China: లాక్‌డౌన్‌ కఠిన ఆంక్షలతో మూడేళ్ల చిన్నారి మృతి..

చైనాలోని లాంఝౌ నగరం దాదాపు నెలరోజులుగా లాక్‌డౌన్‌లో ఉంది. దాంతో లక్షలాదిమంది ప్రజలు కనీస సదుపాయాలు అందక ఇక్కట్లుపడుతున్నారు. నిత్యావసరాలతో పాటు అత్యవసర సేవలు వేగంగా అందక అవస్థపడుతున్నారు.

Published : 04 Nov 2022 01:12 IST

బీజింగ్‌: కొవిడ్ జీరో పాలసీని కఠినంగా అమలు చేస్తోన్న చైనా అధికారులు క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. వారు అమలు చేస్తోన్న నిబంధనల మూలంగా వైద్యం అందక ఓ మూడేళ్ల పిల్లాడు ప్రాణాలు కోల్పోయాడు. దాంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం కావడంతో వారు దిగిరావాల్సి వచ్చింది. 

చైనాలోని లాంఝౌ నగరం దాదాపు నెలరోజులుగా లాక్‌డౌన్‌లో ఉంది. దాంతో లక్షలాదిమంది ప్రజలు కనీస సదుపాయాలు అందక ఇక్కట్లుపడుతున్నారు. నిత్యావసరాలతో పాటు అత్యవసర సేవలు వేగంగా అందక అవస్థపడుతున్నారు. ఈ క్రమంలో కార్బన్ మోనాక్సైడ్ కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురైన మూడేళ్ల బాలుడు చికిత్స అందక మరణించాడు. మంగళవారం ఈ చిన్నారి మృతి గురించి అధికారిక వర్గాలు వెల్లడించాయి. కానీ, మరణానికి గల కారణాలు మాత్రం చెప్పలేదు. తన బిడ్డను ఆసుపత్రిలో చేర్చే నిమిత్తం తాను ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు సిబ్బంది అంగీకరించలేదని, సకాలంలో అంబులెన్స్ రాలేదని ఆ చిన్నారి తండ్రి సోషల్ మీడియాలో వెల్లడించారు. దాంతో అతడు కాంపౌండ్ నుంచి ఎలాగోలా తప్పించుకొని, ట్యాక్సీ పట్టుకొని ఆసుపత్రికి వెళ్లారు. కానీ కొద్దిసేపటికే తన బిడ్డ చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారని ఆవేదన వ్యక్తం చేశారు. 

దీనిపై సోషల్‌ మీడియాలో అధికారుల తీరుపై వ్యతిరేకత వ్యక్తమయింది. కాలనీ వాసులు ఆందోళన చేపట్టారు. దాంతో అధికారులు దిగిరాక తప్పలేదు. ఆ బిడ్డ మృతికి గల కారణాలు వెల్లడించడంతో పాటు క్షమాపణలు తెలియజేశారు. ‘ఈ విమర్శలను మేం అంగీకరిస్తున్నాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటాం’ అని తెలిపారు. ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఆ చిన్నారి తండ్రి ఎమర్జెన్సీ నంబర్‌కు ఎన్నోమార్లు ఫోన్‌చేసినా.. అంబులెన్స్‌ పంపేందుకు 90 నిమిషాలు పట్టిందని వారు అంగీకరించారు. అత్యవసర సేవలు అందించే విషయంలో ఉన్న లోపాలను ఈ ఘటన బయటపెట్టిందన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని