China: పెలోసీ పర్యటన ఎఫెక్ట్‌.. అమెరికాతో చైనా చర్చలు బంద్‌

తమ హెచ్చరికలను పట్టించుకోకుండా అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ తైవాన్‌లో పర్యటించడంపై గుర్రుగా ఉన్న చైనా.. అగ్రరాజ్యంపై ప్రతిచర్యలకు పూనుకుంది. ఇప్పటికే పెలోసీపై ఆంక్షలు విధించిన డ్రాగన్‌ సర్కారు

Published : 06 Aug 2022 01:26 IST

బీజింగ్‌: తమ హెచ్చరికలను పట్టించుకోకుండా అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ తైవాన్‌లో పర్యటించడంపై గుర్రుగా ఉన్న చైనా.. అగ్రరాజ్యంపై ప్రతిచర్యలకు పూనుకుంది. ఇప్పటికే పెలోసీపై ఆంక్షలు విధించిన డ్రాగన్‌ సర్కారు.. తాజాగా అమెరికాతో పలు అంశాలపై చర్చలను తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

వాతావరణ మార్పుల దగ్గర్నుంచి, సైనిక సంబంధాలు, మాదకద్రవ్యాల నిరోధక ప్రయత్నాలు తదితర అంశాలపై ఇరు దేశాల మధ్య చర్చలను నిలిపివేయడం లేదా రద్దు చేస్తున్నట్లు చైనా వెల్లడించింది. ఇరు దేశాల మధ్య ఏరియా కమాండర్లు, రక్షణశాఖ విభాగ అధిపతులు సమావేశం జరగాల్సి ఉండగా.. దాన్ని రద్దు చేస్తున్నట్లు చైనా విదేశాంగ శాఖ తెలిపింది. అలాగే, మిలటరీ మారీటైమ్‌ సేఫ్టీ, అక్రమ వలసదారుల అప్పగింత వంటి అంశాలపై జరుగుతోన్న చర్చలను కూడా నిలిపివేస్తున్నట్లు తెలిపింది.

ఆసియా పర్యటనలో భాగంగా నాన్సీ పెలోసీ గత మంగళవారం తన బృందంలో కలిసి తైవాన్‌ రాజధాని తైపేలో పర్యటించిన విషయం తెలిసిందే. అయితే తైవాన్‌ను తమ భూభాగమే అని చెబుతూ వస్తోన్న డ్రాగన్‌.. ఈ పర్యటనను తీవ్రంగా పరిగణించింది. తమ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘిస్తూ అమెరికా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడిందని, ఇందుకు ఆ దేశం మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది. ఇందులో భాగంగానే ప్రతిచర్యలకు సిద్ధమైంది. తైవాన్‌లో పర్యటించినందుకు గానూ పెలోసీపై ఆంక్షలు విధించినట్లు వెల్లడించింది. అయితే అవి ఏరకమైన ఆంక్షలో మాత్రం చెప్పలేదు. మరోవైపు తైవాన్‌పై చైనా ఆర్థికపరమైన ఆంక్షలు విధించింది. ఆ ద్వీప దేశాన్ని భయపెట్టేందుకు తైవాన్‌ చుట్టూ భారీ సైనిక విన్యాసాలు చేపట్టింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని