China: డ్రాగన్‌ గుప్పిట్లో కంబోడియా..?

చైనాకు మలక్కా జలసంధి, ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో బలప్రదర్శనకు అనుకూలంగా చైనా రంగం సిద్ధం చేసుకొంటోంది. చైనా భూభాగం బయట రహస్యంగా రెండో

Updated : 08 Jun 2022 12:18 IST

 సైనిక స్థావరం నిర్మాణానికి ఏర్పాట్లు

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

మలక్కా జలసంధి, ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో బల ప్రదర్శనకు చైనా సిద్ధం అవుతోంది. చైనా భూభాగం బయట రహస్యంగా రెండో సైనిక స్థావరాన్ని ఆసియాలో నిర్మించతలపెట్టింది. దీనికి కంబోడియాను పావుగా ఎంచుకొంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఆ దేశ ప్రభుత్వాన్ని ముగ్గులోకి దించింది. ఈ స్థావరం నిర్మాణ పనులను గురువారం నుంచి మొదలుపెట్టనున్నట్లు ‘ది వాషింగ్టన్‌ పోస్టు’ కథనం వెలువరించింది. అదే రోజు నిర్మాణం, ఆర్థిక సహకారంలో చైనా పాత్ర తేలే అవకాశం ఉంది. మరోపక్క కంబోడియా ప్రభుత్వం అబ్బే అటువంటిదేమీ లేదు అంటూ బుకాయిస్తోంది. కేవలం కంబోడియా నౌకాదళాన్ని బలోపేతం చేయడానికే ఈ ఆధునికీకరణ పనులు అని చెబుతోంది. ఈ నౌకాశ్రయ అభివృద్ధి పనులకు సంబంధించి మాత్రం ఈ వారం రెండు భూమి పూజలు నిర్వహిస్తున్నట్లు కంబోడియా ప్రతినిధి పైసిఫాన్‌ ధ్రువీకరించారు.  వాస్తవానికి ఈ సైనిక స్థావరం నిర్మిస్తే నిఘా పరికరాలు మలక్కా జలసంధికి అత్యంత సమీపంలోకి వచ్చి చేరతాయి. 

చైనా నౌకాదళానికి అత్యవసరం..

ప్రపంచాన్ని శాసించాలంటే బలమైన నౌకాదళం ఉండాల్సిందే. గతంలో ప్రపంచాన్ని ఏలిన ఐరోపా దేశాలకు యుద్ధనౌకలే బలం. ఇప్పుడు ప్రపంచ శక్తిగా ఎదిగిన అమెరికా సైన్యానికి అదే వెన్నెముక. ప్రస్తుతం చైనా వద్ద ఉన్న యుద్ధ నౌకల సంఖ్య ఇటీవలే అమెరికా యుద్ధ నౌకల సంఖ్యను దాటేసింది. అమెరికా వద్ద 297  యుద్ధ నౌకలు ఉండగా.. చైనా వద్ద 355 ఉన్నాయి. 2030 నాటికి ఈ సంఖ్య 460కు చేరవచ్చని అంచనా. ‘నేవల్‌ వార్‌ కాలేజ్‌’లోని పరిశోధకుడు ఆండ్రూ ఎరిక్సన్‌ దీనిపై మాట్లాడుతూ.. ‘‘విదేశీ స్థావరాలతో కూడిన బలమైన నెట్‌వర్క్‌ లేకపోతే చైనా నౌకలన్నీ వృథానే . ఎందుకంటే సుదూర ప్రాంతాల్లో స్థావరాలు లేకుండా వీటి నిర్వహణ కష్టం’’ అని అన్నారు.  ఇప్పటి వరకు అమెరికాకు 500ల సైనిక స్థావరాలు వివిధ దేశాల్లో ఉన్నాయి. అదే అగ్రరాజ్యానికి వ్యూహాత్మక ఆధిపత్యాన్ని ఇస్తోందని సెంటర్‌ ఫర్‌ న్యూఅమెరికన్‌ సెక్యూరిటీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌  రీచర్డ్‌ ఫాంటెయిన్‌ పేర్కొన్నారు. చైనాకు జిబూటిలో తప్ప మరో చోట అధికారికంగా సైనిక స్థావరాలు లేవు. పాకిస్థాన్‌లోని గ్వదార్‌, శ్రీలంకలోని హంబన్‌టోటా రేవులను స్థావరాలుగా వాడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

ఆద్యంతం అనుమానాస్పదం..

కంబోడియాలోని రీమ్‌ నౌకాదళ స్థావరంలో చైనాకు కొంత ప్రదేశం కేటాయించే అవకాశాలు ఉన్నాయి. దీనిలో ఉత్తర భాగాన్ని వాడుకోవాలని 2020 నుంచి చైనా ప్రణాళికలు తయారు చేస్తోంది. ఇక్కడైతే డ్రాగన్‌ ఉనికి గోప్యంగా ఉంటుంది. ఇందుకోసం ఈ నౌకా స్థావరంలో చాలా రోజుల నుంచి విదేశీ వ్యక్తుల కదలికలను కంబోడియా పూర్తిగా నియంత్రిస్తోంది. చాలా చోట్ల చైనా దళాలు యూనిఫామ్‌లో ఉంటున్నాయి. 

అమెరికా నిర్మాణాలు ధ్వంసం..

2020లో రీమ్‌ స్థావరంలో కంబోడియా నేషనల్‌ కమిటీ ఫర్‌ మారిటైమ్‌ సెక్యూరిటీ టాక్టికల్‌ హెడ్‌ క్వార్టర్‌ను ధ్వంసం చేసింది. 2012లో అమెరికా ఆర్థిక, సాంకేతిక సాయంతో వీటిని నిర్మించారు. గతేడాది అమెరికా డిప్యూటీ సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ అక్కడికి వచ్చిన సమయంలో ఆమె పర్యటనను పరిమిత ప్రాంతాల్లోనే ఏర్పాటు చేశారు. అమెరికా సహకారంతో ఏర్పాటు చేసిన వాటిని ఎందుకు తొలగించారో కంబోడియాను వివరణ కోరారు. దీంతోపాటు మరోసారి నిధులు ఇస్తామని ఆఫర్‌ చేశారు. కానీ, కంబోడియా ఆ ఆఫర్‌ను తిరస్కరించింది. ఆ తర్వాత  రీమ్‌ స్థావరంలో కొంత భాగం 30 ఏళ్ల పాటు వాడుకొనేందుకు చైనాకు ఇచ్చింది. ఈ లీజ్‌ ఆటోమేటిక్‌గా ప్రతి పదేళ్లకోసారి రెన్యూవల్‌ అవుతుందని ‘మారిటైమ్‌ ఎగ్జిక్యూటివ్‌’ కథనంలో పేర్కొంది. ఇక్కడ చైనా సైన్యం నిర్మాణాలు మొదలుపెట్టిందని పెంటగాన్‌ నివేదిక పేర్కొంది. బహుశా ఈ స్థావరం అభివృద్ధికి చైనా సహాయాన్ని అంగీకరించి ఉంటుందని ఆ నివేదికలో వెల్లడించారు. చైనా సైన్యం పాత్రను దాచిపెట్టేందుకు ఇరు పక్షాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. చైనా భూభాగం బయట నిర్మిస్తున్న రెండో సైనిక స్థావరం ఇదే. గతంలో జబూటీ వద్ద చైనా సైనిక స్థావరాన్ని ప్రారంభించింది.

రీమ్‌ స్థావరంలో గతంలో ఉన్న జాయింట్‌ వియత్నామీస్‌ ఫ్రెండ్షిప్‌ బిల్డింగ్‌ను కూడా గతేడాది వేరే స్థావరానికి మార్చారు. చైనా సైనిక సిబ్బందితో ఘర్షణలు నివారించేందుకే ఈ నిర్ణయం తీసుకొన్నట్లు భావిస్తున్నారు. దక్షిణ చైనా సముద్రంలో హక్కుల కోసం వియత్నాం చైనాతో తలపడుతోన్న విషయం తెలిసిందే.

శక్తిప్రదర్శనకు స్థావరాల కోసం వేట..

2017లో ప్రారంభించిన జబూటీ సైనిక స్థావరం తర్వాత బీజింగ్‌ కొత్తవాటి ఏర్పాటు వేటలో పడింది. నౌకాదళం, వాయుసేన, పదాతి దళం, సైబర్‌, స్పేస్‌ రంగాల్లో బలపేడేందుకు వీలుగా కొత్త స్థావరాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు పెంటగాన్‌ నివేదిక పేర్కొంది. ఇందుకోసం డ్రాగన్‌ దాదాపు డజనుకు పైగా దేశాల పేర్లను పరిశీలిస్తోంది. వీటిల్లో కంబోడియా,థాయ్‌ల్యాండ్‌, సింగపూర్‌, ఇండోనేషియా, పాకిస్థాన్‌, శ్రీలంక, టాంజానియా యూఏఈ పేర్లు ఉన్నాయి. చైనా విదేశీ స్థావరాలు అమెరికాకు అడ్డంకులు సృష్టించడంతోపాటు.. అమెరికాకు వ్యతిరేకంగా చేపట్టే కీలకమైన ఆపరేషన్లకు మద్దతుగా ఉంటాయి.  ఇప్పటికే యూఏఈలోని అబుదాబీ పోర్టు వద్ద రహస్యంగా సైనిక స్థావరం నిర్మిస్తున్న విషయం బయటకు పొక్కింది. దీంతో అమెరికా అప్రమత్తమై ఒత్తిడి చేయడంతో నిర్మాణాన్ని నిలిపివేశారు.

బైడూ వ్యవస్థ ఏర్పాటు..

రీమ్‌ నేవల్‌ బేస్‌లో బైడూ నేవిగేషన్‌ శాటిలైట్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. జీపీఎస్‌కు ప్రత్యామ్నాయంగా చైనా దీనిని అభివృద్ధి చేసింది. క్షిపణులను లక్ష్యాల వైపు నడిపించేందుకు ఈ వ్యవస్థను వినియోగించవచ్చు. అంతేకాదు దళాల కదలికలకు కూడా బైడూ ఉపయోగపడుతుందని మార్చిలో పెంటగాన్‌ ఇచ్చిన నివేదిక పేర్కొంది. దక్షిణ చైనా సముద్రంలోని మిగిలిన దేశాలపై ఒత్తిడి పెంచేందుకు ఈ సైనిక స్థావరాన్ని వాడుకొనే అవకాశం ఉంది. కీలకమైన సింగపూర్‌ జలసంధికి ఈ కంబోడియా నావికాదళ స్థావరం అత్యంత సమీపంలో ఉంటుంది. ఈ జలసంధి నుంచి ఏటా 83 వేలకు  పైగా నౌకలు ప్రయాణిస్తుంటాయి. ప్రపంచ సముద్ర రవాణాలో ఇది 40శాతానికి సమానం. దీంతోపాటు అత్యంత కీలకమైన దక్షిణ చైనా సముద్రంలోని దక్షిణ భాగంలో చైనా నౌకలు మోహరించేందుకు అవకాశం లభిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని