China: ఆ ‘జోక్‌’కు మూల్యం రూ.17 కోట్లు!

చైనా సైన్యాన్ని (PLA) అవమానపరిచేలా వ్యాఖ్యలు చేసిన ఓ కమెడియన్‌పై (Comedian) అక్కడి ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో అతడు పనిచేస్తోన్న కంపెనీకి భారీ జరిమానా విధించింది.

Published : 18 May 2023 01:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రేక్షకులను నవ్వించేందుకు ఓ చైనా (China) కమెడియన్‌ వేసిన ఓ జోక్‌  ప్రభుత్వ ఆగ్రహానికి కారణమయ్యింది. దీంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇటీవల నిర్వహించిన ఓ షోలో చైనా సైన్యాన్ని (PLA) అవమానపరిచే విధంగా స్టాండప్‌ కమెడియన్‌ (Stand-up comedy) వేసిన జోక్‌పై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆ హాస్యనటుడు పనిచేస్తున్న కంపెనీకి చైనా ప్రభుత్వం 14.7 మిలియన్‌ యువాన్ల (సుమారు 2.13 మిలియన్‌ డాలర్లు) భారీ జరిమానాను విధించింది.

బీజింగ్‌లోని సెంచరీ థియేటర్‌లో మే 13న నిర్వహించిన ఓ కార్యక్రమంలో లీ హవోషి అనే స్టాండప్‌ కమెడియన్‌ (Comedian) ఓ ప్రదర్శన ఇచ్చాడు. అందులో భాగంగా తాను షాంఘైకి వెళ్లిన సమయంలో రెండు వీధి కుక్కలను ఎలా దత్తత తీసుకున్నాడో అని వివరిస్తూ.. చైనా సైన్యం (People’s Liberation Army) చెప్పే ఓ నినాదంతో పోల్చుతూ జోక్‌ చెప్పాడు. దీంతో అక్కడున్నవారంతా నవ్వుతూ చప్పట్లు కొట్టారు. చైనా సైనికులను ప్రశంసిస్తూ అధ్యక్షుడు జిన్‌పింగ్‌ 2013లో ఆ నినాదాన్ని వాడారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. కమెడియన్‌ చెప్పిన ఆ జోక్‌ అసభ్యకరంగా ఉందంటూ అక్కడి సోషల్‌ మీడియాలో అభ్యంతరాలు మొదలయ్యాయి. దీంతో ఆ పోస్టుపై తీవ్ర చర్చ జరగడమే కాకుండా.. ప్రజలనుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇది కాస్త చైనా అధికారుల దృష్టికి వెళ్లడంతో వారు కూడా హాస్యనటుడి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

తన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం కావడంతో సదరు కమెడియన్‌ బహిరంగ క్షమాపణలు చెప్పాడు. తదుపరి కొన్నిరోజులపాటు తన కార్యక్రమాలన్నీ రద్దు చేసుకున్నాడు. అతడు ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థ కూడా అతడి కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇదే సమయంలో రంగంలోకి దిగిన బీజింగ్‌ కల్చరల్‌ లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీ.. ఆ కమెడియన్‌ పనిచేస్తున్న మీడియా సంస్థపై దర్యాప్తునకు ఉపక్రమించింది. కమెడియన్‌ వేసిన జోక్‌ సైన్యాన్ని అవమానపరిచే విధంగా ఉందని పేర్కొన్న చైనా సాంస్కృతిక శాఖ.. సదరు కంపెనీపై 14.7 మిలియన్‌ యువాన్ల (సుమారు రూ.17కోట్లు) జరిమానా విధించింది. కేవలం ఇదే కాకుండా.. అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేసే సెలబ్రిటీలు, నటులపైనా చైనా అధికారులు కఠినంగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని