China: చైనాలో విద్యాసంస్థలకు వ్యాపించిన ఆందోళనలు

చైనాలో ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. తాజాగా 50కిపైగా కళాశాలల క్యాంపస్‌ల్లో ఇవి జరుగుతున్నాయి.

Published : 28 Nov 2022 13:56 IST

ఇంటర్నట్‌డెస్క్‌: చైనాలో జీరో కొవిడ్‌ విధానానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలు మరింత విస్తరించాయి. తాజాగా అవి పలు విశ్వవిద్యాలయాల క్యాంపస్‌ల్లో కూడా మొదలయ్యాయి. గత దశాబ్ద కాలంలో చైనాలోని కమ్యూనిస్టు పార్టీ ఇలాంటి ఆందోళనలను చూడలేదు. దాదాపు 50కిపైగా విద్యాలయాల్లో ఇవి జరుగుతున్నాయి. ఉరుమ్‌ఖీలో అగ్ని ప్రమాదం కారణంగా 10 మంది ప్రాణాలు కోల్పోవడం ఈ ఆందోళనలకు బీజం వేసింది. మరోవైపు రికార్డు స్థాయిలో కొవిడ్‌ కేసులు నమోదవుతుండటంతో చైనా అధికారులు కఠిన లాక్‌డౌన్లను విధిస్తున్నారు. ఆదివారం ఒక్క రోజే చైనాలో 39,500 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌ మొదలైన నాటి  నుంచి ఆ దేశంలో ఇవే ఒక్కరోజు అత్యధిక కేసులు.

షాంఘైలో ఆందోళనలను అడ్డుకునేందుకు పోలీసులు భారీ స్థాయిలో బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఈ నగరంలో ఆందోళనలు చేస్తున్న కొందరిని పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు చైనాలో కీలక నగరాల్లో జిన్‌పింగ్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలపై చైనా అధికారిక మీడియా మౌనం వహిస్తోంది. మరో వైపు ఈ ఆందోళనలను కవర్‌ చేస్తున్న పశ్చిమదేశాల మీడియాపై గ్లోబల్‌ టైమ్స్‌ వ్యతిరేక కథనం ప్రచురించింది. చైనాలో జరుగుతున్న ఆందోళనలకు మద్దతుగా పారిస్‌, అమ్‌స్టర్‌డామ్‌, డబ్లిన్‌, టొరెంటో, అమెరికాలోని శాన్‌ ఫ్రాన్సిస్కోలో ఈ ప్రదర్శనలు జరిగాయి. చైనాలో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు కవర్‌ చేస్తున్న ఓ విదేశీ జర్నలిస్టును స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో అతడిపై దాడి కూడా చేసినట్లు వీడియోలు వెలువడుతున్నాయి. అతడి చేతులకు బేడీలు వేసి తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని