Published : 13 May 2022 16:30 IST

china: చైనా జీరో కొవిడ్‌ ఎఫెక్ట్‌.. కుంగిన ఎగుమతులు..!

 వైరస్‌ వ్యాప్తితో డ్రాగన్‌కు ఆర్థిక దెబ్బ

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

జీరో కొవిడ్ పేరిట చైనా చేస్తున్న హడావుడి.. వైరస్‌ వ్యాప్తిని నిలువరించకపోగా ఆ దేశ ఎగుమతులపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. తాజాగా ఎగుమతులు బాగా మందగించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. సరకు రవాణాకు ఆంక్షలు అడ్డం కావడం.. ప్రధాన నగరాలు లాక్‌డౌన్‌ ఆంక్షల్లో మగ్గడం.. ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి పుంజుకోవడం దీనికి ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు. 2019 తర్వాత భారీగా పెరిగిన చైనా ఎగుమతులు ఇప్పుడు మెల్లగా తగ్గుతున్నాయి.

ఏం జరిగింది..?

చైనా ఎగుమతుల వృద్ధిరేటు ఏప్రిల్‌లో బాగా తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. గతేడాదితో పోలిస్తే కేవలం 3.9శాతం మాత్రమే పెరిగాయి. ఆ దేశంలో ప్రధాన ట్రేడింగ్‌ హబ్‌ అయిన షాంఘై అత్యంత కఠిన ఆంక్షల మధ్యలో ఉండటం దీనికి ప్రధాన కారణం. దీంతోపాటు చైనా జీడీపీలో 30శాతం వాటా కలిగి ఉన్న మరో 41 నగరాల్లో కొవిడ్‌ ఆంక్షలు  అమలు చేస్తున్నారు. 

కొవిడ్‌ పరిస్థితుల్లో కొంత మొత్తం వ్యాపారం పెరిగినా గొప్పే. కానీ, చైనా కస్టమ్స్‌ ఏజెన్సీ చెప్పిన 3.9శాతం పెరుగుదల విని ఆర్థిక నిపుణులు పెదవి విరవడానికి కారణం ఉంది. డ్రాగన్‌ ఎగుమతి చేస్తున్న వస్తువుల్లో ఏప్రిల్‌ నెల నాటికి 8శాతం కంటే ఎక్కువగా ధరల పెరుగుదల నమోదైంది. పెరిగిన ధరలను పరిగణనలోకి తీసుకొంటే ఎగుమతుల విలువ కూడా పెరుగుతుంది. ఈ లెక్కన 3.9శాతం వృద్ధి కేవలం ధరల పెరుగుదల వల్ల వచ్చిందే కానీ.. సరకుల ఎగుమతుల్లో పెంపు వల్ల వచ్చింది కాదు. 

చైనాలో నిర్వహించిన పర్చేజింగ్‌ మేనేజర్స్‌ సర్వే కూడా ఈ ఏడాదిలో ఎగుమతులు ప్రతి నెలా తగ్గుతూ వస్తున్నాయని తేల్చింది. ఏప్రిల్‌ నెలలో కంప్యూటర్లు, గృహోపకరణాల ఎగుమతులు పడిపోయినట్లు తేలింది. పశ్చిమ దేశాలు లాక్‌డౌన్‌లో ఉన్న సమయంలో వీటికి భారీ డిమాండ్‌ లభించింది.

చైనాలో వస్తువుల ధరల పెంపుపై దాని వ్యాపార భాగస్వాములను ద్రవ్యోల్బణం వైపు నెట్టే ప్రమాదం ఉందన్న భయాలు నెలకొన్నాయి. చైనా కొవిడ్‌ నిబంధనల కారణంగా ఏర్పడిన అడ్డంకులు చూసి దాని పోటీదారులు ధరలు పెంచే అవకాశం ఉంది. కాకపోతే అమెరికా వంటి దేశాలపై దీని ప్రభావం పెద్దగా ఉండదని ఫెడరల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ శాన్‌ఫ్రాన్సిస్కో ఆర్థిక వేత్తలు చెబుతున్నారు. చాలా వరకూ అమెరికా ద్రవ్యోల్బణం స్థానిక కారణాలతోనే పుట్టుకొస్తుందని చెబుతున్నారు.   

అడుగడుగునా అడ్డంకులు..

చాలా చోట్ల ట్రక్కులు కార్గోను తీసుకెళ్లేందుకు మోటార్‌వే చెక్‌పాయింట్లలోకి రానీయడంలేదు. అంతేకాదు, అంతర్జాతీయ ట్రేడింగ్‌ విషయంలో కూడా చైనా ఆంక్షలను అమలు చేస్తోంది. ఏప్రిల్‌ మధ్య నాటికి షాంఘై ఓడరేవు బయట దాదాపు 506 నౌకలు కార్గో ఎగుమతి, దిగుమతుల కోసం వేచి ఉన్నాయి. అదే ఫిబ్రవరిలో వేచి ఉన్న నౌకల సంఖ్య 260 మాత్రమే. ఈ విషయాన్ని షిప్పింగ్‌ అనలటిక్స్‌ సంస్థ విండ్‌ వర్డ్‌ వెల్లడించింది. 

చైనా అంచనాలు గతి తప్పి..

చైనా కర్మాగారాలకు ‘క్లోజ్డ్‌ లూప్‌’ పేరిట ఓ విధానం అమలు చేస్తోంది. దీనిలో కార్మికులు బయటకు రాకుండా పనిచేసే చోటే ఉండిపోవడం. వారు వేరే వారిని కలవకూడదు. ఈ విధానంతో ఒమిక్రాన్‌ పెద్దగా వ్యాప్తిచెందదని భావించారు. కానీ, ఏదైనా క్లోజ్డ్‌ లూప్‌లోకి వైరస్‌ చొరబడితే.. మొత్తం ఉత్పత్తి ఆగిపోతోంది. ఇటీవల టెస్లాకు వైరింగ్‌ హార్నెస్‌లు సరఫరా చేసే సంస్థలో వైరస్‌ వ్యాప్తితో ఉత్పత్తి దెబ్బతింది. ఈ ప్రభావం టెస్లాపై కూడా పడింది.

Read latest World News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts