పక్షుల్లా ప్రవర్తిస్తున్న చైనా యువత.. ఎందుకో తెలుసా?

చైనా పని సంస్కృతిపై అక్కడి యువత నిరసన వ్యక్తం చేస్తున్నారు. పక్షుల్లా నటిస్తూ స్వేచ్ఛ కోరుకుంటున్న ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారుతున్నాయి.

Published : 19 Jun 2024 00:12 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చైనా యువత వింతగా ప్రవర్తిస్తున్నారు. హఠాత్తుగా పక్షుల్లా అవతారం ఎత్తుతున్నారు. పొడవాటి టీ షర్టులు ధరించి పక్షుల్లా వ్యవహరిస్తున్నారు. నడక దగ్గర నుంచి అరవడం వరకు అన్నింటా వాటిని అనుకరిస్తున్నారు. కిచకిచలాడుతూ పక్షుల్లా నటిస్తున్న వారి ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. వీటిని చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఇంతకీ వీరు ఎందుకిలా చేస్తున్నారో తెలుసా?

వారంలో ఆరు రోజులు పాటు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉద్యోగులు పనిచేయాలనేది డ్రాగన్‌ ప్రభుత్వ పని విధానం. దీన్నే ‘996’గా స్థానికంగా పేర్కొంటారు.
ఈ విధానానికి వ్యతిరేకంగా చైనాలోని యువత నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇది ట్రెండ్‌ అవుతోంది.

పని, కుటుంబ ఒత్తిళ్లు.. కొత్త నైపుణ్యాలకు దూరం!

స్వేచ్ఛగా, ఎటువంటి అడ్డంకులూ లేకుండా జీవించడమే పక్షిగా ఉండడం వెనుక ఉన్న ఆలోచన అంటున్నారు అక్కడి యువత. ఎక్కువ గంటలు పనిచేయడం లేదా చదువుకోవడం వంటి వాటి నుంచి విముక్తి పొందడం కోసం వారు పక్షిలా నటిస్తున్నారు. ఈ నిరసనకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. దీనిపై నెటిజన్లు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. పక్షిగా ఉంటేనే బాగుండేమో అని కొందరు ఆ యువతకు సపోర్ట్‌ చేస్తూ కామెంట్లు పెడుతుంటే.. పక్షులు కూడా ఆహారం సంపాదించడం కోసం కష్టపడతాయంటూ మరికొందరు పేర్కొంటున్నారు. చైనాలోని యువత సోషల్‌మీడియా వేదికగా తమ దేశ పని సంస్కృతిపై నిరాశను వ్యక్తం చేయడం ఇదేం మొదటిసారి కాదు. గతంలోనూ పని విధానంపై ఇలా సోషల్‌మీడియా వేదికలపై నిరసన గళాన్ని వినిపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు