China: బోయింగ్‌, ఎయిర్‌బస్‌కు పోటీగా చైనా ప్యాసింజర్‌ విమానం..!

వైమానిక రంగంలో చైనా కీలకమైన ముందడుగు వేసింది. దేశీయంగా రూపొందించిన ప్రయాణికుల విమానం సేవలను అందించడం మొదలుపెట్టింది. భవిష్యత్తులో ఇది బోయింగ్‌, ఎయిర్‌బస్‌కు పోటీ ఇస్తుందని చైనా ఆశిస్తోంది.  

Published : 28 May 2023 16:01 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చైనాలో దేశీయంగా తయారు చేసిన భారీ ప్రయాణికుల విమానం సీ919 తొలిసారి ఆదివారం గాల్లోకి ఎగిరింది. ఇది షాంఘై నుంచి బీజింగ్‌కు ప్రయాణించినట్లు అక్కడి ప్రభుత్వ న్యూస్‌ ఏజెన్సీ షినూవా పేర్కొంది. చైనాకు చెందిన ఈస్టర్న్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఫ్లైట్‌ ఎంయూ9191గా రిజిస్టరైంది. ఉదయం 10.32కు షాంఘై నుంచి బయల్దేరిన ఈ విమానం మధ్యాహ్నాం 12.31కు బీజింగ్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్‌ అయింది. దీంతో చైనాలో వైమానిక రంగంలో సరికొత్త అధ్యాయానికి తెరతీసినట్లైంది. 

సీ919కోసం చైనాలో ఏళ్ల తరబడి పరిశోధనలు నిర్వహించారు. మేడిన్‌ చైనా 2025 వ్యూహానికి ఈ విమానం మరింత బలాన్ని చేకూర్చనుంది. ఈ కార్యక్రమం కింద దేశీయంగా తయారీని పెంచి..వైమానిక రంగం విదేశాలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడం చైనా లక్ష్యం. ‘‘సరికొత్త విమానం భవిష్యత్తులో మార్కెట్‌ పరీక్షలను తట్టుకొంటూ మరింత మెరుగవుతుంది’’ అని ‘కమర్షియల్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ చైనా’ మార్కెటింగ్‌, సేల్స్‌ డైరెక్టర్‌ ఝాంగ్‌ షియాగువాంగ్‌ పేర్కన్నారు.  

ఈ సరికొత్త విమానం ఏకధాటిగా 5,555 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. దీంతో ఎయిర్‌బస్‌ ఎ 320, బోయింగ్‌ బీ737 విమానాలకు భవిష్యత్తులో ఇది బలమైన పోటీ ఇస్తుందని చైనా అంచనావేస్తోంది. ఈ రకం విమానాలను సాధారణంగా దేశీయ, సమీప దేశ ప్రయాణాలకు వినియోగిస్తుంటారు. కమర్షియల్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ చైనా నిర్మించిన సీ919 విమానాన్ని 2022 డిసెంబర్‌లో చైనా ఈస్టర్న్‌ ఎయిర్‌లైన్స్‌కు సరఫరా చేశారు. అనంతరం దీనికి పలు పరీక్షలు నిర్వహించారు. ఈ విమానంలో బిజినెస్‌, ఎకానమీ క్లాస్‌లు ఉన్నాయి. 164 మంది ప్రయాణించవచ్చు. ఈ విమానంలో ముక్కు, రెక్కలు, ఇతర వ్యవస్థలను చైనానే అభివృద్ధి చేసింది. ఇక ఇంజిన్‌ తయారీలో మాత్రం జనరల్‌ ఎలక్ట్రిక్స్‌, ఫ్రాన్స్‌కు చెందిన సాఫ్రాన్‌ సాయం తీసుకొంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని