TikTok- China: కంపెనీల నుంచి విదేశాల డేటా అడగదట..!

విదేశాల్లో సేకరించిన డేటాను అందజేయాలంటూ తమ సంస్థలను కోరతామన్న ఆరోపణలను చైనా ఖండించింది. టిక్‌టాక్‌పై అమెరికాలో విచారణ సాగుతోన్న వేళ డ్రాగన్‌ ఈ మేరకు స్పందించింది.

Published : 25 Mar 2023 00:22 IST

బీజింగ్‌: అమెరికా(America), చైనాల మధ్య వాణిజ్యం, సాంకేతికపరమైన అంశాల్లో ఆధిపత్య పోరు నెలకొన్న వేళ.. ప్రస్తుతం ‘టిక్‌టాక్‌(TikTok)’పై ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఈ యాప్‌ వినియోగదారుల డేటాను చైనా(China) ప్రభుత్వంతో పంచుకుంటోందన్న ఆరోపణలు ఉన్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా పలు దేశాలు దీనిపై చర్యలు తీసుకుంటున్నాయి. అమెరికా కాంగ్రెస్‌, శ్వేతసౌధం, సైనిక బలగాలు, సగానికి పైగా రాష్ట్రాల్లోని అధికారిక ఫోన్లలో ఇప్పటికే దీనిపై నిషేధం ఉంది. టిక్‌టాక్‌ సీఈఓ షౌ జీ చూ(Shou Zi Chew)నూ యూఎస్‌ కాంగ్రెస్ విచారించింది. ఈ పరిణామాల నడుమ టిక్‌టాక్‌ వ్యవహారంపై చైనా స్పందించింది. విదేశాల్లో సేకరించిన డేటా ఇవ్వాలంటూ సంస్థలను అడుగుతామన్న ఆరోపణలను శుక్రవారం ఖండించింది.

‘విదేశాల్లో సేకరించిన డేటా అందజేయాలంటూ కంపెనీలను చైనా కోరదు. సమాచార గోప్యతకు ప్రాధాన్యం ఇస్తుంది’ అని చైనా పేర్కొంది. చైనా విదేశాంగశాఖ ప్రతినిధి మావో నింగ్ ఈ వ్యవహారంపై మాట్లాడుతూ.. ‘విదేశాలకు చెందిన సమాచారాన్ని సేకరించడానికి చైనాకు ఏ సంస్థలు, వ్యక్తుల అవసరం లేదు. అలా ఎన్నడూ చేయలేదు’ అని చెప్పారు. పైగా.. టిక్‌టాక్ తన జాతీయ భద్రతకు ముప్పుగా పరిణమిస్తున్నట్లు అమెరికా ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు అందించలేదని పేర్కొన్నారు. మరోవైపు.. టిక్‌టాక్ యాప్‌ వినియోగదారుల డేటాను చైనా ప్రభుత్వంతో పంచుకోదని, అలాగే 15 కోట్ల మంది అమెరికన్‌ యూజర్ల డేటాకు ఎలాంటి ప్రమాదం కలిగించదంటూ షౌ జీ చూ.. అమెరికా చట్టసభ సభ్యుల కమిటీకి తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని