China: ‘జీరో కొవిడ్‌’ వ్యూహానికి చైనా ముగింపు పలకనుందా..?

కఠినమైన కొవిడ్‌  ఆంక్షలను తట్టుకోలేకపోతున్న చైనా పౌరులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. ఇవి తీవ్రతరం అవడంతో అధికారులు తమ వ్యూహాన్ని మార్చుకునేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా జీరో కొవిడ్‌ వ్యూహానికి సడలించేందుకు చైనా సన్నద్ధమవుతోందని వార్తలు వినిపిస్తున్నాయి.

Published : 02 Dec 2022 01:32 IST

బీజింగ్‌: కరోనా వైరస్‌ విజృంభణను కట్టడి చేసేందుకు చైనా అమలు చేస్తోన్న ఆంక్షలతో అక్కడి ప్రజలు విసుగెత్తిపోతున్నారు. దీంతో ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తూ చేస్తోన్న నిరసనలు దేశవ్యాప్తంగా మిన్నంటున్నాయి. ఏకంగా అధ్యక్షుడే దిగిపోవాలని డిమాండ్‌ పెరుగుతోంది. ఈ తరుణంలో జీరో-కొవిడ్‌ (Zero Covid) వ్యూహానికి ముగింపు పలికేందుకు చైనా సిద్ధమైతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి చైనా అధికారులు ముందస్తు సూచనలు చేశారు.

కరోనా వైరస్‌ ఉద్దృతిని నియంత్రించేందుకు ‘జీరో కొవిడ్‌’ విధానాన్ని చైనా ఎంచుకుంది. ఇందులో భాగంగా భారీ స్థాయిలో లాక్‌డౌన్‌ ఆంక్షలు విధించడం, ఒక్క కేసు వచ్చినా లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయడం, లక్షణాలు లేనివారని కూడా క్వారంటైన్‌ కేంద్రాలను తరలించడం వంటి చర్యలు చేపడుతోంది. నెలల తరబడి ప్రభుత్వం అమలు చేస్తోన్న కఠిన నిబంధనలు ప్రజాగ్రహానికి కారణమయ్యాయి. దీంతో బీజింగ్‌, షాంఘై, గువాంగ్‌ఝువా ప్రాంతంలో భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. అధ్యక్షుడు జిన్‌పింగ్‌ పదవి నుంచి దిగిపోవాలనే డిమాండ్‌ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకునేందుకు సిద్ధమవుతోన్నట్లు తెలుస్తోంది. తాజాగా దేశంలో నెలకొన్న పరిస్థితులపై మాట్లాడిన నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సన్‌ చున్‌లాన్‌... ఒమిక్రాన్‌ వేరియంట్‌ క్షీణిస్తోందని, వ్యాక్సినేషన్‌ రేటు వృద్ధి చెందుతోందని చెప్పారు. జీరో కొవిడ్‌పై నేరుగా మాట్లాడనప్పటికీ కొవిడ్‌ ఉద్ధృతి తగ్గుముఖం పడుతోందని చెప్పే ప్రయత్నం చేశారు.

ఇదే సమయంలో గువాంగ్‌ఝువా ప్రావిన్సులో పోలీసులు-నిరసనకారులకు మధ్య జరిగిన ఘర్షణల అనంతరం పరిస్థితులను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టింది. రికార్డుస్థాయిలో కేసులు నమోదవుతున్నప్పటికీ లాక్‌డౌన్‌ ఆంక్షలను సడలిస్తోంది. అంతేకాకుండా అక్కడి 11 జిల్లాల్లోనూ ఆంక్షలను ఎత్తివేసిన అధికారులు క్వారంటైన్‌ కేంద్రం నుంచి ఇళ్లకు వెళ్లేందుకు పౌరులను అనుమతించారు. బీజింగ్‌లోనూ వైరస్‌ సోకిన వ్యక్తులను ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉండాలని ఆదేశాలిచ్చింది. ఇలా ఆంక్షలను సడలించడం వంటి చర్యలు ‘కఠినమైన జీరో కొవిడ్‌ విధానా’నికి ముగింపు పలికేందుకు ముందస్తు సూచనేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. క్వారంటైన్‌కు బదులు హోం ఐసోలేషన్‌లోనే ఉండాలని చెప్పడం చూస్తుంటే కొవిడ్‌తో కలిసి జీవించే విధానానికి చైనా అధికారులు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోందని ఏఎన్‌జడ్‌ పరిశోధనా సంస్థ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని