White House: బైడెన్‌ పెంపుడు శునకం 11వ సారి కరిచింది..

నిరంతరం అగ్రరాజ్యాధినేతకు రక్షణ కల్పించే సీక్రెట్ సర్వీస్‌ అధికారులకు శ్వేతసౌధంలో కుక్కకాట్లు తప్పడం లేదు. 

Updated : 27 Sep 2023 16:55 IST

వాషింగ్టన్‌ : అగ్రరాజ్య అధ్యక్షుడికి రక్షణ కల్పించే భద్రతాధికారులకు ఇప్పుడు కుక్కలతో పాట్లు తప్పడం లేదు. అమెరికా అధ్యక్షడు జో బైడెన్‌ పెంపుడు శునకం కమాండర్‌ మరోసారి ఓ సీక్రెట్ సర్వీస్‌ అధికారిని కరిచింది.

వివరాల్లోకి వెళ్తే.. సోమవారం రాత్రి 8 గంటల సమయంలో శ్వేత సౌధం (White House) లో విధి నిర్వహణలో ఉన్న ఓ సీక్రెట్ సర్వీస్‌ అధికారి (Secret Service agent) ని బైడెన్‌ పెంపుడు శునకం కమాండర్‌ కరిచింది. కుక్క కాటుకు గాయపడిన ఆ వ్యక్తికి ఘటనా స్థలంలోనే చికిత్స అందించినట్లు వైట్ హౌస్ తెలిపింది. జర్మన్‌ షెపర్డ్‌ జాతి(German Shepherd)కి చెందిన కమాండర్‌ అధికారులపై దాడి చేయడం ఇది 11వ సారి కావడం గమనార్హం.

ఈ ఘటనపై వైట్‌హౌస్‌ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్-పియర్ స్పందిస్తూ.. ‘ శ్వేత సౌధం ఎంతో ప్రత్యేకమైనది. అయితే పెంపుడు జంతువులకు ఇక్కడ వాతావరణం ప్రత్యేకంగా అనిపించడం వల్ల ఒత్తిడికి లోనవ్వడంతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ విషయాన్ని మీరందరూ అర్థం చేసుకోవాలి. కమాండర్‌కు ఆ అధికారికి అంతగా పరిచయం లేకపోవడం వల్లే అతడిపై దాడికి పాల్పడింది. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉంది’ అని ఆమె తెలిపారు.

ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌కు జర్మన్‌ షెపర్డ్‌ జాతికి చెందిన రెండేళ్ల  ‘కమాండర్‌’ అనే పెంపుడు శునకం ఉంది. ఇది 2022 అక్టోబరు నుంచి 2023 జనవరి మధ్య కనీసం పదిసార్లు సీక్రెట్‌ సర్వీస్‌ అధికారులను కరిచింది. అధికారుల పట్ల ఎలా ఉండాలో కమాండర్‌కు బైడెన్ కుటుంబ సభ్యులు జులై నుంచి శిక్షణ ఇస్తున్నట్లు వైట్ హౌస్ అధికారులు చెప్పారు. అంతకుముందు మేజర్‌ అనే శునకం బైడెన్‌ వద్ద ఉండేది. అది కొంతమంది సీక్రెట్‌ సర్వీస్‌ అధికారుల్ని, శ్వేతసౌధం సిబ్బందిని కరుస్తుండడంతో డెలావర్‌లోని తన మిత్రుల వద్దకు ఆయన పంపించేశారు. అమెరికా అధ్యక్షుని వద్ద విల్లో అనే పిల్లి కూడా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని