WHO: ఒమిక్రాన్‌ది డెల్టాను మించిన వేగం..తేలిగ్గా తీసుకోకండి: డబ్ల్యూహెచ్‌వో

ఒమిక్రాన్‌ను తేలిగ్గా తీసుకోవద్దని బుధవారం ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) హెచ్చరించింది.

Published : 14 Jan 2022 01:38 IST

ఐక్యరాజ్యసమితి/జెనీవా: ఒమిక్రాన్‌ను తేలిగ్గా తీసుకోవద్దని బుధవారం ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) హెచ్చరించింది. ఇది చాలా వేగంగా వ్యాప్తి చెందుతోందని, త్వరలోనే డెల్టాను అధిగమిస్తుందని వెల్లడించింది. తక్కువ సమయంలో ఈ వేరియంట్‌ కేసులు రెట్టింపు అవుతున్నాయని, ఇది చాలా సులభంగా రోగనిరోధక శక్తిని తప్పించుకుంటోందని పేర్కొంది. ‘‘జన్యు క్రమాన్ని విశ్లేషించే సామర్థ్యం మెరుగ్గా ఉన్న అన్ని దేశాల్లోన్లో ఒమిక్రాన్‌ ఉనికిని కనుగొన్నాం. ఇది ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ ఉండే అవకాశం ఉంది. ఇప్పటివరకు కనుగొన్న వాటిలో ఇదే అతి పెద్ద ఆధిపత్య వేరియంట్‌. కొందరు దీన్ని తేలిగ్గా తీసుకుంటున్నారు ఏదో జలుబులా భావిస్తున్నారు. దీని తీవ్రత అంతగా ఉండదని ఊహించుకుంటున్నారు. ఇది చాలా ప్రమాదం. ఈ వేరియంట్‌తో  ఆసుపత్రులు పాలవుతున్న వారూ అధికంగా ఉన్నారు.

ఇప్పటికే రోగాలున్న వారు.. వృద్ధులు, టీకాలు తీసుకోనివారిపై దీని ప్రభావం తీవ్రంగా ఉండనుంది’’ అని డబ్ల్యూహెచ్‌వో సీనియర్‌ శాస్త్రవేత్త మరియా వాన్‌ కెరోవ్‌ తెలిపారు. మంగళవారం విడుదల చేసిన డబ్ల్యూహెచ్‌వో గణాంకాల ప్రకారం.. జనవరి 3-9 మధ్యలో ప్రపంచవ్యాప్తంగా 1.5 కోట్ల కొత్త కొవిడ్‌-19 కేసులు నమోదయ్యాయి. అంతకుముందు వారంతో పోలిస్తే 55 శాతం పెరుగుదల. వారంలో 43 వేల మంది మృతి చెందారు. ఆఫ్రికాలో తప్ప అంతటా కేసులు పెరుగుతున్నాయి. అక్కడ మాత్రం 11 శాతానికి పడిపోయాయి.  అమెరికాలో కొత్త కేసుల్లో (46,10,359) 73 శాతం వృద్ధి కనిపించింది. తర్వాత స్థానాల్లో ఫ్రాన్స్‌ (15,97,203. 46% వృద్ధి), యూకే (12,17,258.. 10% వృద్ధి) ఉన్నాయి. ఐరోపాలో 31 శాతం కేసులు పెరిగాయి. అయితే మరణాలు 10 శాతానికి తగ్గాయి. ఆగ్నేయాసియాలో ఏకంగా 400% మేర వృద్ధి కనిపించింది. ఇందులో అత్యధిక కేసులు భారత్‌లోనే నమోదయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని