China: మళ్లీ లాక్‌డౌన్‌ యోచనలో చైనా? వద్దు బాబోయ్‌ అంటోన్న ప్రజలు!

చైనీస్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్ ప్రివెన్షన్‌ (CCDCP) విడుదల చేసిన నివేదిక ప్రకారం చైనా(China)లో ఫ్లూ  (Influenza) కేసులు పెరుగుతున్నాయట. దీంతో ఫ్లూ కేసులు నమోదవుతున్న నగరాల్లో లాక్‌డౌన్‌ (Lockdown) విధించాలని చైనా ప్రభుత్వం భావిస్తోంది.

Updated : 12 Mar 2023 23:47 IST

బీజింగ్‌: చైనా (China)లో మరోసారి లాక్‌డౌన్‌ (Lockdown) విధించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడిప్పుడే కరోనా వైరస్‌ (Covid 19) నుంచి కోలుకుంటున్న అక్కడి ప్రజలను ఫ్లూ (Influenza) రూపంలో మరో వైరస్‌ కలవరపెడుతుండటమే ఇందుకు కారణం. దీంతో ఫ్లూ కట్టడి చర్యల్లో భాగంగా చైనాలోని పలు నగరాల్లో లాక్‌డౌన్‌ విధించాలని చైనా ప్రభుత్వం భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. కానీ, లాక్‌డౌన్‌ను అక్కడి ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట. ఇప్పటికే జియాన్‌ (Xi'an) నగరంలో ఫ్లూ కేసులు పెరుగుతుండటంతో వ్యాపారాలు, పాఠశాలలతో పాటు జనసమూహాలు ఎక్కువగా ఉండే ప్రాంతాలను మూసివేయాలని అక్కడ ప్రభుత్వం సూచించిందట. దీంతో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారట. జియాన్‌ నగరం చైనాలోని పర్యాటక నగరాల్లో ఒకటి. గతంలో కరోనా లాక్‌డౌన్‌ కారణంగా తీవ్రంగా నష్టపోయామని, లాక్‌డౌన్‌కి బదులు అందరికీ వ్యాక్సిన్‌లు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నారట. 

చైనీస్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్ ప్రివెన్షన్‌ (CCDCP) తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశ వ్యాప్తంగా ఫ్లూ కేసులు పెరుగుతున్నాయి. మార్చి మొదటి వారంలో 25.1 శాతంగా ఉన్న ఫ్లూ కేసులు గత వారం 41.6 శాతం పెరిగినట్లు నివేదికలో పేర్కొంది. అదే సమయంలో కొవిడ్‌-19 కేసులు 5.1 శాతం నుంచి 3.8 శాతానికి తగ్గాయని తెలిపింది. దీంతో ఫ్లూ కేసులు నమోదవుతున్న నగరాల్లో లాక్‌డౌన్‌ విధించాలని చైనా ప్రభుత్వం భావిస్తోంది. కానీ, ప్రభుత్వ నిర్ణయాన్నిఅక్కడి ప్రజలు వ్యతిరేకిస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారత్‌లోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర వైద్యఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్‌భూషణ్‌ హెచ్చరించారు. గత రెండు నెలల్లో ఒడిశాలో 59 హెచ్‌3ఎన్‌2 ఇన్‌ఫ్లూయెంజా కేసులు నమోదుకాగా.. హరియాణా, కర్ణాటకలో ఒక్కొక్కరు చొప్పున ఇద్దరు మృతి చెందారు. గుజరాత్‌లో హెచ్‌1ఎన్‌1 వైరస్‌తో ఒక వ్యక్తి మరణించాడు. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో 79 ఇన్‌ఫ్లూయెంజా కేసులు నమోదయ్యాయి. మార్చి నెలాఖరు నుంచి ఈ కేసులు తగ్గుముఖం పట్టే సూచనలు ఉన్నట్లు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ అంచనా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని