UkraineCrisis: అమెరికా డాలర్‌ ఖడ్గానికి ఎదురుందా..?

డాలర్‌.. ప్రపంచ కరెన్సీ..! ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మొదలుపెట్టినప్పటి నుంచి ప్రపంచలోని చాలా దేశాలను ఇది ఆలోచనలో పడేసింది. పూర్తిగా డాలర్‌పై ఆధారపడిన సమయంలో అమెరికా కన్నెర్ర చేస్తే ఎప్పటికైనా ముప్పే అని అర్థం చేసుకొన్నాయి.

Updated : 08 Apr 2022 11:54 IST

 చమురు కొనుగోళ్లకు యువాన్లు చెల్లిస్తోన్న చైనా..

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

డాలర్‌.. ప్రపంచ కరెన్సీ..! ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మొదలు పెట్టినప్పటి నుంచి ప్రపంచంలోని చాలా దేశాలను ఇది ఆలోచనలో పడేసింది. పూర్తిగా డాలర్‌పై ఆధారపడిన సమయంలో.. అమెరికా కన్నెర్ర చేస్తే ఎప్పటికైనా ముప్పే అని అర్థం చేసుకొన్నాయి. అమెరికా ప్రధాన ప్రత్యర్థి అయిన రష్యా ఎప్పటి నుంచో డాలర్ల వాడకాన్ని గణనీయంగా తగ్గించుకొంటూ వస్తోంది. తాజాగా చైనా కూడా ఆ ప్రయత్నాలను తీవ్రం చేసింది. ఈ క్రమంలో అమెరికా ఆంక్షలను బేఖాతరు చేస్తూ రష్యా నుంచి చమురు, బొగ్గు కొనుగోలు చేసింది. యువాన్ల రూపంలో చెల్లించింది. యుద్ధం మొదలైన తర్వాత యువాన్లలో చెల్లింపులు చేయడం ఇదే తొలిసారి. మార్చిలో పలు చైనా కంపెనీలు రష్యా నుంచి ఇంధనం కొనుగోలుకు యువాన్లను వాడాయి. వాటికి సంబంధించిన చమురు, బొగ్గు ఎగుమతులు ఈ నెలలో ప్రారంభంకానున్నాయి. చైనాలో వేర్వేరు రిఫైనరీలకు ఇవి మే నెలలో చేరనున్నాయి. కాకపోతే.. ఏప్రిల్‌లో మాత్రం చైనా రిఫైనరీలు రష్యాతో కొత్తగా చమురు కాంట్రాక్టులు కుదుర్చుకోలేదు.

అమెరికాకు షాకివ్వనున్న సౌదీ..!

సౌదీ అరేబియా అమెరికాకు షాక్‌ ఇవ్వనున్నట్లు వార్తలొస్తున్నాయి. యువాన్లలో చైనాకు చమురు ఎగుమతి చేసే అంశంపై ఈ దేశం చర్చలు జరుపుతోంది. ప్రపంచ వ్యాప్తంగా చమురు వ్యాపారం 80 శాతం డాలర్లలోనే జరుగుతోంది. సౌదీ అరేబియా పెట్రోవ్యాపారం 1974 నుంచి పూర్తిగా డాలర్లలోనే చేస్తోంది. తాజాగా యువాన్లతో కూడా వ్యాపారం చేసేందుకు అంగీకరిస్తే.. నేరుగా అమెరికా డాలర్‌ పెత్తనాన్ని చైనా సవాలు చేసినట్లు అవుతుంది. ముఖ్యంగా అమెరికాలో బైడెన్‌ అధ్యక్షుడు అయ్యాక సౌదీతో బంధం బీటలు వారింది. యెమన్‌లో సౌదీ చేస్తోన్న యుద్ధానికి అమెరికా మద్దతు కొరవడటం.. ఇరాన్‌తో అణుఒప్పందం కోసం చర్చలను పునః ప్రారంభించడం వంటి అంశాలు దీనికి కారణం అయ్యాయి. దీనికి తోడు వాషింగ్టన్‌ పోస్టు జర్నలిస్టు జమాల్‌ ఖషోగ్జీ హత్యకు సౌదీని శిక్షిస్తానని 2020లో బైడెన్‌ పేర్కొన్నారు. ఆ తర్వాత అధికారం చేపట్టగానే.. సౌదీ తమ భాగస్వామి కాదని బైడెన్‌ నేరుగా వ్యాఖ్యానించారు. దీంతో అమెరికాపై సౌదీ యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ (ఎంబీఎస్‌)ఆగ్రహంగా ఉన్నారు. ఇటీవల బైడెన్‌ నుంచి వచ్చిన ఫోన్‌కాల్‌కు స్పందించేందుకు కూడా ఎంబీఎస్‌ ఇష్టపడలేదు.

పెట్రో డాలర్‌ పుట్టిందిలా..

1944లో ప్రధాన దేశాల మధ్య జరిగిన బ్రిటన్‌ ఉడ్స్‌ ఒప్పందం ప్రకారం డాలర్‌ను అంతర్జాతీయ వ్యాపారానికి కరెన్సీగా వాడటం మొదలుపెట్టారు. కానీ, 1971లో ద్రవ్యోల్బణం వచ్చింది. ఆ తర్వాత 1974లో పెట్రోవ్యాపారానికి డాలర్లను కరెన్సీగా చేయాలని సౌదీ-అమెరికా మధ్య ఒప్పందం కుదిరింది. ఇలా పెట్రోలియం ఎగుమతులతో వచ్చిన డాలర్లను అమెరికా ట్రెజరీ బాండ్లలో పెట్టుబడులుగా పెట్టేవారు. పెట్రోల్‌ ఎగమతి చేసే చాలా దేశాలు ఆ తర్వాత ఇదే మార్గాన్ని అనుసరించాయి. దీంతో ఆయా దేశాలు అంతర్జాతీయ మార్కెట్లలో ఇతర కొనుగోళ్లు, పెట్టుబడులకు డాలర్లనే వాడేవి. ఫలితంగా అమెరికా కరెన్సీకి డిమాండ్‌ పెరిగిపోయింది.

చమురు ధర దెబ్బకు భారత్‌ యత్నాలు..

భారత్‌ సహా చైనా, సౌదీ అరేబియా వంటి దేశాలు డాలర్‌కు ప్రత్యామ్నాయాన్ని చూస్తున్నాయి. భారత్‌ ప్రధాన దిగుమతి అయిన చమురు ధర ఇప్పుడు యుద్ధం కారణంగా భారీగా పెరిగిపోయింది. ఈ క్రమంలో రష్యా నుంచి చౌకగా వచ్చే చమురును కొనగోలు చేసేందుకు రూపాయి-రూబుళ్ల మార్గం అనుసరించాలని భావిస్తోంది. ఇప్పటి వరకు రష్యా నుంచి వచ్చే చమురు.. భారత్‌ మొత్తం ఇంధన దిగుమతుల్లో కేవలం 2శాతానికే పరిమితమైంది. చమురు చెల్లింపుల కోసం తమ పేమెంట్‌ వ్యవస్థ ఎస్‌పీఎఫ్‌ఎస్‌ను వాడుకోవచ్చని మాస్కో ఆఫర్‌ చేసింది.

ప్రత్యామ్నాయం ఉందా..?

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాల రిజర్వుల్లో 58.81 శాతం డాలర్లే ఉన్నాయి. ఇక 20.64శాతంతో  ఆ తర్వాతి స్థానంలో  యూరో ఉంది. ఇక చైనా కరెన్సీ 2.79 శాతంతో ఏడో స్థానంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పట్లో డాలర్‌కు ప్రత్యామ్నాయం పుట్టుకొచ్చే అవకాశం లేదు. చైనా యువాన్‌ను కొన్నేళ్ల నుంచి డాలర్‌కు ప్రత్యామ్నాయంగా మార్చాలని చూసినా.. ఇప్పటికీ రిజర్వుల్లో 3శాతానికే పరిమితమైంది. స్విఫ్ట్‌ లెక్కల ప్రకారం అంతర్జాతీయ వ్యాపారంలో 40 శాతం డాలర్లలోనే జరుగుతోంది. యువాన్‌తో జరిగేది కేవలం 3 శాతం మాత్రమే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని