China: తైవాన్‌ చుట్టూ చైనా భారీ సైనిక విన్యాసాలు.. యుద్ధానికి సిద్ధమంటోన్న తైపే

చైనా హెచ్చరికలను పట్టించుకోకుండా అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ తైవాన్‌ పర్యటనను విజయవంతంగా ముగించడంపై డ్రాగన్‌ అగ్గిమీద గుగ్గిలమవుతోంది. నిన్న పెలోసీ తైవాన్‌లో ఉండగానే

Published : 05 Aug 2022 01:37 IST

బీజింగ్‌: చైనా హెచ్చరికలను పట్టించుకోకుండా అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ తైవాన్‌ పర్యటనను విజయవంతంగా ముగించడంపై డ్రాగన్‌ అగ్గిమీద గుగ్గిలమవుతోంది. నిన్న పెలోసీ తైవాన్‌లో ఉండగానే ఆ ద్వీప దేశానికి సమీపంలో లైవ్ డ్రిల్‌ చేపట్టిన చైనా.. గురువారం దీవి చుట్టూ భారీ స్థాయిలో యుద్ధ విన్యాసాల నిర్వహణ మొదలుపెట్టింది. నేటి నుంచి నాలుగు రోజుల పాటు ఈ డ్రిల్‌ జరగనున్నట్లు తెలుస్తోంది.

ఈ విన్యాసాల కోసం తైవాన్‌ చుట్టూ ఆరు కీలక ప్రదేశాలను ఎంపిక చేసినట్లు సమాచారం. కొన్ని ప్రాంతాల్లో అయితే తైవాన్‌కు కేవలం 12 మైళ్ల దూరంలోనే ఈ డ్రిల్స్‌ జరగనున్నట్లు చైనా మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. అయితే, అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించి.. తైవాన్‌ జలాలు, గగనతలంలోకి తమ నౌకలు, విమానాలను పంపించట్లేదని డ్రాగన్‌ చెబుతోంది.

యుద్ధానికి కోరుకోవట్లేదు కానీ..

మరోవైపు తాజా కథనాలపై తైవాన్‌ రక్షణశాఖ స్పందించింది. చైనా మిలిటరీ విన్యాసాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నామని తెలిపింది. యుద్ధం వంటి పరిణామాలనైనా ఎదుర్కోడానికి తాము సిద్ధంగా ఉన్నామంది. అయితే, అలాంటి పరిస్థితులను తాము కోరుకోవట్లేదని తెలిపింది. ఘర్షణలను రెచ్చగొట్టి వివాదానికి కారణమవడం తమ విధానం కాదని స్పష్టం చేసింది.

కాగా.. చైనా సైనిక విన్యాసాల నేపథ్యంలో తైవాన్‌ మారీటైమ్‌, పోర్ట్‌ బ్యూరో నిన్న పలు నౌకలకు హెచ్చరికలు జారీ చేసింది. డ్రాగన్‌ డ్రిల్స్‌ జరుపుతోన్న మార్గాలను వదిలి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించింది. చైనా చర్యల కారణంగా 18 అంతర్జాతీయ మార్గాల్లో రాకపోకలకు అంతరాయం కలిగిందని తైవాన్‌ కేబినెట్‌ మండిపడింది.

అయితే చైనా మాత్రం తమ డ్రిల్స్‌ను సమర్థించుకుంటోంది. పెలోసీ పర్యటనతో అమెరికా తమను రెచ్చగొట్టిందని, ఇక్కడ తామే బాధితులమని డ్రాగన్‌ విదేశాంగ శాఖ పేర్కొంది. ఆత్మరక్షణలో భాగంగానే ఈ విన్యాసాలు చేపడుతున్నట్లు తెలపడం గమనార్హం. అంతేగాక, చైనా ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉన్న అమెరికా చర్యకు అగ్రరాజ్యం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని