China: ఒమిక్రాన్‌ వేళ.. చైనా వ్యూహం పనిచేస్తుందా..?

యావత్‌ ప్రపంచాన్ని ఒమిక్రాన్‌ కలవరపెడుతోన్న వేళ.. కఠిన ఆంక్షలతో కూడిన ‘జీరో కొవిడ్‌’ వ్యూహంతో కరోనాపై ఎంతకాలం చైనా పోరాటం కొనసాగిస్తుందనే వాదన మొదలయ్యింది.

Updated : 07 Jan 2022 17:35 IST

జీరో కొవిడ్‌ వ్యూహంతో కుస్తీపడుతోన్న డ్రాగన్‌

బీజింగ్‌: కరోనా వైరస్‌ మహమ్మారిని ఎదుర్కొనేందుకు యావత్‌ ప్రపంచ దేశాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ముఖ్యంగా వ్యాక్సిన్‌ పంపిణీ, కొవిడ్‌ నిబంధనలు పాటించడంతో పాటు వైరస్‌తో కలిసి జీవించే వ్యూహాలను అనుసరిస్తున్నాయి. కానీ, కొవిడ్‌-19కు పుట్టినిల్లైన చైనా మాత్రం.. జీరో కొవిడ్‌ (Zero Covid) వ్యూహానికే కట్టుబడి ఉంది. ఇందులో భాగంగా కొవిడ్‌ కేసులు బయటపడుతోన్న ప్రాంతాల్లో కఠిన ఆంక్షలను అమలు చేస్తోన్న చైనా.. పదుల సంఖ్యలో కేసులు వచ్చినా లక్షల మందిని క్వారంటైన్‌లో ఉంచుతోంది. మరికొన్ని ప్రాంతాల్లో కఠిన లాక్‌డౌన్‌లు అమలు చేస్తోంది. ఇలాంటి ఆంక్షల నడుమ కొవిడ్‌ పరీక్ష ధ్రువపత్రం లేదన్న కారణంతో తీవ్ర నొప్పులతో వచ్చిన గర్భిణిని చైనా వైద్యులు అడ్డుకున్న సంఘటన ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. యావత్‌ ప్రపంచాన్ని ఒమిక్రాన్‌ కలవరపెడుతోన్న వేళ.. కఠిన ఆంక్షలతో కూడిన ‘జీరో కొవిడ్‌’ వ్యూహంతో కరోనాపై ఎంతకాలం చైనా పోరాటం కొనసాగిస్తుందనే వాదన మొదలయ్యింది.

ఏమిటీ జీరో కొవిడ్‌..?

కొవిడ్‌ పాజిటివ్‌ కేసులను సున్నాకు తీసుకువచ్చే వ్యూహాన్ని ఎంచుకున్న చైనా.. స్థానికంగా కొవిడ్‌-19 కేసు వెలుగు చూసిన వెంటనే భారీ సంఖ్యలో కొవిడ్‌ టెస్టులు నిర్వహించడం, ట్రాకింగ్‌ ద్వారా అనుమానితులను గుర్తించే ప్రక్రియను చేపడుతోంది. అవసరమైన చోట కఠిన లాక్‌డౌన్‌ ఆంక్షలు అమలు చేస్తోంది. అంతేకాకుండా కొవిడ్‌ అనుమానిత వ్యక్తులను ఇళ్లు, హోటల్‌ల నుంచి బయటకు రానీయకుండా అక్కడే నిర్బంధిస్తోంది. తాజాగా షియాన్‌ నగరంలో 150 పాజిటివ్‌ కేసులు వెలుగు చూడడంతో 1.3కోట్ల జనాభా కలిగిన నగరం మొత్తాన్ని లాక్‌డౌన్‌ చేసింది. షేంగ్‌జువౌ నగరంలో 11 కేసులు నిర్ధారణ కావడంతో కోటి మందికి టెస్టులు నిర్వహించింది. అంతర్జాతీయ ప్రయాణికులపై ఆంక్షలు విధిస్తూ క్వారంటైన్‌ తప్పనిసరి చేసింది. ఇలా ఒక్కకేసు నిర్ధారణనైనా లక్షల సంఖ్యలో టెస్టులు, నిర్బంధాలు, ప్రయాణ ఆంక్షలను చైనా ప్రభుత్వం అమలు చేస్తోంది.

ఎంతవరకు పనిచేస్తుంది..

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 30కోట్ల మందికి వైరస్‌ సోకగా.. దాదాపు 55లక్షల మంది ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ గణాంకాలు చెబుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికాలోనే ఇప్పటివరకు 8లక్షల మంది చనిపోయారు. ముఖ్యంగా విస్తృత వేగంగా వ్యాపిస్తోన్న ఒమిక్రాన్‌ ప్రభావంతో చాలా దేశాల్లో నిత్యం లక్షల సంఖ్యలో కొవిడ్‌ కేసులు బయటపడుతున్నాయి. కానీ, కొవిడ్‌-19 తొలిసారి వెలుగు చూసిన చైనాలో మాత్రం ఇప్పటివరకు కేవలం 5వేల మరణాలు చోటుచేసుకున్నట్లు అక్కడి అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. కేవలం జీరో కొవిడ్‌ వ్యూహం వల్లే ఇది సాధ్యమైందని చైనా ప్రభుత్వం చెబుతోంది. స్థానికంగా ఒక్క కేసు కనిపించకుండా చేసే సామర్థ్యం తమకు లేదని.. అయినప్పటికీ ఏ ఒక్క కేసు వెలుగు చూసినా స్థానికంగా మరింత వ్యాప్తి చెందకుండా కట్టడి చేసే సామర్థ్యం తమకు ఉందని చైనాలోని నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌ విశ్వాసం వ్యక్తం చేస్తోంది.

తీవ్ర ఇక్కట్లు అయినప్పటికీ..!

జీరో కొవిడ్‌ వ్యూహాన్ని అమలు చేస్తోన్న చైనా.. వైరస్‌ కట్టడి చేసేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతోన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వరుస లాక్‌డౌన్‌లు, కొవిడ్‌ ఆంక్షలతో స్థానిక ప్రజలకే కాకుండా సరిహద్దు దేశాల నుంచి వలస వచ్చిన కూలీలు కూడా నానా కష్టాలు పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు లాక్‌డౌన్‌ సమయంలో ఆహారం, నిత్యావసర వస్తువుల సరఫరా, వైద్య చికిత్సలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా కఠిన ఆంక్షలతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కొందరు ఆరోగ్య కార్యకర్తలు ఉన్నతోద్యోగిని కొట్టి చంపడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. ఇలా వరుసగా పరిశ్రమలు, వాణిజ్య కార్యకలాపాలు పూర్తిగా మూసివేయడం వంటివి ఆర్థిక వ్యవస్థపైనా ప్రతికూల ప్రభావం చూపిస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అంతర్జాతీయ ఆంక్షలు సడలిస్తుందా..?

వైరస్‌ వెలుగు చూసినప్పటి నుంచి అంతర్జాతీయ ప్రయాణాలపై చైనా ఆంక్షలు కొనసాగిస్తోంది. అత్యవసర పరిస్థితుల్లోనే విదేశీ రాకపోకలను అనుమతిస్తోంది. ఇలా కనీసం వచ్చే నెలలో జరగనున్న వింటర్‌ ఒలింపిక్స్‌ వరకు ఈ ఆంక్షలను కొనసాగించేందుకు చైనా మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే, చైనా వ్యూహంపై అక్కడి నిపుణుల నుంచి వ్యతిరేకత వచ్చింది. వైరస్‌తో కలిసి జీవించే వ్యూహంతోనే దేశాలు ముందుకు వెళ్లాలని చైనాలో ప్రముఖ ఆరోగ్యరంగ నిపుణుడు ఝాంగ్‌ వెన్‌హోంగ్‌ చెప్పడం చైనా సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్‌కు కారణమయ్యింది. అయితే, జీరో కొవిడ్‌ వ్యూహాన్ని నిరవధికంగా కొనసాగించడం కచ్చితంగా సాధ్యమేనని చైనా చూపించినట్లు హాంకాంగ్‌ ఎపిడమాలజిస్ట్‌ బెన్‌ కౌలింగ్‌ అభిప్రాయపడ్డారు.

ఆంక్షలు సడలిస్తే ఏమవుతుంది..?

అమెరికా, యూరప్‌ దేశాల మాదిరిగా కొవిడ్‌ ఆంక్షలను సడలిస్తే స్థానికంగా వైరస్‌ ఉద్ధృతి విపరీతంగా ఉండవచ్చని పెకింగ్‌ యూనివర్సిటీ పరిశోధకులు హెచ్చరించారు. ముఖ్యంగా అత్యధిక జనాభా కలిగిన దేశం కావడం.. వైరస్‌ బారినపడే వారి సంఖ్య అధికంగా ఉండడం వైరస్‌ విజృంభణకు అవకాశంగా పేర్కొన్నారు. అదే జరిగితే చైనా ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పెరగవచ్చని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో కొత్త వేరియంట్లను ఎదుర్కొనే వ్యాక్సిన్లను అభివృద్ధి చేసి.. వందశాతం ప్రజలకు అందించడం ద్వారానే ఇటువంటి అంటువ్యాధులకు అడ్డుకట్ట వేయవచ్చని హాంకాంగ్‌ యూనివర్సిటీ నిపుణులు సూచిస్తున్నారు.

ఇలా ఒమిక్రాన్‌ వంటి అత్యంత వేగంగా విస్తరిస్తోన్న వేరియంట్‌లు పుట్టుకొస్తున్న వేళ.. అసలు చైనా వ్యూహం ఎంతకాలం పనిచేస్తుందే వాదన మొదలయ్యింది. కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు వివిధ అస్త్రాలతో ప్రపంచదేశాలు ముందుకెళ్తుంటే.. చైనా మాత్రం జీరో కొవిడ్‌ వ్యూహాన్నే నమ్ముకోవడం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచంలోనే అధిక జనాభా కలిగిన చైనా ఇందులో ఏ మేరకు సఫలీకృతమవుతుందో చూడాలని విశ్లేషకులు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని