Nepal: 16 ఏళ్ల క్రితం భర్త.. ఇప్పుడు భార్య: కో పైలట్‌ దంపతుల విషాద గాథ ఇది..!

నేపాల్‌ (Nepal) విమాన ప్రమాదంలో హృదయ విదారక గాథ ఇది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కో-పైలట్‌ అంజు.. 16 ఏళ్ల క్రితం తన భర్తను కూడా ఇలాంటి ప్రమాదంలోనే పోగొట్టుకుంది.

Updated : 16 Jan 2023 13:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విమానాన్ని నడుపుతూ ఆ విధుల్లోనే భర్త ప్రాణాలు కోల్పోయినా.. ధైర్యంగా అదే రంగాన్ని ఎంచుకుందామె. భర్త విడిచివెళ్లిన బాధ్యతలను భుజానెత్తుకుని కో-పైలట్‌గా ఉద్యోగం సాధించింది. పైలట్‌ కావాలన్న తన కలను నిజం చేసుకునేందుకు కొద్ది గంటలే మిగిలి ఉండగా.. ఆమెను చూసి విధికి కన్నుకుట్టిందేమో..! ఆమె ఆశల్ని చిదిమేసింది. విమాన ప్రమాదం రూపంలో నాడు భర్తలాగే.. నేడు ఆ భార్యను కూడా తిరిగిరాని లోకాలకు తీసుకెళ్లింది. నేపాల్‌ (Nepal) విమాన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కో పైలట్ అంజు ఖటివాడా (Anju Khativada) విషాద గాథ ఇది..!

నేపాల్‌లో ఆదివారం 72 మందితో వెళ్తున్న ఓ ప్రయాణికుల విమానం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం జరిగిన యతి ఎయిర్‌లైన్స్‌ (Yeti Airlines) ఏటీఆర్‌-72 విమానానికి సీనియర్‌ కెప్టెన్‌ కమల్‌ కేసీ పైలట్‌గా ఉండగా.. అంజు కో-పైలట్‌గా వ్యవహరించారు. నేపాల్‌ నిబంధనల ప్రకారం.. పైలట్‌ అవ్వాలంటే కో-పైలట్‌గా 100 గంటల పాటు విమానం నడిపిన అనుభవం ఉండాలి. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఇప్పటివరకు అంజు నేపాల్‌లోని అన్ని ఎయిర్‌పోర్టుల్లో విమానాలను విజయవంతంగా దించారు. కో-పైలట్‌గా ఏటీఆర్‌-72 విమానం ఆమెకు చివరిది. ఆదివారం నాటి ఈ విమానాన్ని ల్యాండ్‌ చేసిన తర్వాత ఆమె పైలట్‌గా లైసెన్స్‌ పొందేవారు. తన కలల్ని నిజం చేసుకోవడానికి కేవలం కొన్ని నిమిషాలే ఉండగా.. ఈ విమాన ప్రమాదం (Plane Crash) చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో అంజుతో సహా విమానంలో ఉన్నవారంతా ప్రాణాలు కోల్పోయారు.

అంజు భర్త దీపక్‌ పోఖ్రెల్‌ కూడా 16 ఏళ్ల క్రితం యతి ఎయిర్‌లైన్స్‌కు పనిచేస్తూ ఇలాంటి విమాన ప్రమాదంలోనే ప్రాణాలు కోల్పోయారు. 2006 జూన్‌ 21న దీపక్‌ కో-పైలట్‌గా వ్యవహరించిన యతి ఎయిర్‌లైన్స్‌ విమానం ఒకటి నేపాల్‌గంజ్‌ నుంచి జుమ్లా వెళ్తుండగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. అందులో దీపక్‌ కూడా ఒకరు.

కొడుకు పుట్టాడని మొక్కు తీర్చుకోడానికి వెళ్లి..

ఈ ప్రమాదంలో ఇలాంటి హృదయ విదారక గాథలెన్నో ఉన్నాయి. నేపాల్‌ విమాన దుర్ఘటనలో మరణించిన వారిలో ఐదుగురు భారతీయులున్న విషయం తెలిసిందే. అందులో ఒకరు సోను జైస్వాల్‌. కొడుకు పుట్టాడన్న ఆనందంలో మొక్కు తీర్చుకోడానికి తన స్నేహితులతో కలిసి నేపాల్‌ వెళ్లిన ఆయన ఈ ప్రమాదంలో మృతిచెందారు.

ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోని ఘాజిపుర్‌ జిల్లాకు చెందిన సోను జైస్వాల్‌ స్థానికంగా మద్యం వ్యాపారం నిర్వహించేవారు. సోనుకు వరుసగా ఇద్దరు అమ్మాయిలు పుట్టడంతో.. కొడుకు పుడితే నేపాల్‌లోని ప్రముఖ పశుపతినాథ్‌ ఆలయాన్ని దర్శించుకుంటానని మొక్కుకున్నాడు. ఆయన కోరిక నిజమై ఆరు నెలల క్రితం వారసుడు జన్మించాడు. దీంతో ఈ నెల 10వ తేదీన సోను తన ముగ్గురు స్నేహితులతో కలిసి నేపాల్‌ వెళ్లారు. మొక్కు తీర్చుకుని అక్కడున్న పర్యటక ప్రాంతాలను సందర్శించేందుకు వెళ్తుండగా దురదృష్టవశాత్తూ ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఈ నలుగురు స్నేహితులు ప్రాణాలు కోల్పోయారు. విమానం కుప్పకూలడానికి కొద్ది క్షణాల ముందు సోను తన ఫేస్‌బుక్‌లో లైవ్‌ స్ట్రీమింగ్‌ చేశాడు. అందులో రికార్డయిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి.

మృతుల్లో జానపద గాయని..

ఈ ప్రమాదంలో నేపాల్‌కు చెందిన ప్రముఖ జానపద గాయని (Folk Singer) నీరా ఛంతియల్‌ మృతిచెందారు. మకర సంక్రాంతిని పురస్కరించుకుని పొఖారాలో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా విమాన ప్రమాదంలో దుర్మరణం చెందారు. ప్రమాదానికి కొద్ది గంటల ముందే ‘‘పొఖారాలో ఆనందాన్ని ఆస్వాదించేందుకు సిద్ధంగా ఉన్నా’ ఆమె సోషల్‌మీడిలో పోస్ట్‌ చేశారు. ఈలోగానే ఈ దుర్ఘటన చోటుచేసుకోవడం విచారకరం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు