China: ఫిలిప్పీన్స్‌ నౌకను ఢీకొన్న చైనా కోస్ట్‌గార్డ్‌ ఓడ..!

చైనా కోస్టు గార్డ్‌ చట్టంలోని ఓ వివాదాస్పద నిబంధన అమల్లోకి వచ్చిన రెండ్రోజుల్లోనే దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. 

Published : 17 Jun 2024 13:39 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దక్షిణ చైనా సముద్రంలో మరోసారి ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. చైనాకు చెందిన కోస్ట్‌గార్డ్‌ నౌక ఫిలిప్పీన్స్‌కు చెందిన ఓ సరకు రవాణా ఓడను ఢీకొంది. సోమవారం ఉదయం స్పార్ట్లీ ద్వీపాల వద్ద ఈ ఘటన చోటు చేసుకొంది. దీనికి బాధ్యత ఫిలిప్పీన్స్‌ నౌకదే అంటూ బీజింగ్‌ ఆరోపించింది. ‘‘ఫిలిప్పీన్స్‌ సరకు రవాణా నౌకను ఎన్నిసార్లు హెచ్చరించినా వినలేదు. అది మా ఓడ వైపు దూసుకొచ్చి ఢీకొంది. దీంతో చట్టప్రకారం మా నౌక దానిపై నియంత్రణ సాధించింది. ఫిలిప్పీన్స్‌ ఓడ మా రెన్‌ ఎ రీఫ్ వైపు అక్రమంగా వెళుతోంది’’ అని ఆరోపించింది. 

మరోవైపు ఫిలిప్పీన్స్‌ మాత్రం ఈ వ్యవహారంలో చైనా నావికులు అమానవీయంగా ప్రవర్తించారని ఆరోపించింది. ఇక ఆ దేశాధ్యక్షుడు ఎఫ్‌.మార్కోస్‌ మాట్లాడుతూ చైనా అమల్లోకి తెచ్చిన సరికొత్త కోస్టుగార్డ్‌ చట్టం భయంకరమైందని అభివర్ణించారు. ఇవి పొరుగుదేశాలకు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. సెకండ్‌ థామస్‌ షోల్‌ వద్ద ఉన్న తమ గస్తీ బృందానికి ఫిలిప్పీన్స్‌ నౌక నిత్యావసరాలు సరఫరా చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకొంది.  

రెండ్రోజుల క్రితమే అమల్లోకి వచ్చిన చైనా కోస్ట్‌గార్డ్‌ చట్టం నిబంధన..

ఓవైపు దక్షిణ చైనా సముద్రంపై పొరుగుదేశాలతో వివాదాలు నడుస్తున్న సమయంలో చైనా కోస్టుగార్డు చట్టంలో సరికొత్త నిబంధనను శనివారం అమల్లోకి తెచ్చింది. దీనిప్రకారం తన జల సరిహద్దులను అతిక్రమించిన విదేశీయులను బీజింగ్‌ బలగాలు 30 నుంచి 60 రోజులపాటు నిర్బంధించే అవకాశాన్ని కల్పించింది. ఈనేపథ్యంలో దక్షిణ, తూర్పు చైనా సముద్రాలు తనవేనని బీజింగ్‌ వాదిస్తోంది. ఇప్పుడు వాటిల్లోకి వచ్చే సమీప దేశాల సిబ్బందిని బంధించేందుకు చైనా కోస్టుగార్డ్‌కు స్వేచ్ఛనిచ్చినట్లైంది. తాజాగా ఈ చట్టం అమల్లోకి రాగానే ఫిలిప్పీన్స్‌ నౌకను ఢీకొట్టడం గమనార్హం. ఇప్పటికే ఈ సముద్రంలో గస్తీ కాస్తున్న చైనా నౌకలు తరచూ ఇతర ఓడలపై జలఫిరంగులను ప్రయోగించడం వంటి ఘటనలకు పాల్పడుతున్నాయి. పలుమార్లు ఫిలిప్పీన్స్‌ షిప్‌లు వీటికి బాధితులుగా మిగిలాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు