Australia Floods: సిడ్నీకి జల గండం..!

ఆస్ట్రేలియాలోని అందాల నగరం సిడ్నీలో వరదలు సర్వసాధారణంగా మారుతున్నాయి. ఆగ్నేయ ఆస్ట్రేలియాలోని న్యూసౌత్‌ వేల్స్‌ రాష్ట్రం గత 18 నెలల్లో నాలుగు భయంకరమైన జలప్రళయాలను చూసింది.

Updated : 06 Jul 2022 13:20 IST

 భారీ వరదలకు కేంద్రంగా న్యూసౌత్‌వేల్స్‌ 

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

ఆస్ట్రేలియాలోని అందాల నగరం సిడ్నీ తరచూ వరదల్లో మునుగుతోంది . ఈ నగరం ఉన్న ఆగ్నేయ ఆస్ట్రేలియాలోని న్యూసౌత్‌ వేల్స్‌ రాష్ట్రం గత 18 నెలల్లో నాలుగు భయంకరమైన జలప్రళయాలను చూసింది. పెరుగుతున్న వాతావరణ మార్పులకు భౌగోళిక పరిస్థితులు ఆజ్యం పోయడంతో సిడ్నీవాసులు వరదల తాకిడి నుంచి కోలుకోలేకపోతున్నారు. ఆస్ట్రేలియా వరదలు కేవలం స్థానికులకు మాత్రమే ఆందోళనకరం కాదు.. అవి ప్రపంచానికే ఓ హెచ్చరిక..!

సాక్‌విల్లె బాత్‌టబ్‌లో నివాసం..!

ఆస్ట్రేలియాలోనే అత్యధిక వరదముప్పు పొంచిఉన్న ప్రాంతం న్యూసౌత్‌వేల్స్‌. ఇక్కడ ప్రవహించే హాక్స్‌బరి-నెపియన్‌ నది వరద అంతవేగంగా బయటకు వెళ్లకుండా భౌగోళిక పరిస్థితులు నెలకొన్నాయి. విండ్‌సోర్‌, రిచ్‌మాండ్‌, ఈమూ ప్లెయిన్స్‌, పాన్‌రిత్‌, బ్లాక్‌ టౌన్ వంటి ప్రాంతాలు ఈ నది వరదకు అనుకూలంగా ఉంటాయి. వీటిల్లో చాలా వరకు ద్వీపాల వలే నీరు చుట్టుముట్టి ఉంటాయి. ఇక్కడే ‘సాక్‌విల్లె బాత్‌టబ్‌’ అనే లోతట్టు ప్రాంతంలో దాదాపు 18 వేల మంది నివసిస్తున్నారు. రిచ్‌మాండ్‌ నుంచి సాక్‌విల్లె మధ్య ఉన్న ప్రదేశం ఇది. వరదల సమయంలో ఈ ప్రదేశం తీవ్రంగా ప్రభావితం అవుతుంది. దీనిలో పశ్చిమ సిడ్నీకి చెందిన కుంబర్లాండ్‌ ప్లెయిన్లు కూడా భాగమే. దాదాపు 100 మిలియన్ల సంవత్సరాలపాటు జరిగిన భౌగోళిక మార్పులో భాగంగా ఏర్పడ్డ  తొట్టె వంటి ఈ ప్రదేశం చుట్టూ నిట్టనిలువు భూభాగాలు ఉంటాయి. ఇక్కడి నుంచి  హాక్స్‌బరి-నెపియన్‌ నది ఇరుకైన భారీ ఇసుక శిలల మధ్య నుంచి కిందకు ప్రవహిస్తుంది. ఈ ప్రదేశం కారణంగా సాక్‌విల్లె బాత్‌టబ్‌ నుంచి వేగంగా వరద బయటకు పోలేదు. సాక్‌విల్లె బాత్‌టబ్‌కు దాదాపు ఐదు ప్రవాహాల నుంచి నీరు చేరుతుంది. అదే సమయంలో బయటకు వెళ్లే మార్గాలు ఇరుకైపోయాయి. మరోవైపు సిడ్నీ వేగంగా విస్తరిస్తుండటంతో ముంపు ప్రాంతాల్లో కూడా నిర్మాణాలు చోటు చేసుకొంటున్నాయి.

వరదను ఆపలేని వరగాంబ డ్యామ్‌..

హాక్స్‌బరి-నెపియన్‌ నదికి ఉపనది అయిన వరగాంబపై నిర్మించిన డ్యామ్‌ కూడా వరదను అడ్డుకోలేకపోతోంది. ది న్యూసౌత్‌ వేల్స్‌ ప్రభుత్వం ఎప్పటి నుంచో ఈ డ్యామ్‌ ఎత్తు పెంచాలన్న ప్రణాళికను పరిశీలిస్తోంది. వాస్తవానికి వరదలకు కారణయ్యే వర్షపు నీటిలో దాదాపు 60 శాతం వరకు హాక్స్‌బరి-నెపియన్‌ నది నుంచి సాక్‌విల్లె బాత్‌టబ్‌లోకి రావడంలేదు. వరగాంబ డ్యామ్‌ వైపు వెళ్లని నీరే దీనిలోకి చేరుతోంది. హాక్స్‌బరి-నెపియన్‌ నదికి వరద వచ్చే సమయానికే సాక్‌విల్లె బాత్‌టబ్‌ నిండిపోయి ఉంటోందని సిడ్నీ విశ్వవిద్యాలయం పేర్కొంది. దీంతో డ్యామ్‌ ఎత్తు పెంచినా ప్రయోజనం ఉండని పరిస్థితి నెలకొంది.

వాతావరణ మార్పులు..

హాక్స్‌బరి-నెపియన్‌ నదీ పరీవాహక ప్రాంతంలో సుదీర్ఘకాలం పొడి వాతారణం- తేమ వాతవరణం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సిడ్నీ విశ్వవిద్యాలయానికి చెందిన రాబిన్‌ వార్నర్‌.. దాదాపు 100 ఏళ్ల వాతావరణ చక్రాన్ని దీనికి ఆధారంగా చూపారు. ఇక్కడ దాదాపు 40 నుంచి 50 సంవత్సరాలు పొడివాతావరణం ఉన్న తర్వాత చిన్న వరదలు మొదలై.. తేమ వాతావరణం, భారీ వరదలు చోటుచేసుకుంటాయి. ఆ పరిస్థితి మరో 50 ఏళ్ల వరకు ఉంటుంది. 1950 నుంచి 1990 వరకు ఉన్న తేమ వాతావరణంలో ప్రతి నాలుగేళ్లకు ఒక సారి చొప్పున 12 మార్లు అత్యంత భారీ వరదలను న్యూసౌత్‌వేల్స్‌ చవిచూసింది. ఆ తర్వాత 1990 నుంచి గతేడాది వరకు భారీ వరదలు మళ్లీ రాలేదు. ఇప్పుడు మళ్లీ 18 నెలల నుంచి వరదలు వస్తున్నాయి. దీన్ని చూసిన సిడ్నీ విశ్వవిద్యాలయం.. మరో 20 ఏళ్లపాటు వరదల ముప్పు పొంచి ఉంటుందని గతేడాది అంచనా వేసింది.

మరోవైపు వాతావరణ మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వేడిగాలులు వాతావరణంలో తేమను పెంచుతాయి. ఆస్ట్రేలియాలో భారీ వర్షాలు నమోదవుతాయని చాలా వాతావరణ పరిశోధనలు పేర్కొన్నాయి.

భారీ వరదలకు నిలయం హాక్స్‌బరి.. 

హాక్స్‌బరి నదిపై విండోసర్‌ వంతెన వద్ద 12 మీటర్లకంటే ఎక్కువ వరద రావడం కొత్తేమీ కాదు. 1799 నుంచి 24 సార్లు ఇటువంటి వరదలు వచ్చాయి. కాకపోతే ఇటీవల కాలంలో వాతావరణ శాఖ ముందస్తు వర్షాలు, వరదలను అంచనా వేయడంలో నైపుణ్యం సాధించడంతో ప్రజల ప్రాణాలను కాపాడుతున్నారు.

భారత్‌పై ప్రతికూల ప్రభావం..

బొగ్గు ఉత్పత్తిలో అత్యంత కీలక పాత్ర పోషించే ఆస్ట్రేలియా ఇప్పుడు విద్యుత్తు సంక్షోభం అంచున కొట్టుమిట్టాడుతోంది. అవకాశం ఉంటే నిత్యం కొంత సేపు లైట్లు ఆర్పేయమని న్యూ సౌత్‌వేల్స్‌ రాష్ట్ర ప్రజలను ఇటీవల ఆస్ట్రేలియా ఇంధన శాఖ మంత్రి క్రిస్‌ బొవెన్‌ స్వయంగా అభ్యర్థించారు. సిడ్నీ నగరంలో కూడా ఇలా చేయాలని కోరడం పరిస్థితికి అద్దంపడుతోంది. ఈ ఏడాది ప్రారంభంలో ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌, న్యూసౌత్‌ వేల్స్‌లో భారీగా వరదలు వచ్చాయి. ఈ ప్రాంతాల్లో బొగ్గు గనులు ఎక్కువ. వరదల కారణంగా గనులు, బొగ్గు సరఫరా చేసే రైల్వే లైన్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సరఫరాలు లేక బొగ్గు ఉత్పత్తి చేసే సామర్థ్యంలో 25శాతం ఖాళీగా ఉంచాల్సి వస్తోంది. ఇప్పుడు మరోసారి వరదలు రావడంతో బొగ్గు ఉత్పత్తి గణనీయంగా పడిపోయే ప్రమాదం ఉంది. ఈ కారణంగా భారత్‌లో ఇప్పటికే విద్యుత్తు ఉత్పత్తికి జూన్‌-సెప్టెంబర్‌ వరకు పవర్‌ ప్లాంట్ల అవసరాలకు సరిపడా బొగ్గు నిల్వలను సమీకరించడం కష్టతరంగా మారనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని