్‌డెస్క్‌: రష్యా అత్యంత కఠిన ఆంక్షలను ఎదుర్కొంటోంది. చైనా సాయంతో వీటి నుంచి బయటపడవచ్చని రష్యా భావిస్తోంది. కానీ, అమెరికా, పశ్చిమ దేశాల ఆంక్షలు కఠినంగా ఉండటంతో ఇప్పుడు చైనా కూడా వెనుకడుగు వేస్తోంది. కొన్నాళ్లుగా చైనా నుంచి రష్యాకు వెళుతున్న సాంకేతికపరమైన ఉత్పత్తుల పరిమాణంలో క్రమంగా తగ్గుదల నమోదవుతోంది. ఈ విషయాన్ని అమెరికా కామర్స్‌ సెక్రటరీ జినా రైమాండో వెల్లడించారు. 

చైనా నుంచి రష్యాకు వెళ్లే ల్యాప్‌టాప్‌ల సంఖ్యలో ఫిబ్రవరితో పోలిస్తే 40 శాతం తగ్గుదల కనిపించింది. ఇక స్మార్ట్‌ఫోన్ల ఎగుమతులు మూడింట రెండొంతులు కుంగాయి. టెలికమ్యూనికేషన్స్‌ పరికరాల ఎగుమతులు 98శాతం పతనమైనట్లు రైమాండో పేర్కొన్నారు.

అమెరికా ఆంక్షలను ఉల్లంఘిస్తే చోటు చేసుకొనే పరిణామాలకు భయపడి చైనా కూడా వెనక్కి తగ్గింది. ఆంక్షల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా రష్యాకు వెళ్లే టెక్‌ ఎగుమతుల్లో చిప్స్‌ (సెమీకండెక్టర్లు) అమెరికా సాఫ్ట్‌వేర్‌ గానీ, టెక్నాలజీ కానీ ఉండటానికి వీల్లేదు. ప్రపంచ వ్యాప్తంగా, చైనాలో సెమీకండెక్టర్లు తయారు చేసే కంపెనీలు అత్యధికంగా అమెరికా డిజైన్‌ చేసిన పరికరాలు, సాఫ్ట్‌వేర్‌ను వినియోగిస్తాయి. 

రష్యాను అంక్షలతో ఉక్కిరి బిక్కిరి చేయడానికి అమెరికా సహా 37 దేశాలు కలిసి ఆంక్షలను రూపొందించాయి. మాస్కోలోని హైటెక్‌ ఎకానమీ, సైన్యాన్ని పూర్తిగా అణచివేయడమే వీటి లక్ష్యం. అమెరికా ఆంక్షల పరిధిలో కంప్యూటర్‌ చిప్స్‌, టెలికమ్యూనికేషన్స్‌ పరికరాలు, లేజర్లు, ఏవియానిక్స్‌, మారిటైమ్‌ టెక్నాలజీకి చెందిన పరికరాలు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని