China: చైనాలో కరోనా ఉపరకం కలవరం: ఒక్కరోజే 13వేల కేసులు

కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణతో చైనా అల్లాడిపోతోంది. నిత్యం రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి.

Published : 04 Apr 2022 01:25 IST

కట్టడి చేయలేక చైనా అధికారులు ఉక్కిరిబిక్కిరి

బీజింగ్‌: కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణతో చైనా అల్లాడిపోతోంది. నిత్యం రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే 13వేల కేసులు వెలుగు చూశాయి. రెండేళ్ల కాలంలో ఇవే గరిష్ఠ కేసులుగా చైనా ఆరోగ్య అధికారులు చెబుతున్నారు. కొవిడ్‌ కట్టడిలో భాగంగా ఇప్పటికే కోట్ల మందిపై లాక్‌డౌన్‌ ఆంక్షలు విధిస్తోన్న నేపథ్యంలో వేల సంఖ్యలో కేసులు బయటపడడం చైనా అధికారులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇదే సమయంలో కొత్తగా కరోనా ఉపరకం వెలుగు చూడడం చైనా అధికారులను కలవరపెడుతోంది.

ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్‌ ఆంక్షలు సడలిస్తోన్న వేళ.. చైనాలో మాత్రం కొవిడ్‌ ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతోంది. శనివారం నాడు దేశవ్యాప్తంగా 12వేల కేసులు నమోదుకాగా ఆదివారం ఒక్కరోజు 13,146 బయటపడ్డాయి. వీటిలో 70శాతం కేసులు షాంఘైలోనే ఉన్నాయి. అయితే, నిత్యం వేల సంఖ్యలో కేసులు వెలుగు చూస్తున్నప్పటికీ మరణాలు మాత్రం సంభవించలేదని చైనా నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌ వెల్లడించింది. ఇలా నిత్యం వేల సంఖ్యలో కొవిడ్‌ కేసులు బయటపడుతుండడంతో చైనా అధికారులు ఆంక్షలు కఠినతరం చేశారు. తాజాగా ఈశాన్య చైనాలోని బయాచెంగ్‌లోనూ లాక్‌డౌన్‌ విధించారు. హైనన్‌ ప్రావిన్సులోని సాన్యా నగరానికి వాహన రాకపోకలపై నిషేధం విధించారు. ఇప్పటికే రెండున్నర కోట్ల జనాభా కలిగిన షాంఘైలో భారీ స్థాయిలో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి.

ఉపరకం కలవరం..

ఒమిక్రాన్‌ వేరియంట్‌తో వణికిపోతోన్న చైనాలో తాజాగా ఒమిక్రాన్‌ ఉపరకం వెలుగు చూసినట్లు అక్కడి ఆరోగ్య అధికారులు పేర్కొన్నారు. షాంఘైకి సమీపంలోని కొవిడ్‌ బాధితుడిలో ఈ కొత్తరకాన్ని గుర్తించిన అధికారులు.. ఒమిక్రాన్‌ వేరియంట్‌కు చెందిన బీఏ.1.1 నుంచి పరివర్తన చెందినట్లు అంచనా వేస్తున్నారు. అయితే, చైనాలో కొవిడ్‌కు కారణమైన రకంతో ఇది సరిపోలడం లేదన్నారు. ఉత్తర చైనాలోని డాలియన్‌ నగరంలో నమోదైన కేసు స్థానిక వైరస్‌తో సరిపోలడం లేదని అక్కడి మున్సిపల్‌ అధికారులు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని