China: జననాల రేటు తగ్గుతోన్న వేళ.. పెరిగిన చైనీయుల ఆయుర్దాయం

జననాల రేటు (Birth Rate) తగ్గుదల సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న చైనా (China)లో ప్రజల సగటు ఆయుర్దాయం (Life expectancy) రేటు మాత్రం క్రమంగా పెరుగుతోంది.

Published : 06 Jul 2022 18:28 IST

బీజింగ్‌: జననాల రేటు (Birth Rate) తగ్గుదల సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న చైనా (China)లో ప్రజల సగటు ఆయుర్దాయం (Life expectancy) రేటు మాత్రం క్రమంగా పెరుగుతోంది. చైనీయుల సగటు జీవితకాలం 0.6ఏళ్లు పెరిగి 77.93 ఏళ్లకు చేరుకున్నట్లు తాజా గణాంకాలు వెల్లడించాయి. చైనా నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌ నివేదిక ప్రకారం.. 2020 నాటికి చైనాలో 60ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న వారి జనాభా 26.4కోట్లు. ఇది ఆ దేశ జనాభాలో 18.7శాతం.

చైనాలో ఆరోగ్య అక్ష్యరాస్యత రేటు 25.4శాతానికి పెరగడంతోపాటు శారీరక వ్యాయామం క్రమం తప్పకుండా చేసేవారి సంఖ్య 37.2శాతానికి పెరిగిందని నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌లోని ప్రణాళికా విభాగం డైరెక్టర్ మావో క్వున్‌ ఆన్‌ పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని దేశంలో ఫిట్‌నెస్‌ కేంద్రాల (Fitness Centres) కోసం ఏటా దాదాపు ఒక బిలియన్‌ యువాన్లు (149 అమెరికన్‌ డాలర్లు) ఖర్చు చేస్తున్నట్లు అక్కడి క్రీడా విభాగం అధికారి గవో యువాన్‌యీ వెల్లడించారు. మరోవైపు ఆక్సిజన్‌ స్థాయిలు తక్కువగా ఉండే టిబెట్‌లో (Tibet) 1951 గణాంకాల ప్రకారం అక్కడి ప్రజల ఆయుర్దాయం 35.5ఏళ్లుగా ఉండగా.. అది 72.19 (గతేడాది నాటికి) ఏళ్లకు చేరుకుందని చైనా అధికారిక మీడియా పేర్కొంది.

ఇదిలాఉంటే, చైనాలో గత కొన్నేళ్లుగా జననాల రేటు గణనీయంగా తగ్గిపోవడం.. ఇదే సమయంలో వృద్ధుల సంఖ్య పెరిగిపోతుండడంతో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇది గ్రహించిన ప్రభుత్వం.. ఎన్నో ఏళ్లుగా పాటించిన ఒక్కరు ముద్దు అన్న నినాదాన్ని పక్కనబెట్టి, ఇద్దరు పిల్లలు కనవచ్చని 2016లో ప్రకటించింది. అంతేకాకుండా కుటుంబ నియంత్రణ చట్టాన్ని ఇటీవల మరోసారి సవరించి మూడో బిడ్డను కూడా కనేందుకు వీలు కల్పించింది. ఇలాంటి దంపతులకు పన్ను రాయితీలు, ఇతర ప్రోత్సాహకాలు కల్పించినప్పటికీ చైనా జనాభాలో వృద్ధి మాత్రం కనిపించడం లేదు. జీవన వ్యయం పెరిగి పిల్లలను పెంచడం కష్టం కావడం, చిన్న కుటుంబాలకు అలవాటుపడిన చైనీయులు ఉన్నట్టుండి పెద్ద కుటుంబాలకు మారేందుకు ఇష్టపడకపోవడం, స్త్రీలు పెళ్లిని వాయిదా వేసుకోవడం, కరోనా వల్ల జననాలను వాయిదా వేసుకోవడం వంటివి పలు కారణాలుగా విశ్లేషిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని