China: తగ్గని కరోనా.. ‘జీరో కొవిడ్‌’ విధానానికి చైనా స్వస్తి?

‘జీరో కొవిడ్‌’ విధానానికి ముగింపు పలకాలని యోచిస్తోంది చైనా. ఒక్క కరోనా కేసు నమోదైనా నగరాలకు నగరాలు లాక్‌డౌన్ విధించిన చైనా ఆ పద్ధతికి స్వస్తి చెప్పాలని భావిస్తోంది......

Published : 19 Mar 2022 01:21 IST

డైనమిక్ జీరో కొవిడ్‌ పద్ధతికి శ్రీకారం!

బీజింగ్‌: చైనాను కరోనా గజగజా వణికిస్తోంది. గత రెండేళ్లలో ఎన్నడూ లేనంతగా ఇప్పుడు అక్కడ  వైరస్‌ ప్రబలుతోంది. రోజూ వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా స్టెల్త్‌ ఒమిక్రాన్‌ కేసులు డ్రాగన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ‘జీరో కొవిడ్‌’ విధానంతో ఇన్ని రోజులూ కొవిడ్‌ను కట్టడి చేస్తూ వచ్చిన డ్రాగన్‌.. ఆ పద్ధతికి ముగింపు పలకాలని యోచిస్తోంది. ఒక్క కరోనా కేసు నమోదైనా నగరాలకు నగరాలు లాక్‌డౌన్ విధించిన చైనా ఆ పద్ధతికి స్వస్తి చెప్పాలని భావిస్తోంది. ఈ విషయాన్ని చైనీస్‌ పబ్లిక్‌ హెల్త్‌ స్టాఫ్‌ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. కాగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. చైనా మాత్రం తన నిర్ణయాన్ని సమర్థించుకునేలా సమాధానాలు చెబుతోంది.

జీరో కొవిడ్‌ విధానం ఉన్నా స్టెల్త్‌ ఒమిక్రాన్‌ కేసులు చైనాలో తగ్గడం లేదు సరికదా ఆర్థిక వ్యవస్థకు అపార నష్టం చేకూరుతోందని ప్రభుత్వం ఆలస్యంగా గుర్తించింది. అందుకే జీరో కొవిడ్‌ విధానాన్ని సవరించాలని భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వ్యాక్సిన్లు వైరస్‌ను సమర్థంగా ఎదుర్కొంటాయని చైనా వైద్యుడు జాన్‌ వెన్‌హాంగ్‌ అన్నారు. టీకాలు వైరస్‌ను బలహీన పరుస్తాయని తెలిపారు. చైనాలో కొవిడ్‌ కేసులు పెరగడానికి ప్రజల్లో వ్యాధి నిరోధక శక్తి లేకపోవడమే కారణమని మరో వైద్యుడు యాన్‌జాంగ్‌ హాంగ్‌ అన్నారు. చైనాలో దేశీయంగా తయారు చేసిన వ్యాక్సిన్లు వాడుతున్నారని తెలిపిన ఆయన.. అవి ఫైజర్ వ్యాక్సిన్​లా సమర్థంగా పని చేయట్లేదని వెల్లడించారు.

వైరస్‌ కట్టడికి డ్రాగన్ కొత్త పద్ధతిని పాటించాలని చూస్తున్నట్లు అక్కడి వైద్యులు తెలిపారు. దానిని ‘డైనమిక్ జీరో కొవిడ్‌ పద్ధతి’ అని పిలుస్తున్నట్లు వెల్లడించారు. వైరస్‌ను వంద శాతం కట్టడి చేయడం సాధ్యం కాదన్న విషయం గ్రహించిన చైనా.. కేసులను తగ్గించేందుకు పూర్తిస్థాయి లాక్‌డౌన్​లు కాకుండా వేరే మార్గాల్ని అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. సంపూర్ణ లాక్‌డౌన్ల వల్ల.. ప్రజల ప్రాణాల్ని కొంత మేర డ్రాగన్ కాపాడినప్పటికీ.. అది ఆ దేశ ఆర్థిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపిందని నిపుణులు పేర్కొంటున్నారు. అందుకే చైనా జీరో టాలరెన్స్ విధానాన్ని ఎత్తివేయాలని చూస్తున్నట్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని