China: యుద్ధ మేఘాలు.. చైనా మిలటరీ రిక్రూట్‌మెంట్‌లో కీలక మార్పులు

చైనా (China), తైవాన్‌ (Taiwan) మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న నేపథ్యంలో డ్రాగన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. యుద్ధకాల మిలటరీ రిక్రూట్‌మెంట్‌ (Wartime Military Recruitment) లో నిబంధనలను సవరించింది.

Published : 13 Apr 2023 22:56 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తైవాన్‌ (Taiwan) పై యుద్ధానికి కాలు దువ్వుతున్న చైనా (China) తాజాగా యుద్ధకాల మిలటరీ రిక్రూట్‌మెంట్‌ (Wartime Military Recruitment) నిబంధనలను సవరించింది. ఈ మేరకు అధ్యక్షుడు జిన్‌పింగ్‌ నేతృత్వంలోని చైనా మిలటరీ హైకమాండ్‌ స్టేట్‌ కౌన్సిల్‌ అండ్‌ సెంట్రల్‌ మిలటరీ కమిషన్‌ (cmc) వెల్లడించింది. ఇందులో భాగంగా మాజీ సైనికులకు ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు, శక్తివంతమైన సైనికబృందాలను ఏర్పాటు చేయడం, నిర్బంధ విధానాలను అమలు చేయడం లాంటి నిబంధనలు ఉన్నాయి. చైనా చేపట్టిన తాజా చర్యలను తైవాన్‌పై యుద్ధానికి సంసిద్ధతగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నిబంధనలు మే నెల నుంచి అమల్లోకి రానున్నాయి.

మరోవైపు తైవాన్‌తో యుద్ధాన్ని దృష్టిలో ఉంచుకొని, సైనిక బలగాలను బలోపేతం చేసేందుకే చైనా రిక్రూట్‌మెంట్‌ నిబంధనలను సవరించినట్లు హాంగ్‌కాంగ్‌ కేంద్రంగా పని చేస్తున్న ‘సౌత్‌ చైనా మార్నింగ్ పోస్ట్‌’ పత్రిక వెల్లడించింది. యుద్ధకాల రిక్రూట్‌మెంట్‌లో మాజీ సైనికులకు ప్రాధాన్యత ఇచ్చేలా చైనా ఇలాంటి నిబంధనలు తీసుకురావడం ఇదే తొలిసారి. కేవలం తైవాన్‌తో మాత్రమే కాకుండా దక్షిణ చైనా సముద్రం అంశంతోపాటు భారత్‌తోనూ వివాదాలు రాజుకుంటున్న నేపథ్యంలో చైనా ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. చైనాకి చెందిన పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (పీఎల్‌ఏ) తన యుద్ధ సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు తైవాన్‌ సరిహద్దు ప్రాంతాల్లో యుద్ధవిమానాలు, నౌకలతో ఇటీవల విన్యాసాలు నిర్వహించింది. 

తైవాన్‌ అధ్యక్షురాలు త్సాయ్‌ ఇంగ్‌వెన్‌ కాలిఫోర్నియాలో అమెరికా హౌస్‌ స్పీకర్‌ మెక్‌ కార్టీతో భేటీ అయిన తర్వాతి రోజునే చైనా ఈ చర్యలకు ఉక్రమించింది. అంతేకాకుండా రొనాల్డ్‌ రీగన్‌ ప్రెసిడెన్సియల్‌ లైబ్రరీ, ఆసియాకు చెందిన వివిధ సంస్థలపై చైనా ఆంక్షలు విధించింది. తైవాన్‌తో విదేశీ ప్రభుత్వాలు ఎలాంటి అధికారిక ఒప్పందాలు చేసుకున్నా... అది ఆ ద్వీపంపై తన సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించడమేనని చైనా చెబుతోంది. చైనా తాజాగా తీసుకొచ్చిన నిబంధనలతో యుద్ధకాలంలో రిక్రూట్‌మెంట్‌ విధానాన్ని సవరించే అధికారం స్టేట్‌ కౌన్సిల్‌, సీఎంసీలకు ఉంటుంది. 

దీనికి సంబంధించి తీర్మానానికి చైనా ప్రజాప్రతినిధులు ఫిబ్రవరి నెలలోనే ఆమోదముద్ర వేశారు. దీనిపై చైనాకు చెందిన సైనిక న్యాయనిపుణుడు ‘క్సీ డాన్‌’ మాట్లాడుతూ.. ఈ సవరణ చైనా యుద్ధకాల చట్టంలో ఖాళీని భర్తీ చేసిందని అన్నారు. అయితే, తైవాన్‌కు వ్యతిరేకంగా సైనిక సన్నాహాల అవసరం కూడా దీనికి కారణమైందని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో సైనిక నిబంధనలను మెరుగుపరచడం చాలా ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. దశాబ్దాల కాలంగా చైనా ఎలాంటి యుద్ధాల్లో పాల్గొనక పోయినందున సైనిక చట్టాలు బలహీనంగా మారాయని, తాజా వాటిని బలోపేతం చేయాల్సిన అవసరం ఏర్పడిందని ఆయన అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని