China: ప్రపంచవ్యాప్తంగా ‘చైనా అక్రమ పోలీస్‌ స్టేషన్లు..’!

అభివృద్ధి చెందిన దేశాలైన కెనడా, ఐర్లాండ్‌ వంటి దేశాల్లో చైనా ప్రభుత్వం అక్రమంగా పోలీస్‌ పోస్టులను  ఏర్పాటు చేసిందని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి.

Published : 29 Sep 2022 01:22 IST

ఇప్పటికే 21 దేశాల్లో 30 తెరిచిందన్న తాజా నివేదిక

బీజింగ్‌: ప్రపంచంలో సూపర్‌ పవర్‌గా ఎదగాలని చూస్తోన్న చైనా (China).. ఇందుకోసం కొన్ని అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతోందని అనుమానాలు ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో అభివృద్ధి చెందిన దేశాలైన కెనడా, ఐర్లాండ్‌తోపాటు అనేక దేశాల్లో చైనా ప్రభుత్వం అక్రమంగా పోలీస్‌ పోస్టులను (Police Stations) ఏర్పాటు చేసిందని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. విదేశాల్లో ఉంటూ.. సొంత దేశంపై వ్యతరేకంగా మాట్లాడే వారిని అణచివేసే లక్ష్యంగా ఈ కేంద్రాలు పనిచేస్తున్నాయనే చెబుతున్నాయి. దీంతో ప్రపంచ దేశాలతో పాటు అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాల్లోనూ చైనా తీరుపై ఆందోళన వ్యక్తమవుతోంది.

విదేశీ గడ్డపై చైనాకు వ్యతిరేకంగా మాట్లాడే వారిని అణచివేసేందుకు గాను కెనడాలో పబ్లిక్‌ సెక్యూరిటీ బ్యూరో (PSB)కి అనుబంధంగా ఈ ‘అనధికారిక పోలీస్‌ సేవా కేంద్రాల’ (Police Service Stations) ను ఏర్పాటు చేస్తున్నట్లు ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్టుల నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం, కెనడా వ్యాప్తంగా పీఎస్‌బీలకు అనుబంధంగా ఈ పోలీస్‌ స్టేషన్లను చైనా (ఫ్యుజో పోలీస్‌) ఏర్పాటు చేసింది. కేవలం గ్రేటర్‌ టొరంటో (Canada) ప్రాంతంలోనే కనీసం మూడు స్టేషన్లు ఉన్నాయి. వీటితోపాటు ఈ చట్టవిరుద్ధమైన కేంద్రాల ద్వారా ఆయా దేశాల్లో జరిగే ఎన్నికల్లోనూ చైనా ప్రభుత్వం (China) ప్రభావితం చేస్తోంది. ఇలా ఇప్పటివరకు 21 దేశాల్లో 30 స్టేషన్లను తెరిచింది. చైనా పోలీస్‌ స్టేషన్ల (China Police Stations) కోసం ఉక్రెయిన్‌, ఫ్రాన్స్‌,స్పెయిన్‌, జర్మనీతోపాటు యూకే దేశాల్లోనూ ఏర్పాట్లు ఉన్నాయని తెలిపింది.

స్వదేశానికి తరలిస్తూ..

విదేశాల్లోని తమ పౌరులకు సహాయం చేసేందుకు ‘ఫ్యూజో పబ్లిక్‌ సెక్యూరిటీ బ్యూరో (PSB)’ పేరుతో ప్రపంచ దేశాల్లో చైనా ప్రభుత్వం పోలీస్‌ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. డ్రైవింగ్‌ లైసెన్స్‌తోపాటు ఇతర విషయాల్లో స్థానిక పోలీసులకు సహకరించేందుకు వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు చైనా చెప్పుకుంటోంది. ఇదే సమయంలో ఏదైనా కేసుల్లో చిక్కుకునే చైనీయులను న్యాయం పేరుతో స్వదేశానికి తీసుకెళ్లే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లు సమాచారం. ఇలా గడిచిన ఏడాదిన్నర కాలంలోనే రెండు లక్షలకు పైగా తమ పౌరులను  సొంత దేశానికి తరలించినట్లు సేఫ్‌గార్డ్‌ డిఫెండర్స్‌ అనే నివేదిక వెల్లడించింది.

ఇలాంటి ప్రయత్నాలతో చైనా మానవ హక్కుల (Human rights) ఉల్లంఘనలకు పాల్పడుతోందనే ఆరోపణలు ఉన్నాయి.  భద్రతా కారణాలు చెప్పి ఇలా తీసుకువచ్చిన పౌరులను నిర్బంధ క్యాంపులకు తరలించడం, కుటుంబాల నుంచి వేరుచేయడం, వారికి బలవంతంగా కుటుంబ నియంత్రణ చేస్తుండడంపై చైనా అధికార కమ్యూనిస్టు పార్టీపై మానవ హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. అయితే, ఇటువంటి వాటిని ‘వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రాలు’గా (Vocational Training Centre) చెబుతోన్న చైనా..  అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపడంతోపాటు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పరచేందుకేనని చెప్పుకుంటోంది. ఈ కేంద్రాల్లో శిక్షణ పొందినవారిలో డిగ్రీ చేసినవారే అధికంగా ఉన్నారని 2019 చివరలో చైనా అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts