China: చైనాను కుదిపేస్తున్న వంటనూనెల కుంభకోణం..!

చైనాలో పెద్దఎత్తున కలుషిత నూనెలను ప్రజలకు సరఫరా చేసినట్లు గుర్తించారు. దీంతో దేశవ్యాప్తంగా తీవ్రంగా ఆందోళన వ్యక్తమవుతోంది. 

Updated : 11 Jul 2024 13:17 IST

ఇంటర్నెట్‌డెస్క్: చైనా(China)ను ఇప్పుడు వంటనూనెల నాణ్యత కుంభకోణం కుదిపేస్తోంది. వీటి రవాణాకు ఉపయోగించిన విధానాలు దేశవ్యాప్తంగా ప్రశ్నార్థకంగా మారాయి. అత్యంత ప్రమాదకరమైన కెమికల్స్‌ను రవాణా చేసిన కంటైనర్లను శుభ్రపర్చకుండానే వంటనూనెలు నింపి తరలించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయం ఆన్‌లైన్‌లో ఒక్కసారిగా గుప్పుమనడంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి.

దీంతోపాటు ఇంధన రవాణాకు ఉపయోగించే ట్యాంకర్లను వంట నూనెలు, సిరప్‌లు తరలించేందుకు వాడినట్లు గుర్తించారు. వీటిని సరిగ్గా డీకంటామినేట్‌ చేయకుండానే వినియోగించినట్లు ప్రభుత్వ రంగానికి చెందిన బీజింగ్‌ న్యూస్‌ కథనంలో వెల్లడించింది.

చైనాలో వంటనూనెను ఇలా ప్రమాదకర కంటైనర్లలో తరలించడమనేది ఆ పరిశ్రమలో బహిరంగ రహస్యమని ఆ పత్రిక వెల్లడించింది. ఆహార భద్రత విషయంలో ప్రభుత్వం తీసుకొనే చర్యలపై ఈ పరిణామాలతో ప్రజల్లో నమ్మకం సన్నగిల్లింది. ఈ విషయం ఇప్పుడు చైనా సోషల్‌మీడియాలో టాప్‌ ట్రెండింగ్‌కు చేరింది. వీబో (చైనా సామాజిక మాధ్యమం)లో ఈ కుంభకోణం కథనాన్ని మిలియన్ల మంది చూశారు. ఈ వ్యవహారంలో చైనా ప్రభుత్వరంగ కంపెనీలు సినోగ్రెయిన్‌, హోప్‌ఫుల్‌ గ్రెయిన్‌ అండ్‌ ఆయిల్‌ గ్రూప్‌ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. సినోగ్రామ్‌ ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొంది. నిబంధనలు అతిక్రమించిన ట్రక్కులను సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. హోప్‌ఫుల్‌ గ్రెయిన్‌ కూడా ఈ మొత్తం వ్యవహారంపై దృష్టిపెట్టినట్లు గ్లోబల్‌ టైమ్స్‌కు వెల్లడించింది.  

2008లో పాలు..

2008లో కూడా చైనాలో ఆహార కల్తీ కుంభకోణం దేశాన్ని కుదిపేసింది. నాడు మెలామైన్‌ అనే కెమికల్‌ను పాలపౌడర్‌లో కలిపి విక్రయించడంతో 3,00,000 మంది చిన్నారులు అనారోగ్యం పాలయ్యారు. ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. సన్‌లూ మిల్క్‌ కుంభకోణంగా దీనికి పేరు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని