China: చైనా సమర్పించు.. చెవిలో పూలు..!

‘జీరో కొవిడ్‌ పాలసీ’..! కోట్ల మంది కఠిన లాక్డౌన్‌లోకి..! వైరస్‌ను అణిచివేతకు పరుగులు పెడుతున్న అధికారులు.. ఇటీవల కాలంలో చైనా నుంచి తరచూ వెలువడుతున్న

Published : 19 Jan 2022 01:37 IST

ఒమిక్రాన్‌ను కూడా వాడుకొనే పనిలో డ్రాగన్‌..!

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

‘జీరో కొవిడ్‌ పాలసీ’..! కోట్ల మంది కఠిన లాక్‌డౌన్‌లోకి..! వైరస్‌ అణచివేతకు పరుగులు పెడుతున్న అధికారులు.. ఇటీవల కాలంలో చైనా (china) నుంచి తరచూ వెలువడుతున్న వార్తలివి. ఒకటీ అరా కేసులు వస్తోంటేనే కఠిన చర్యలు తీసుకొంటున్నామని అధికారులు గొప్పగా చెప్పుకుంటున్నా.. వాస్తవ పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. అక్కడ పుట్టగొడుగుల్లా వైరస్‌ అవుట్‌బ్రేక్‌ (వైరస్‌ నిర్ణీత ప్రాంతంలో వ్యాపించడం)లు వస్తున్నాయని చైనా వైరాలజిస్టు ఒకరు ఆంగ్ల పత్రిక సీఎన్‌ఎన్‌కు తెలియజేశారు. ఏబీసీ సంస్థ అక్కడ అత్యవసర పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొంది. వైరస్‌పై పోరులో గ్లోబల్‌ లీడర్‌గా ప్రచారం చేసుకొనేందుకు చైనా వీటిని వీలైనంత తక్కువ చేసి చూపిస్తోంది. చైనా (china) నుంచి వచ్చిన కొంత సమాచారం చూస్తే అసలు ఇది నిజమేనా అనిపిస్తుంది.

చైనా (china) కొవిడ్‌ డేటాలో సమాచార లోపం..

చైనా నుంచి వచ్చే కొవిడ్‌ డేటాలో సమాచార లోపం ఉందని క్వాంటిటేటివ్‌ ఫైనాన్స్‌ నిపుణుడు జార్జి చాహున్‌ చెబుతున్నారు. ది ఎకానమిస్టు పత్రిక ఎంఎల్‌ మోడల్‌ పేరిట 121 అత్యాధునిక స్టాటిస్టికల్‌ టెక్నిక్స్‌ వాడి 200 దేశాల కొవిడ్‌ డేటాను పరిశీలించింది. ఇలాంటి విధానాలతోనే చైనా బాహ్య ప్రపంచానికి కొద్దిగా వెల్లడించిన డేటాను జార్జి చాహున్‌ పరిశీలించడంతో లోపాలు స్పష్టంగా కనిపించాయి.

కొన్నాళ్లుగా చైనా (china) నుంచి కొవిడ్‌ మృతుల సంఖ్యలు అస్సలు బాహ్య ప్రపంచానికి వెల్లడి కావడంలేదు. మృతుల సంఖ్య ఆధారంగా కొవిడ్‌ ప్రభావం ఆ దేశ ప్రజలపై ఏ స్థాయిలో ఉందో అంచనా వేస్తారు. చైనా నుంచి డేటా అందడంలేదు. దీంతో ప్రభావాన్ని అంచనా వేసే సమయంలో చైనాను పరిగణనలోకి తీసుకోవడంలేదు. కొవిడ్‌పై జరిగే సైన్స్‌ పరిశోధనలకు చైనా ఏమాత్రం సహకారం అందించడంలేదు. ఫలితంగా వైరస్‌ పుట్టుపూర్వోత్తరాలు కూడా తెలుసుకోలేని పరిస్థితి నెలకొంది. 

చైనాలో ప్రతి లక్ష జనాభాలో కొవిడ్‌ మరణాల రేటు దక్షిణ కొరియా కంటే 30 రెట్లు తక్కువని.. సింగపూర్‌ కంటే 50రెట్లు తక్కువని.. అదే న్యూజిలాండ్‌తో పోలిస్తే 73 రెట్లు తక్కువగా ఉందని డ్రాగన్‌ సర్కారు ప్రచారం చేస్తోంది. చైనా వలే ఈ మూడు దేశాలు కూడా కఠినమైన కొవిడ్‌ నిబంధనలు అమలు చేశాయి. వీటిల్లో ఆరోగ్య సౌకర్యాలు మెరుగ్గా ఉన్నాయి. వ్యాక్సినేషన్‌ కూడా సమర్థంగా జరిగింది.

హాంకాంగ్‌కు.. చైనాకు ఇంత తేడా దేనికి..?

కొవిడ్ వ్యాప్తికి ముందే చైనా హాంకాంగ్‌ను గుప్పిట బంధించింది. హాంకాంగ్‌లో కొవిడ్‌ నియంత్రణకు చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. 2020లో జనవరి-ఏప్రిల్‌ మధ్యలో చైనాలో 81,596 కేసులు నమోదుకాగా.. 4,636 మంది మృతి చెందారు. అదే సమయంలో హాంకాంగ్‌లో 765 కేసులు రాగా.. నలుగురు మృతి చెందారు. 

2020 ఏప్రిల్‌ తర్వాత నుంచి జనవరి 8, 2022 వరకు చైనాలో 22,102 కేసులు రాగా ఒక్కరు కూడా మృతి చెందలేదని డ్రాగన్‌ చెబుతోంది. అదే సమయంలో చైనా (china) నియంత్రణలోని హాంకాంగ్‌లో 12,005 కేసులు రాగా.. 209 మంది మృతి చెందినట్లు లెక్కలు చెబుతున్నాయని ఫోర్బ్స్‌ పత్రిక కథనం పేర్కొంది. 

ఏప్రిల్‌ వరకు చైనాలో కొవిడ్‌ సోకిన వారి మరణాల రేటు నూటికి 5.7శాతంగా ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యధికం. కానీ, ఏప్రిల్‌ తర్వాత నుంచి విచిత్రంగా ఇది 0శాతానికి పడిపోయింది. అది కూడా 22 వేల కేసులు నమోదయ్యాక కావడం గమనార్హం. ప్రపంచ సగటు 1.8శాతం కాగా.. హాంకాంగ్‌లో 1.6శాతం.. అమెరికాలో 1.3శాతంగా నమోదయ్యాయి. 

భారీగా పెరిగిన సాధారణ మరణాలు..!

2019 నుంచి చైనాలో సాధారణ మరణాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. ప్రపంచ సగటు కంటే ఇవి చాలా ఎక్కువగా నమోదైనట్లు ప్రపంచ బ్యాంక్‌, ఐరాస వద్ద ఉన్న నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా సాధారణ మరణాల రేటు స్వల్పంగా పెరిగినా.. చైనాలో నాటకీయంగా పెరిగినట్లు గ్రాఫ్‌లు చెబుతున్నాయి. 2019లో ప్రపంచ వ్యాప్తంగా సాధారణ మరణాల రేటు 1000కి 0.3 ఉండగా.. చైనాలో 2.0శాతంగా ఉంది. చైనాలో 2018 వరకు ఉన్న ట్రెండ్‌తో పోల్చినా.. 1,62,018 మరణాలు ఎక్కువగా నమోదయ్యాయి. 2020లో ప్రపంచ వ్యాప్తంగా సాధారణ మరణాలు 0.4శాతం ఉండగా.. చైనాలో 1.9శాతంగా నమోదయ్యాయి. 2021లో ప్రపంచ వ్యాప్తంగా సాధారణ మరణాల సగటు 0.9శాతం ఉండగా.. చైనాలో 1.9శాతంగా ఉంది. మొత్తం మీద ఈ మూడేళ్లలో అక్కడ 9,81,222 మరణాలు అధికంగా నమోదైనట్లు ఐరాస డేటా లెక్కలు చెబుతున్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు