Japan: ‘క్వాడ్‌’ వేళ రష్యా, చైనా ఫైటర్‌ జెట్‌ల విన్యాసాలు.. ఆందోళన వ్యక్తం చేసిన జపాన్‌

క్వాడ్‌ సదస్సు జరుగుతోన్న వేళ చైనా, రష్యా యుద్ధ విమానాలు జపాన్‌ సమీపంలో సంయుక్త విన్యాసాలు నిర్వహించడం కలకలం రేపింది. జపాన్ రక్షణ మంత్రి నోబువో కిషి ఈ విషయాన్ని ధ్రువీకరించారు. అమెరికా, భారత్‌, ఆస్ట్రేలియా, జపాన్‌...

Published : 24 May 2022 21:52 IST

టోక్యో: క్వాడ్‌ సదస్సు జరుగుతోన్న వేళ చైనా, రష్యా యుద్ధ విమానాలు జపాన్‌ సమీపంలో సంయుక్త విన్యాసాలు నిర్వహించడం కలకలం రేపింది. జపాన్ రక్షణ మంత్రి నోబువో కిషి ఈ విషయాన్ని ధ్రువీకరించారు. అమెరికా, భారత్‌, ఆస్ట్రేలియా, జపాన్‌ నేతలు ప్రాంతీయ భద్రతపై చర్చలు జరుపుతున్న సమయంలో ఈ విన్యాసాలు చేపట్టడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇరు దేశాలతో ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్లు చెప్పారు. అయితే, ఈ యుద్ధ విమానాలు తమ ప్రాదేశిక గగనతలాన్ని ఉల్లంఘించలేదని తెలిపారు. మరోవైపు.. రష్యా రక్షణ శాఖ సైతం ఈ విషయాన్ని వెల్లడించింది. రష్యా, చైనా సైనిక విమానాలు ఆసియా- పసిఫిక్ ప్రాంతంలో సంయుక్త విన్యాసాలు నిర్వహించాయని..  జపాన్‌, తూర్పు చైనా సముద్రాలపై 13 గంటలపాటు జాయింట్ పెట్రోలింగ్ కొనసాగించాయని పేర్కొంది.

రెండు చైనా యుద్ధ విమానాలు జపాన్ సముద్రంలో మరో రెండు రష్యన్ బాంబర్లు  కలిసి తూర్పు చైనా సముద్రంపై ఉమ్మడి విన్యాసాలు చేశాయని కిషి చెప్పారు. ఆ తర్వాత నాలుగు యుద్ధ విమానాలు తూర్పు చైనా సముద్రం నుంచి పసిఫిక్‌ మహాసముద్రం వైపు వెళ్లినట్లు తెలిపారు. అంతకుముందు ఓ రష్యన్‌ నిఘా విమానం సైతం ఉత్తర హక్కైడో నుంచి మధ్య జపాన్‌లోని నోటో ద్వీపకల్పం దిశగా వెళ్లిందని ఆరోపించారు. టోక్యోలో క్వాడ్‌ శిఖరాగ్ర సమావేశం జరుగుతోన్న వేళ.. ఈ చర్యలను రెచ్చగొట్టేవిగా అభివర్ణించారు. దేశ, ప్రాంతీయ భద్రతల దృష్ట్యా.. దౌత్యమార్గాల ద్వారా తమ ఆందోళనలను తెలియజేసినట్లు చెప్పారు. దురాక్రమణదారు అయిన రష్యాతో కలిసి చైనా ఇటువంటి కార్యకలాపాలు చేపట్టడం ఆందోళన కలిగిస్తోందని.. దీన్ని విస్మరించలేమన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని