కార్లను కప్పేసిన మంచు వర్షం.. ఊపిరాడక 16 మంది పర్యాటకులుమృతి

పాకిస్థాన్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ పర్యాటక ప్రాంతం ముర్రేలో భారీగా మంచు వర్షం కురిసి వాహనాలు చిక్కుకుపోయాయి. దీంతో 16 మంది పర్యాటకులు

Published : 08 Jan 2022 15:24 IST

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ పర్యాటక ప్రాంతం ముర్రేలో భారీగా మంచు వర్షం కురిసి వాహనాలు చిక్కుకుపోయాయి. దీంతో 16 మంది పర్యాటకులు ఊపిరాడక తమ వాహనాల్లో ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఓ పోలీస్‌ అధికారితో పాటు ఆయన కుటుంబానికి చెందిన 8 మంది ఉన్నారు. ఈ మేరకు ఇస్లామాబాద్‌ అధికారులు శనివారం వెల్లడించారు. 

పాక్‌ రాజధాని ఇస్లామాబాద్‌కు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముర్రే.. శీతాకాలంలో ప్రముఖ పర్యాటక కేంద్రం. ఏటా ఇక్కడకు లక్షలాది మంది పర్యాటకులు వస్తుంటారు. ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటంతో చలికాలంలో రోడ్లన్నీ ఎప్పుడూ మంచుతో కప్పి ఉంటాయి. శుక్రవారం ఇక్కడ ఉష్ణోగ్రత మైనస్‌ 8 డిగ్రీలకు పడిపోయింది. దీంతో భారీగా మంచు వర్షం కురిసింది. రోడ్లపై ఏకంగా నాలుగు అడుగుల మేర మంచు పరుచుకుంది. దీంతో పర్యాటకుల వాహనాలన్నీ మంచులో చిక్కుకుపోయాయి. రాత్రంతా మంచు వర్షం కురిసి వాహనాలను కప్పేసింది. 

ప్రయాణికులు కారు విండోలు తెరుచుకోడానికి కూడా వీల్లేకుండా మంచు పడింది. దీంతో 16 మంది ప్రయాణికులు వాహనాల్లో ఊపిరాడక మరణించినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో ఇస్లామాబాద్‌ పోలీసు అధికారి అతిఖ్‌ అహ్మద్‌తో పాటు ఆయన 8 మంది కుటుంబసభ్యులు కూడా ఉన్నారు. వీరంతా హైపోథెర్మియాతో ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. 

ప్రస్తుతం ముర్రే మార్గంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు వెయ్యికి పైగా వాహనాలను మంచు నుంచి బయటకు తీసుకురాగా.. ఇంకా వెయ్యి వాహనాల వరకు చిక్కుకుపోయాయని పాక్‌ మంత్రి షేర్‌ రషీద్‌ అహ్మద్‌ తెలిపారు. మరోవైపు ముర్రేలో ఎమర్జెన్సీ ప్రకటించినట్లు పాక్‌ అధికారిక మీడియా సంస్థ పీటీవీ న్యూస్‌ వెల్లడించింది. ఘటనాస్థలంలో ముంచును తొలగిస్తున్న దృశ్యాలను పాక్‌లోని పంజాబ్‌ ప్రభుత్వం ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. కొన్ని రోజుల పాటు ముర్రేకు పర్యాటకులు ఎవరూ రావొద్దని దేశ జాతీయ హైవేలు, మోటార్‌వే పోలీసు ఐజీ ఇనామ్‌ ఘనీ అభ్యర్థించారు. 



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని