CPEC: పాక్‌లోకి చైనా సైన్యం..?

భారత్‌ చుట్టుపక్కల దేశాల్లో భూభాగాలను సంపాదించిన చైనా మెల్లగా అక్కడకు సైనిక, నిఘా విభాగాలను పంపేందుకు యత్నాలు మొదలుపెట్టింది.

Published : 18 Aug 2022 02:02 IST

ఇంటర్నెట్‌డెస్క్: భారత్‌ చుట్టుపక్కల దేశాల్లో భూభాగాలను సంపాదించిన చైనా మెల్లిగా అక్కడకు సైనిక, నిఘా సాధనాలు పంపేందుకు యత్నాలు మొదలుపెట్టింది. శ్రీలంకలో 99 ఏళ్ల లీజు దక్కించుకొన్న హంబన్‌టోట రేవుకు నిన్న యువాన్‌ వాంగ్‌-5 నిఘా నౌకను పంపగా.. తాజాగా పాకిస్థాన్‌లో సీపెక్‌ (CPEC) కారిడార్‌ రక్షణకు చైనా సైనిక దళాలను పంపేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఇరు దేశాల ప్రయోజనాలు కాపాడేందుకు తమ దళాలను నిలిపిన చోట ఔట్‌ పోస్టులు నిర్మించుకొనేందుకు అనుమతి ఇవ్వాలని పాక్‌పై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తోంది. ఈ విషయాన్ని పాక్‌లోని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా పాక్‌, అఫ్గాన్‌లలో వీలైనంత త్వరగా మిలటరీ పోస్టులు ఏర్పాటు చేసేందుకు చైనా యుద్ధ ప్రాతిపదికన ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఔట్‌పోస్టులు ఏర్పాటైతే.. బెల్ట్‌ అండ్‌ రోడ్‌ పనులు మరింత సులువుగా జరుగుతాయని డ్రాగన్‌ భావిస్తోంది.

ఈ అంశంపై చర్చించేందుకు చైనా రాయబారి నాంగ్‌ రోంగ్‌ ఇప్పటికే పాక్‌ ప్రధాని షాబాజ్‌ షరీఫ్‌, విదేశాంగ మంత్రి బిలావల్‌ భుట్టో, ఆర్మీ చీఫ్‌ కమర్‌ జావెద్‌ బజ్వాలతో భేటీ అయ్యారు. మార్చి చివరి వారం నుంచి రోంగ్‌ పాకిస్థాన్‌లో లేరు. ఇటీవల తిరిగి వచ్చిన వెంటనే కొత్త ప్రభుత్వంతో తొలి సాధారణ భేటీలోనే చైనా దళాల ఔట్‌పోస్టుల డిమాండ్‌ను తెరపైకి తీసుకొచ్చారు. అంతేకాదు.. చైనా ప్రాజెక్టులు, ప్రజల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 

చైనా గ్వదార్‌లో చైనా దళాలకు ఔట్‌పోస్టులు నిర్మించుకొంటామని, అక్కడి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తమ యుద్ధవిమానాలను వాడుకోనివ్వాలని గతంలోనే కోరింది. ఇప్పటికే ఆ ప్రాంతం మొత్తం కంచెను నిర్మించింది. త్వరలోనే వీటిని చైనా వినియోగంలోకి తీసుకురానున్నట్లు సమాచారం. తాజాగా మిగిలిన ప్రాజెక్టుల వద్ద కూడా చైనా దళాలను మోహరించాలన్నది వ్యూహం.  ఓ పక్క ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న పాక్‌ను చైనా కాలనీగా మార్చేస్తుందనే భయాలు దీంతో పెరిగిపోయాయి. దీంతోపాటు తాలిబన్లు కూడా పాక్‌ పట్టులోకి రాకుండా స్వతంత్రంగా వ్యహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో చైనా బీఆర్‌ఐ ప్రాజెక్టును అఫ్గానిస్థాన్‌ మీదుగా మధ్య ఆసియాలోకి విస్తరించాలని భావిస్తోంది. ఈ క్రమంలో అఫ్గానిస్థాన్‌లో కూడా సైనిక స్థావరాలు ఏర్పాటు చేసుకోవాలని భావిస్తోంది. 

మరోవైపు పాక్‌కు వ్యతిరేకంగా పనిచేసే టీటీపీ(తెహ్రీక్‌ ఇ తాలిబన్‌) సంస్థకు అఫ్గాన్‌ తాలిబన్ల మద్దతు ఉందనే అనుమానాలు ఉన్నాయి. ఇదే గ్రూపు పలుమార్లు చైనీయులపై దాడులు కూడా చేసింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌ కల్పించే భద్రతపై నమ్మకం లేదని చైనా పదేపదే చెబుతోంది. సైనిక స్థావరాల అంశాన్ని పాక్‌ వద్ద గట్టిగా ప్రస్తావిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే పాక్‌ నాయకత్వం దీనిపై ఓ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. 


Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని