Zero Covid policy: బాధ్యతగా మాట్లాడితే బెటర్‌.. WHOకు హితవు చెప్పిన డ్రాగన్ దేశం..!

తన కొవిడ్ జీరో వ్యూహంపై చైనా పునరాలోచించుకోవాలంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ అధిపతి చేసి వ్యాఖ్యలపై డ్రాగన్ దేశం మండిపడింది.

Published : 12 May 2022 01:33 IST

బీజింగ్‌: తన కొవిడ్ జీరో వ్యూహంపై చైనా పునరాలోచించుకోవాలంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ అధిపతి చేసిన వ్యాఖ్యలపై డ్రాగన్ దేశం మండిపడింది. ఈ తరహా బాధ్యతారహితమైన వ్యాఖ్యలు మానుకోవాలని హితవు పలికింది. ఆరోగ్య సంస్థ ఇచ్చిన సూచనపై చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మాట్లాడుతూ, తమ విధానాన్ని సమర్థించుకున్నారు. 

‘సంబంధిత వ్యక్తులు కరోనా కట్టడికి చైనా అనుసరిస్తోన్న విధానంపై సహేతుకమైన అభిప్రాయం కలిగి ఉంటారని ఆశిస్తున్నాం. అలాగే వాస్తవాలను మెరుగ్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారని, బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చేయకుండా ఉంటారని భావిస్తున్నాం’ అంటూ ఘాటుగా స్పందించారు. అలాగే కొవిడ్ జీరో విధానంపై ఆన్‌లైన్‌లో చర్చలు జరపకుండా, ఆరోగ్య సంస్థ అధిపతి టెడ్రోస్ వ్యాఖ్యలు కనిపించకుండా చేసేందుకు డ్రాగన్ దేశం చర్యలు తీసుకుంది. చైనా మైక్రోబ్లాగింగ్‌ సైట్ వీబోలో WHO,Tedros హ్యాష్‌ట్యాగ్‌తో శోధిస్తుంటే ఎలాంటి ఎలాంటి ఫలితాలు కనిపించడంలేదని ఓ వార్తా సంస్థ వెల్లడించింది. అలాగే ఐరాస అధికారిక సైట్‌లో ప్రచురితమైన ఈ కథనాన్ని వీచాట్ యాప్‌ యూజర్లు షేర్ చేయలేకపోతున్నారని పేర్కొంది.

అసలు టెడ్రోస్ ఏమన్నారంటే..?

నిరంతరం మార్పులకు లోనవుతోన్న కరోనా వైరస్‌ కట్టడి విషయంలో చైనా అనుసరిస్తోన్న కొవిడ్ జీరో విధానం సమర్థనీయమైంది కాదని ఇటీవల టెడ్రోస్ అన్నారు. ‘కరోనావైరస్‌ సరికొత్త మార్పులు సంతరించుకుంటూ..మరింత వ్యాప్తి చెందుతోంది. దానికి తగ్గట్టుగా మీ విధానంలో మార్పులు చేసుకోవడం ముఖ్యం’ అంటూ కొవిడ్ జీరో విధానంపై పునరాలోచన చేసుకోవాలని చైనాకు సూచించారు. ఈ మాటలు చైనాకు ఆగ్రహం తెప్పించాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని