South China Sea: గల్వాన్‌ తరహా ఘటన.. ఫిలిప్పీన్స్‌ నేవీపై చైనా దళాలు కత్తులు, గొడ్డళ్లతో దాడి..!

గల్వాన్‌లో భారత దళాలపై పదునైన ఆయుధాలతో కయ్యానికి కాలు దువ్వినట్లే.. ఇప్పుడు దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్‌ బలగాలు దాడికి తెగబడ్డాయి. బీజింగ్‌ మూకలు ఫిలిప్పీన్స్‌ నేవీపై కత్తులు, గొడ్డళ్లతో దాడి చేశాయి. 

Published : 20 Jun 2024 14:08 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఫిలిప్పీన్స్‌ దళాల పడవలపై చైనాకు చెందిన కోస్ట్‌ గార్డ్‌ బలగాలు దాడులు చేశాయి. వారి పడవలను కత్తులు, గొడ్డళ్లు, సుత్తులతో  ధ్వంసం చేయడానికి యత్నించాయి. ఈ ఘటన ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచింది. దీనిపై ఫిలిప్పీన్స్ అధికారులు స్పందిస్తూ.. తమ నౌకాదళానికి చెందిన రెండు బోట్లు సెకండ్‌ థామస్‌ షోల్‌కు ఆహారం, ఇతర వస్తువులను తీసుకెళ్తుండగా చైనా దళాలు దాడి చేసినట్లు వెల్లడించారు.

బీజింగ్‌ దళాలు తొలుత ఫిలిప్పీన్స్‌ దళాలతో వాదనకు దిగి.. అనంతరం ఆ బోట్లలోకి చొరబడ్డాయి. మనీలా పడవల్లో ఉన్న బాక్సుల్లోని ఎం4 రైఫిల్స్‌ను వారు స్వాధీనం చేసుకొన్నారు. వీటితోపాటు అక్కడే ఉన్న నేవిగేషన్‌ పరికరాలను కూడా సీజ్‌ చేశారు. ఈ ఘటనలో ఫిలిప్పీన్స్‌ దళాల్లోని పలువురు గాయపడ్డారు. ఒక సైనికుడి బొటనవేలు తెగిపోయింది. పడవలు ఎటూ కదలకుండా చైనా దళాల పడవలు చుట్టుముట్టాయి.

ఫిలిప్పీన్స్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ రోమియో బ్రవ్నెర్‌ జూనియర్‌ ఓ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో ఈ ఘటనపై స్పందిస్తూ.. చైనా దళాలను సముద్రపు దొంగలతో పోల్చారు. ‘‘చైనా కోస్ట్‌గార్డ్‌ వద్ద పదునైన ఆయుధాలున్నాయి. మా సైనికులు ఒట్టిచేతులతో పోరాడారు. మా ఆయుధాలు, పరికరాలను తక్షణమే తిరిగి ఇవ్వాలి. అంతేకాదు వారు కలిగించిన నష్టానికి పరిహారం చెల్లించాలి’’ అని డిమాండ్‌ చేశారు. తమ దళాల సంఖ్య తక్కువగా ఉన్నా.. ధైర్యంగా చైనాపై పోరాడాయని ఆయన కొనియాడారు. యుద్ధాలను నివారించాలన్నది తమ లక్ష్యమని పేర్కొన్నారు.

మరోవైపు చైనా విదేశాంగశాఖ ఈ ఘర్షణపై స్పందించింది. ‘‘చైనా కోస్ట్‌గార్డ్‌ దళాలు చట్టపరమైన చర్యలు తీసుకొని.. ఫిలిప్పీన్స్‌ పడవలో అక్రమ ఆయుధ సరఫరాను అడ్డుకొన్నాయి. ఆ దేశ సైనికులపై ప్రత్యక్ష చర్యలు తీసుకోలేదు’’ అని పేర్కొంది.

కోస్ట్‌గార్డ్‌ చట్టంలో సరికొత్త నిబంధనను డ్రాగన్‌ గత శనివారం అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం జల సరిహద్దులను అతిక్రమించిన విదేశీయులను బీజింగ్‌ బలగాలు 30 నుంచి 60 రోజులపాటు నిర్బంధించే అవకాశాన్ని కల్పించింది. ఈ చట్టం కల్పించిన అధికారాలతోనే చైనా తీర రక్షక సిబ్బంది తాజాగా దాడికి తెగబడినట్లు తెలుస్తోంది. దక్షిణ, తూర్పు చైనా సముద్రాలు తనవేనని బీజింగ్‌ వాదిస్తోంది. ఇప్పుడు వాటిల్లోకి వచ్చే సమీప దేశాల సిబ్బందిని బంధించేందుకు ఈ చట్టం స్వేచ్ఛనిచ్చినట్లైంది. ఇటీవలే ఫిలిప్పీన్స్‌ నౌకను ఢీకొట్టడం గమనార్హం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని