China: మా నౌక ఏ దేశ భద్రతకు ముప్పుకాదు: చైనా

శ్రీలంకలోని హంబన్‌టోట రేవులో లంగరేసిన నిఘా నౌక యువాన్‌ వాంగ్‌-5 ప్రయాణాన్ని చైనా సమర్థించుకొంది.

Published : 17 Aug 2022 12:45 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: శ్రీలంకలోని హంబన్‌టోట రేవులో లంగరువేసిన  నిఘా నౌక యువాన్‌ వాంగ్‌-5 ప్రయాణాన్ని చైనా సమర్థించుకొంది. ఆ నౌక ఏ దేశ భద్రతకు ముప్పుగా పరిణమించదని.. అదే సమయంలో మూడో పక్షం అడ్డంకులు సృష్టించకూడదని చైనా పేర్కొంది. చైనా విదేశాంగశాఖ ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ మాట్లాడుతూ.. శ్రీలంక చురుకైన సహకారంతో ‘యువాన్‌ వాంగ్‌-5’ నౌక విజయవంతంగా ఆ దేశంలో లంగరు వేసిందని పేర్కొన్నారు. ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ 51 బిలియన్‌ డాలర్ల రుణాలు చెల్లించలేని స్థితిలో శ్రీలంక ఉంది. ఈ నేపథ్యంలో చైనా ఏమైనా ఆర్థిక సాయం చేస్తుందా..? అని ఓ విలేకరి ప్రశ్నించగా.. వాంగ్‌ వెన్‌బిన్‌ ఆ ప్రశ్నను దాటవేశారు.

ఈ నౌక హంబన్‌టోట చేరుకోగానే నిర్వహించిన ఉత్సవాల్లో లంక అధ్యక్షుడు రణిల్‌ విక్రమ సింఘే ప్రతినిధితోపాటు 10 పార్టీల అధ్యక్షులు పాల్గొన్నారని వాంగ్‌ వివరించారు. శ్రీలంక, చైనా జాతీయ గీతాలను ఆలపించగా.. సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు జరినట్లు పేర్కొన్నారు. ఈ నౌక చమురు నింపుకోవడం, ఇతర అవసరాలు తీర్చుకోవడానికి కొంత సమయం పడుతుందని వెల్లడించారు.

తొలుత శ్రీలంక ఈ నౌక రాకను వాయిదా వేయాలని చైనాను కోరింది. కానీ,  తర్వాత చైనా-లంక అధికారుల మధ్య చర్చలు జరిగాయి. చివరికి శ్రీలంక ఈ నౌకకు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో లంక అధికారులతో జరిపిన చర్చల వివరాలను వెల్లడించేందుకు వాంగ్‌ నిరాకరించారు. శ్రీలంకను కష్టాల నుంచి బయట పడేయటానికి చైనా సాయం చేసిందని ఆయన వివరించారు. భవిష్యత్తులో కూడా ఈ సాయాన్ని కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఇరు దేశాలు సముద్రశోధనలో సహకరించుకొంటున్నాయని వెల్లడించారు. వాస్తవానికి శ్రీలంకలో బిలియన్ల డాలర్ల పెట్టుబడులను చైనా పెట్టింది. కానీ, లంక ఆర్థిక సంక్షోభ సమయంలో కేవలం 73 మిలియన్‌ డాలర్ల విలువైన బియ్యాన్ని పంపించి మౌనంగా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని