Mariupol: నిన్నటి వరకు రష్యా.. ఇప్పుడు కలరా..!

యుద్ధం కనిపించే ప్రాణ, ఆస్తి నష్టాలకే కాదు.. కనిపించని ఎన్నో దుర్భర పరిస్థితులకు కారణమవుతుంది.

Published : 12 Jun 2022 01:52 IST

కీవ్‌: యుద్ధం కనిపించే ప్రాణ, ఆస్తి నష్టాలకే కాదు.. కనిపించని ఎన్నో దుర్భర పరిస్థితులకు కారణమవుతుంది. రష్యా దురాక్రమణతో ఉక్రెయిన్‌లో ప్రస్తుతం అదే వాతావరణం నెలకొంది. పుతిన్ సేనల దాడులతో ధ్వంసమైన వాటిలో మేరియుపొల్ కూడా ఒకటి. ఆ నగర వీధులు.. శ్మశాన ప్రాంతాలుగా కనిపించాయి. అయితే మృతదేహాలను తొలగించే వ్యవస్థ నిర్వీర్యం కావడంతో.. ఇప్పుడక్కడ కలరా వ్యాధి ప్రబలుతోంది. ఈ విషయాన్ని మేరియుపొల్ మేయర్ వెల్లడించారు. 

‘శవాలు వీధుల్లో కుళ్లిపోతున్నాయి. వాటిని తొలగించే పారిశుద్ధ్య వ్యవస్థ విచ్ఛిన్నమైంది. దాంతో విరేచనాలు, కలరా వ్యాప్తి జరుగుతోంది. యుద్ధంతో సంభవించిన ప్రాణ నష్టం చాలదన్నట్టు, ఈ అనారోగ్యాలు ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. కొన్ని బావులు కూడా శవాల కారణంగా కలుషితమయ్యాయి’ అని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం మేరియుపొల్ రష్యా ఆధీనంలో ఉంది. ఈ నగరంలో ఉన్న మిగతా వారిని కూడా తరలించేందుకు ఐరాస, అంతర్జాతీయ సంస్థలు మానవతా కారిడార్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. 

ఈ దురాక్రమణలో 287 చిన్నారులు మృతి..

ఇక యుద్ధం మొదలైన దగ్గరి నుంచి అభంశుభం తెలియని ఉక్రెయిన్ చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటివరకూ 287 మంది మరణించారు. 492 మంది గాయాలపాలయ్యారు. ఈ విషయాన్ని ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని