China: ఆస్ట్రేలియా నిఘానేత్రంపై చైనా నిప్పుల వర్షం..!

దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇటీవల ఆస్ట్రేలియాకు చెందిన ఒక పొసైడాన్‌ విమానంపై చైనాకు చెందిన ఓ ఫైటర్‌ జెట్‌ ఛాఫ్‌, ఫ్లేర్‌ (క్షిపణులను, రాడార్లను తప్పించుకోవడానికి వెదజల్లే లోహపు తునకలు, నిప్పులు )ను వదిలింది.

Updated : 06 Jun 2022 11:56 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇటీవల ఆస్ట్రేలియాకు చెందిన ఒక పొసైడాన్‌ విమానంపై చైనాకు చెందిన ఓ ఫైటర్‌ జెట్‌ చాఫ్‌, ఫ్లేర్‌(క్షిపణులను, రాడార్లను తప్పించుకోవడానికి వెదజల్లే లోహపు తునకలు, నిప్పులు )లను వదిలింది. ఇలా విడుదల చేసిన చాఫ్‌ల్లో ఒకటి పీ-8 విమానం ఇంజిన్‌లోకి ప్రవేశించింది. దీంతో ఆ విమానం వెంటనే తన నిఘా మిషన్‌ను రద్దు చేసుకొని ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్లిపోయింది.  ఈ ఘటనపై ఆస్ట్రేలియా రక్షణ మంత్రి రిచర్చ్‌ మార్లెస్‌ స్పందిస్తూ..‘‘ మే 26న చైనాకు చెందిన జే-16 ఫైటర్‌ జెట్‌ ఆస్ట్రేలియా నిఘా విమానం పీ-8కు అత్యంత సమీపంలోకి వచ్చింది. అదే సమయంలో జెట్‌ విమానం చాఫ్‌ను విడుదల చేసింది. ఆ తర్వాత పీ-8 విమానం ముందు భాగానికి అత్యంత సమీపం నుంచి వేగంగా వెళ్లిపోయింది. అదే సమయంలో చాప్‌ బండిల్‌ను విడుదల చేసింది. దీనిలో కొన్ని ముక్కలు పీ-8 ఇంజిన్‌లోకి ప్రవేశించాయి. ఈ చిన్న అల్యూమినియం ముక్కలు విమానం ఇంజిన్‌ను ధ్వంసం చేయగలవు’’ అని పేర్కొన్నారు. ఆస్ట్రేలియా విమానం తన మిషన్‌ను వెంటనే రద్దు చేసుకొని వెనక్కి వెళ్లిపోయింది. ఒక ఇంజిన్‌ దెబ్బతిన్నా పీ-8 విమానం ప్రయాణించగలదు. ఈ విషయంపై ఆస్ట్రేలియా ప్రధాని అల్బానెసె మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఈ అంశాన్ని బీజింగ్‌ వద్ద లేవనెత్తుతుందని పేర్కొన్నారు. అంతర్జాతీయ జలాలు, గగనతలంపై ఉన్న స్వేచ్ఛకు అనుగుణంగానే తమ విమానం ప్రయాణిస్తొందని వెల్లడించారు.

ఏమిటీ చాఫ్‌, ఫ్లేర్‌..!

సాధారణంగా యుద్ధవిమానాల రాకను ముందుస్తుగా గుర్తించేందుకు ఇంజిన్ల నుంచి వెలువడే వేడిని లేదా.. ఆ యుద్ధవిమానం తయారీకి వాడే లోహాన్ని ఆధారంగా చేసుకొని గుర్తిస్తారు. రాడార్లు ఈ లోహ విహంగాలపైకి తరంగాలను పంపి.. పరావర్తనం ఆధారంగా గుర్తిస్తాయి. రాడార్లను తప్పుదోవపట్టించేందుకు యుద్ధ విమానాల నుంచి భారీ ఎత్తున అల్యూమినియం లేదా జింక్‌ తునకలను వెదజల్లుతారు. వీటిని చాఫ్‌ అంటారు.  రాడార్‌ తరంగాలు వీటిని తాకి కూడా పరావర్తనం చెందుతాయి. దీంతో రాడార్లు లక్ష్యాలను గుర్తించడంలో గందరగోళానికి గురవుతాయి.

కొన్ని రకాల క్షిపణులు విమానం ఇంజిన్‌ వేడిని గుర్తించి వాటిపై దాడులు చేస్తాయి. ఇలా వాటిని తప్పించుకొనేందుకు యుద్ధవిమానాలు మెగ్నిషియం పిల్లెట్స్‌ను ప్రత్యేకమైన గొట్టాల ద్వారా గాల్లో వెదజల్లుతాయి. ఇవి గాల్లో మండి 2,000 డిగ్రీలకు పైగా వేడిని సృష్టిస్తాయి. అప్పుడు  వేడిని గుర్తించే పరికరాలు వీటిని విమానాలుగా భావించి.. క్షిపణులను ఈ దిశగా నడిపిస్తాయి. అదే సమయంలో యుద్ధవిమానం తప్పించుకోవచ్చు.

కయ్యానికి కాలు దువ్వేలా..

దక్షిణ చైనా సముద్రంలో ఇతర దేశాల విమానాలతో డ్రాగన్‌ దుందుడుకుగా వ్యవహరించడం వారం వ్యవధిలో ఇది రెండోసారి. ఇటీవల కెనడాకు చెందిన నిఘావిమానం అత్యంత సమీపానికి చైనా ఫైటర్‌ జెట్‌ దూసుకొచ్చింది. దీంతో కెనడా విమానం దారి మార్చుకోవాల్సి వచ్చింది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా ఆస్ట్రేలియా  పీ-8 విమానాన్ని చైనా వేధించింది. ఈ విమానం పైలట్లు గందరగోళానికి గురయ్యేలా లేజర్లను ప్రయోగించింది. దీనిపై చైనా-ఆస్ట్రేలియా మధ్య మాటల యుద్ధం చోటు చేసుకొంది. ఆస్ట్రేలియా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తోందని చైనా ఆరోపించింది.

2001లో అమెరికా విమానాన్ని ఢీకొట్టి..

2001లో చైనా వైమానిక దళ పైలట్లు చేసిన నిర్వాకం ఒక్కసారిగా ఉద్రిక్తతలను పెంచింది. ఆ ఏడాది చైనాకు చెందిన ఎఫ్‌-8 ఫైటర్‌ జెట్‌ విమానం అమెరికా నౌకాదళానికి చెందిన నిఘా విమానానికి అత్యంత సమీపంలోకి వచ్చేందుకు ప్రయత్నించే క్రమంలో ఢీకొట్టింది. ఈ ఘటనలో చైనా పైలట్‌ మృతి చెందగా.. అమెరికా విమానాన్ని చైనాలోని హైనన్‌ ద్వీపంపై ల్యాండ్‌ చేయాల్సి వచ్చింది. దీంతో 24 మంది అమెరికా సిబ్బందిని 11 రోజులపాటు ఉంచి.. తర్వాత చైనా విడుదల చేసింది.

ప్రమాదకరంగా మార్చేస్తున్న రహస్య క్షిపణి పరీక్షలు..

ఓ పౌర విమానం సమీపం నుంచి చైనా ప్రయోగించిన క్షిపణి వెళుతున్న దృశ్యాలు ఇటీవల అమెరికా పైలట్‌ ఒకరు వెలుగులోకి తెచ్చారు. హాంకాంగ్‌ కేంద్రంగా పనిచేసే కాథీ పసిఫిక్‌ విమానయాన సంస్థకు చెందిన బోయింగ్‌ 777 నుంచి ఈ వీడియో తీశారు. ఈ క్షిపణి ప్రయోగానికి ముందు ఎటువంటి నోటామ్‌ (నోటిస్‌ టు ఎయిర్‌మెన్‌) జారీ చేయలేదని తేలింది. దీంతో బీజింగ్‌ ఈ క్షిపణిని రహస్యంగా ప్రయోగించినట్లు అంచనాకు వచ్చారు. టైప్‌ 094 సబ్‌మెరైన్‌ నుంచి ప్రయోగించిన జేఎల్‌-3 క్షిపణిగా దీనిని భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని