South Africa: ఒమిక్రాన్‌ ఉద్ధృతి.. రికార్డుస్థాయిలో కరోనా పాజిటివిటీ రేటు

దక్షిణాఫ్రికాలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. దీంతో అక్కడ కరోనా పాజిటివిటీ రేటు 30శాతం దాటింది.

Published : 09 May 2022 14:45 IST

ఒమిక్రాన్‌ ఉపరకాలతో విస్తృత వేగంతో వైరస్‌ వ్యాప్తి

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ ఉద్ధృతి అదుపులోనే ఉన్నప్పటికీ పలు దేశాల్లో మాత్రం భారీ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్ల విజృంభణతో దక్షిణాఫ్రికాలో రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు వెలుగు చూస్తున్నాయి. దీంతో అక్కడ కరోనా పాజిటివిటీ రేటు 30శాతం దాటింది. ఐదు నెలల తర్వాత ఈ స్థాయిలో పాజిటివిటీ రేటు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమవుతున్నారు.

ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఉపరకాల ప్రభావంతో దక్షిణాఫ్రికాలో గతకొన్ని రోజులుగా కొవిడ్‌ ఉద్ధృతి ఒక్కసారిగా పెరిగింది. శనివారం ఒక్కరోజే 8524 కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 31.1శాతం ఉన్నట్లు అక్కడి జాతీయ అంటువ్యాధుల కేంద్రం వెల్లడించింది. అంతకుముందు వేవ్‌ సమయంలో డిసెంబర్‌ 5న అక్కడ 32.2శాతం పాజిటివిటీ రేటు నమోదైంది. ఈ తర్వాత మళ్లీ ఇప్పుడే ఈస్థాయిలో రికార్డయ్యింది. దక్షిణాఫ్రికాలో ఇప్పటివరకు కరోనా గరిష్ఠ పాజిటివిటీ రేటు 34.9శాతంగా (డిసెంబర్‌ 14న) ఉంది. ఇలా వైరస్‌ సంక్రమణ అత్యంత వేగంగా ఉందని చెప్పడానికి తాజా గణాంకాలే నిదర్శనమని నిపుణులు చెబుతున్నారు. అయితే, కొవిడ్‌తో ఆస్పత్రుల్లో చేరికలు, మరణాల సంఖ్య తక్కువగానే ఉన్నట్లు వెల్లడించారు. గడిచిన రెండు రోజుల్లో ఐదుగురు మరణించగా.. 2600 మంది ఆస్పత్రిలో చేరినట్లు పేర్కొన్నారు. గతేడాది మధ్యలో డెల్టా వేరియంట్‌ ప్రతాపం చూపించగా.. ఆ సమయంలో ఒక్కరోజే 16వేల మంది ఆస్పత్రి పాలయ్యారు.

నాలుగో వేవ్‌ సమయంలోనే దక్షిణాఫ్రికా సమీపంలోని బోట్స్‌వానాలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ వెలుగు చూసింది. అనంతరం దాని నుంచి ఉత్పరివర్తనం చెందిన బీఏ.4, బీఏ.5 ఉపరకాలు అత్యధిక సంక్రమణ సామర్థ్యం కలిగి వున్నట్లు నివేదికలు వస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా వీటిపై అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తాజాగా వీటివల్లే కొవిడ్‌ ఉద్ధృతి మరింత పెరుగుతోందని దక్షిణాఫ్రికా ఆరోగ్యశాఖ చెబుతోంది. ఇదే సమయంలో ఈ ఒమిక్రాన్‌ ఉపరకాలు అక్కడికే పరిమితం కాకుండా ఇతర దేశాలకు విస్తరించాయి. అయినప్పటికీ వ్యాధి తీవ్రత తక్కువగా ఉండడం కాస్త ఊరట కలిగించే విషయం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని