Justin Trudeau: ముఖ్య విషయాల్లో భారత్‌తో కలిసి పనిచేస్తాం: కెనడా ప్రధాని ట్రూడో

జీ20 సదస్సు అనంతరం నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్‌-కెనడా అధినేతలు తొలిసారి భేటీ అయ్యారు. దీనిపై కెనడా ప్రధాని ట్రూడో స్పందించారు. 

Updated : 16 Jun 2024 11:21 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌-కెనడా సంబంధాలు తీవ్ర ఒత్తిడిలో ఉన్న సమయంలో ఇరు దేశాధినేతలు జీ7 సమావేశాల సందర్భంగా కలుసుకొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమైన అంశాలపై భారత్‌తో కలిసి పనిచేసేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఆ దేశ ప్రధాని జస్టిన్‌ ట్రూడో (Justin Trudeau) వెల్లడించారు. మన ప్రధాని మోదీ (PM Modi)తో భేటీ అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇరు దేశాలు కలిసి పనిచేయాల్సిన సున్నితమైన అంశాల వివరాల జోలికి నేను వెళ్లడం లేదు. కానీ, కలిసి పని చేయడానికి కట్టుబడి ఉన్నాం. భవిష్యత్తులో చాలా ముఖ్యమైన పనులను మేం డీల్‌ చేస్తాం’’ అని ట్రూడో జీ7 చివరి రోజు మీడియా సమావేశంలో వెల్లడించారు. 

శుక్రవారం ప్రధాని మోదీ తాను ట్రూడోతో కరచాలనం చేస్తున్న ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ‘‘కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడోను జీ7 సదస్సులో కలిశాను’’ అంటూ దానికి క్యాప్షన్‌ జత చేశారు. మరోవైపు కెనడా ప్రధాని కార్యాలయం కూడా దీనిపై స్పందించింది. ఇరు దేశాధినేతలు ద్వైపాక్షిక అంశాలపై సంక్షిప్తంగా చర్చించారని పేర్కొంది. మోదీ తిరిగి ప్రధానిగా ఎన్నిక కావటంతో ట్రూడో శుభాకాంక్షలు తెలిపారని వెల్లడించింది. 

జీ20 సదస్సు తర్వాత కెనడా ప్రధాని భారత్‌పై నేరుగా ఆరోపణలు చేయడంతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన విభేదాలు నెలకొన్న విషయం తెలిసిందే. గతేడాది జులై 18న బ్రిటిష్‌ కొలంబియాలోని సర్రే ప్రాంతంలో ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్‌ హత్య జరిగింది. దీని వెనక భారత్‌ ఏజెంట్ల పాత్ర ఉందంటూ ట్రూడో చేసిన ఆరోపణలతో రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. ఈ ఆరోపణలను భారత్‌ తీవ్రంగా ఖండించింది. తగిన ఆధారాలు ఇవ్వాలని.. ఆ తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటామని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసింది. ఈ కేసులో తాజాగా ఎడ్మంటన్‌ ప్రాంతంలో నివాసముంటున్న కరణ్‌ప్రీత్‌ సింగ్‌ (28), కమల్‌ప్రీత్‌ సింగ్‌ (22), కరణ్‌ బ్రార్‌ (22)లను కెనడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని