China: రికార్డు స్థాయికి.. చైనా యువత నిరుద్యోగిత రేటు
చైనా యువతలో నిరుద్యోగిత రేటు (Unemployment rate) ఇటీవల గణనీయంగా పెరిగినట్లు తాజా గణాంకాలు వెల్లడించాయి. ఏప్రిల్‌లో ఇది రికార్డు స్థాయిలో 20శాతానికి పైగా చేరుకుందని తెలిపాయి.
బీజింగ్: తాము అనేక రంగాల్లో దూసుకుపోతున్నామని చైనా (China) చెబుతున్నప్పటికీ.. అక్కడ నిరుద్యోగం (Unemployment) క్రమంగా పెరుగుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. తాజాగా అక్కడి యువతలో గరిష్ఠ స్థాయి నిరుద్యోగిత రేటు నమోదయ్యింది. మునుపెన్నడూ లేనివిధంగా ఏప్రిల్‌లో చైనా యువత నిరుద్యోగిత రేటు (Unemployment rate) 20.4 శాతంగా రికార్డయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
16 ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్య వయసు వారు పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ.. పని లభించకపోవడాన్ని యువ నిరుద్యోగితగా వ్యవహరిస్తారు. కొవిడ్ ఆంక్షల నుంచి ఇటీవలే బయటకు వచ్చిన చైనాలో.. అక్కడి యువతలో నిరుద్యోగానికి సంబంధించి ‘చైనా అకాడమీ ఆఫ్ లేబర్ అండ్ సోషల్ సెక్యూరిటీ’ తాజా నివేదిక వెల్లడించింది. ఇది ఏప్రిల్‌లో రికార్డు స్థాయిలో 20.4 శాతం గరిష్ఠానికి చేరుకుంది. అంతకుముందు నెలలో 19.6 శాతంగా ఉంది. అయితే, అక్కడి యువతలో నిరుద్యోగానికి సంబంధించిన గణాంకాలను అక్కడి ప్రభుత్వం 2018 నుంచి వరుసగా ప్రకటిస్తోంది. ఆ ఏడాది ఇది 11.2 శాతంగా ఉండగా.. తాజాగా అది 20 శాతానికి చేరుకుంది. జులైలో చదువు పూర్తిచేసుకున్న కోటి మందికిపైగా పట్టభద్రులు జాబ్ మార్కెట్‌లోకి రానుండటంతో ఇది మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇతర అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన దేశాలతో పోలిస్తే చైనాలో యువత నిరుద్యోగిత భారీ స్థాయిలో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అమెరికాలో 2022లో సరాసరి నిరుద్యోగిత 8.1శాతంగా నమోదైంది. అంతకుముందు ఏడాది (2021లో) 9.57 శాతంగా ఉండగా, 2020లో కరోనా సమయంలో గరిష్ఠంగా 27.4 శాతంగా రికార్డయ్యింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో మాత్రం అక్కడ 6.5 శాతంగా ఉంది. ఇక హాంకాంగ్, జర్మనీ, దక్షిణ కొరియా, జపాన్ దేశాల్లో యువత నిరుద్యోగిత రేటు 7 శాతం లోపే ఉంది. అయితే, కొత్తగా జాబ్ మార్కెట్‌లోకి వచ్చేవారికి అవసరమైన నైపుణ్యాలు లేకపోవడం, అర్హత ఉన్నవారికి వేతనాలు తక్కువగా ఉండటం వంటివి యువ నిరుద్యోగితకు కారణంగా నిపుణులు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
IPAC-YSRCP: ప్రభుత్వ కార్యక్రమంలో ‘ఐ’ప్యాక్!
-
TS News: భారాసకు రంగారెడ్డి జిల్లా డీసీసీబీ ఛైర్మన్ గుడ్‌బై
-
Nara Bhuvaneswari: నారా భువనేశ్వరి బస్సు యాత్రకు ఏర్పాట్లు?
-
Hyderabad: హైదరాబాద్‌లో పలుచోట్ల ఐటీ సోదాలు
-
TDP: ఎవరెస్ట్ వద్ద ఎగిరిన పసుపుజెండా