Coronavirus: సాధారణ జలుబుతో కొవిడ్‌ నుంచి రక్షణ

సాధారణ జలుబు ద్వారా వృద్ధిచెందే టి-కణాలు కొవిడ్‌ నుండి రక్షణ అందిస్తాయని ఇంపీరియల్ కాలేజ్ లండన్ తాజా అధ్యయనంలో వెల్లడైంది......

Updated : 11 Jan 2022 05:18 IST

తాజా అధ్యయనంలో వెల్లడి

లండన్‌: కరోనా వైరస్‌ నుంచి టి-కణాలు రక్షిణనిస్తాయని పలు అధ్యయాలు వెల్లడిస్తున్న నేపథ్యంలో మరో అధ్యయనం సైతం ఇదే విషయాన్ని తెలిపింది. సాధారణ జలుబు ద్వారా వృద్ధిచెందే టి-కణాలు కొవిడ్‌ నుండి రక్షణ అందిస్తాయని ఇంపీరియల్ కాలేజ్ లండన్ తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ విషయాలు నేచర్ కమ్యూనికేషన్స్‌లో ప్రచురితమయ్యాయి. అధికస్థాయి టి-కణాలు వైరస్‌ నుండి రక్షణను అందించగలవని అధ్యయనం స్పష్టం చేసింది. కొవిడ్‌ టీకా తీసుకున్న 6నెలల తర్వాత యాంటీబాడీ స్థాయిలు క్షీణిస్తున్నట్లు పలు నివేదికలు పేర్కొంటుండగా.. ఆ తర్వాత టి-కణాలు రక్షణను అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని తాజాగా నిరూపితమైంది.

కొవిడ్‌-19 నుంచి సాధారణ జలుబు ఏమేరకు రక్షణ కల్పిస్తుందనే అంశాన్ని తెలుసుకునేందుకు సెప్టెంబర్‌ 2020లో ఇంపీరియల్ కాలేజ్ లండన్ పరిశోధకులు అధ్యయనాన్ని మొదలుపెట్టారు. ఇందులో భాగంగా సాధారణ జలుబుతో బాధపడుతోన్న 52 మందిని పరీక్షించారు. వీరిలో అప్పటికే కొందరిలో వైరస్‌ నిర్ధారణ కాగా.. ఇన్‌ఫెక్షన్‌ సోకనివారు ఉన్నారు. అయితే వీరిలో కొవిడ్‌కు గురైన వారితో పోలిస్తే వైరస్‌కు గురికాని 26 మందిలో టి-కణాలు గణనీయంగా వృద్ధి చెందినట్లు గుర్తించారు. ‘సాధారణ జలుబు బారిన పడినప్పుడు వారి శరీరంలో అధిక స్థాయి టి-కణాలు వృద్ధి చెందాయి. ఇవి కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్ నుండి రక్షించగలవని మేము గుర్తించాం’ అని అధ్యయనం చేపట్టిన శాస్త్రవేత్తల్లో ఒకరైన డా.రియా కుందు వెల్లడించారు. అయితే ఇవి ఎంతకాలం పాటు రక్షణనిస్తాయనే విషయాన్ని మాత్రం పరిశోధకులు వెల్లడించలేదు.

ఇదిలా ఉంటే ఈ నెలాఖరుకు భారత్‌లో కేసుల సంఖ్య గరిష్ఠ స్థాయి(పీక్‌)కి చేరుకుంటుందని ఐఐటీ కాన్పుర్‌ ప్రొఫెసర్‌ మణీంద్ర అగర్వాల్‌ తాజాగా వెల్లడించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం పీక్‌ సమయంలో నమోదయ్యే కేసులు.. సెకండ్‌ వేవ్‌ ఉద్ధృత దశలో బయటపడిన కేసుల సంఖ్యనూ మించే అవకాశం ఉందని తెలిపారు. వారానికి సగటున నాలుగు నుంచి ఎనిమిది లక్షల కేసులు వస్తాయని, కేసుల పెరుగుదల తీవ్రంగా ఉంటుందని అంచనా వేశారు. అనంతరం కేసుల తగ్గుదల కూడా అంతే వేగంగా ఉంటుందని భావిస్తున్నామన్నారు. ఒకవేళ జనవరి చివర్లో గరిష్ఠ స్థాయి నమోదైతే.. మార్చి మధ్య నాటికి ఈ వేవ్‌ ముగుస్తుందని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని