Chinese Woman: మహిళకు అస్వస్థత.. తీవ్ర దగ్గుతో పక్కటెముకలు విరిగిపోయాయట..!

ఆహారం తిన్న తర్వాత తీవ్ర దగ్గు బారిన పడిన ఓ మహిళకు ఊహించని పరిణామం ఎదురయ్యింది. దగ్గు తీవ్రతకు నాలుగు పక్కటెముకలు విరిగిపోయినట్లు వైద్యులు గుర్తించి చికిత్స చేస్తున్నారు. చైనాలోని ఓ మహిళలో ఇటీవల వెలుగు చూసినట్లు అక్కడి మీడియా వెల్లడించింది.

Published : 08 Dec 2022 01:50 IST

(ప్రతీకాత్మక చిత్రం)

షాంఘై: ఘాటైన ఆహారం తిన్న ఓ మహిళకు ఊహించని పరిణామం ఎదురయ్యింది. ఆహారం తిన్న తర్వాత ఆమెకు తీవ్ర దగ్గు (Coughing fit) బారినపడింది. దగ్గుతోన్న సమయంలో ఛాతిలో శబ్దం వినిపించడంతోపాటు నొప్పి పెరిగింది. తీరా వైద్యులను సంప్రదిస్తే.. ఆమె ఛాతిలోని నాలుగు పక్కటెముకలు విరిగిపోయినట్లు గుర్తించడంతో అవాక్కయ్యింది.

చైనాలోని (China) షాంఘై నగరానికి చెందిన హువాంగ్‌ అనే మహిళ ఇటీవల ఘాటైన ఆహారం తిన్నట్లు తెలిపింది. అనంతరం ఆమెకు తీవ్ర దగ్గు మొదలయ్యింది. అలా తీవ్రంగా దగ్గుతోన్న సమయంలో ఛాతి నుంచి శబ్దం వినపడింది. తొలుత తేలికగా తీసుకున్నప్పటికీ.. కొన్ని రోజుల తర్వాత ఛాతిలో నొప్పి పెరగడం మొదలయ్యింది. దీంతో ఆమె వైద్యులను సంప్రదించింది. సీటీ స్కాన్‌ చేసి పరీక్షించగా.. ఆమె ఛాతిలోని నాలుగు పక్కటెముకలు విరిగిపోయినట్లు తేలింది. దీంతో ఆమెకు బ్యాండేజీలు అవసరమని చెప్పడంతో ప్రస్తుతం చికిత్స కొనసాగుతున్నట్లు సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్‌ పత్రిక వెల్లడించింది.

అయితే, ఇలా పక్కటెముకలు విరిగిపోవడానికి పలు కారణాలను వైద్యులు పేర్కొన్నారు. ముఖ్యంగా ఆమె తక్కువ బరువు ఉండటం, ఎముకలకు ఆధారంగా ఉండే కండరం లేదని చెప్పారు. దీంతో తీవ్రంగా దగ్గిన సమయంలో పక్కటెముకలు విరిగిపోయినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఎముక గాయాల నుంచి కోలుకున్న తర్వాత వ్యాయామం, సరైన భోజనం వంటి మార్గాలతో తను కండరాలను బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తానని సదరు మహిళ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని