Tibet: ‘టిబెట్‌ సంస్కృతిని చెరిపేసేందుకు చైనా ప్రయత్నం’ - నాన్సీ పెలోసీ

టిబెట్‌ సంస్కృతిని చెరిపేసేందుకు చైనా ప్రయత్నిస్తోందని.. వాటిని అమెరికా ఎట్టి పరిస్థితుల్లోనూ సాగనివ్వదని యూఎస్‌ హౌస్‌ మాజీ స్పీకర్ నాన్సీ పెలోసీ స్పష్టం చేశారు.

Published : 19 Jun 2024 22:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టిబెట్‌ సంస్కృతిని చెరిపేసేందుకు చైనా ప్రయత్నిస్తోందని అమెరికా ప్రతినిధుల సభ మాజీ స్పీకర్ నాన్సీ పెలోసీ ఆరోపించారు. భారత్‌ పర్యటనలో ఉన్న ఆమె.. హిమాచల్‌ ప్రదేశ్‌లోని ధర్మశాలలో ఉంటున్న బౌద్ధమత గురువు దలైలామాతో భేటీ అయ్యారు. అమెరికా చట్టసభ విదేశీ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ మెక్‌కాల్‌తోపాటు ఇతర సభ్యుల బృందం ఆమెతో ఉన్నారు.

‘‘గతంలో చైనా అధ్యక్షుడు అమెరికాలో పర్యటించినప్పుడు ఇదే విషయాన్ని చెప్పా. టిబెట్‌ సంస్కృతిని చెరిపేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకించా. అయితే, అక్కడ ఏం జరుగుతుంది? టిబెట్‌లో చైనా చేస్తున్న అభివృద్ధి ఏంటనే విషయాలను వెళ్లి చూడాలని చైనా అధ్యక్షుడు నాతో చెప్పారు. అందుకు నేను ధన్యవాదాలు చెప్పా. ఎందుకంటే.. టిబెట్‌ వీసా కోసం 25ఏళ్లుగా ప్రయత్నిస్తున్నా’ అని నాన్సీ పెలోసీ గుర్తుచేశారు.

సంపన్నుల స్వర్గధామం.. దుబాయ్‌ వైపే వారి చూపు!

టిబెట్‌ వివాద పరిష్కారానికి సంబంధించి తన అభిప్రాయాన్ని వెల్లడించిన మాజీ స్పీకర్‌ పెలోసీ.. భాష వాడకాన్ని తగ్గించి టిబెట్‌ సంస్కృతిని చెరిపేసేందుకు చైనా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. దీన్ని అమెరికా ఎంతమాత్రం సాగనివ్వదని అన్నారు. ఇందుకోసం చైనాపై మరింత ఒత్తిడి పెంచే ఓ బిల్లుపై అధ్యక్షుడు జో బైడెన్‌ త్వరలోనే సంతకం చేయనున్నారని తెలిపారు.

ది రిసాల్వ్‌ టిబెట్‌ చట్టం ద్వారా.. టిబెట్‌ నాయకులతో చర్చలు జరపాలని చైనాకు పిలుపునివ్వనున్నట్లు పెలోసీ చెప్పారు. తద్వారా టిబెటియన్ల చారిత్రక, సాంస్కృతిక, మతపరమైన, భాషా గుర్తింపు వంటి చిరకాల డిమాండ్లకు పరిష్కారం చూపాలని చైనాను కోరనున్నామని అన్నారు. తాజా పర్యటనలో భాగంగా తొలుత టిబెట్‌లో పర్యటించిన పెలోసీ బృందం.. అక్కడనుంచి ధర్మశాలలో ఉన్న దలైలామాతో భేటీ అయ్యింది. అయితే, పెలోసీ బృందం పర్యటనపై చైనా స్పందిస్తూ.. ది రిసాల్వ్‌ యాక్టుపై బైడెన్‌ సంతకం చేయొద్దని కోరింది. దలైలామా గ్రూపును చైనా వ్యతిరేక వేర్పాటువాద శక్తిగా గుర్తించాలని పేర్కొనడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని