Prison Escape: కొలంబియా కారాగారంలో విషాదం.. 49 మంది ఖైదీలు మృతి

కొలంబయాలోని (Colombia) ఓ జైళ్లో విషాదం చోటుచేసుకుంది. జైలు నుంచి తప్పించుకునే (Prison Escape) క్రమంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలో 49 మంది ఖైదీలు మృతి చెందారు.

Updated : 28 Jun 2022 20:22 IST

జైలు నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఘటన

బొగొటా: కొలంబియాలోని (Colombia) ఓ జైళ్లో విషాదం చోటుచేసుకుంది. జైలు నుంచి తప్పించుకునే (Prison Escape) క్రమంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలో 49 మంది ఖైదీలు మృతి చెందారు. మరో నలభై మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. మృతుల సంఖ్య కూడా మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. జైలులో జరిగిన ఈ సంఘటన అత్యంత విషాదకరమైనదిగా అక్కడి జాతీయ జైళ్ల విభాగం పేర్కొంది.

‘తులువా నగరంలోని కారాగారంలో ఖైదీలు నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలో పరుపులకు కొందరు నిప్పంటించడంతో అగ్నిప్రమాదం చోటుచేసుకున్నట్లు కనిపిస్తోంది. దాంతో వారంతా తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో జరిగిన తొక్కిసలాటలో ఇప్పటివరకు 49 మంది ఖైదీలు మృతిచెందారు. ఇవి ప్రాథమికంగా నిర్ధారించినవే. ఈ సంఖ్య మరింత పెరగవచ్చు’ అని కొలంబియా జాతీయ జైళ్లశాఖ విభాగం అధికార ప్రతినిధి వెల్లడించారు. తులువాలో జరిగిన ఘటనపై కొలంబియా అధ్యక్షుడు ఇవాన్‌ దుక్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు జరపాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు.

ఇదిలాఉంటే, లాటిన్‌ అమెరికాలో (Latin America) జైళ్లలో ఇటువంటి హింసాత్మక ఘటనలు సాధారణమేనని చెప్పవచ్చు. కొలంబియా పొరుగు దేశమైన ఈక్వెడార్‌లో గత ఏడాదిలోనే ఆరుసార్లు అల్లర్లు చెలరేగాయి. వాటిలో దాదాపు 400 మంది ఖైదీలు మృత్యువాతపడినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇటు కొలంబియాలోనూ జైళ్లు కిక్కిరిసిపోయి ఉంటాయి. అక్కడి జైళ్ల సామర్థ్యం 81వేలు కాగా దాదాపు 97వేల మంది ఖైదీలు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని