Green Card: భారతీయులకు గ్రీన్‌కార్డు ఆలస్యం అందుకే..!

అమెరికాలో శాశ్వతంగా స్థిరపడాలనుకునే వలసదారులకు అగ్రరాజ్యం పర్మనెంట్‌ రెసిడెంట్‌ కార్డ్ (Green Card)లను ఇస్తుంటుంది. అయితే, ఈ కార్డుల జారీ కోసం భారతీయులు ఏళ్ల తరబడి ఎదురుచూడటానికి కోటానే కారణమని ఓ సీనియర్‌ అధికారి తెలిపారు.

Updated : 19 May 2023 17:12 IST

వాషింగ్టన్‌: అమెరికా (USA)లో శాశ్వత నివాసం కోసం జారీ చేసే గ్రీన్‌ కార్డు (Green Card)లను పొందడం కోసం భారత్‌ (Indian) సహా చైనా, మెక్సికో, ఫిలిప్పీన్స్‌ దేశస్థులు ఏళ్ల తరబడి నిరీక్షించాల్సి వస్తుంది. అయితే, దేశాల వారీ కోటా (Country based quota) కారణంగానే ఈ ప్రాంతాల వారికి గ్రీన్‌ కార్డుల కేటాయింపులు ఆలస్యమవుతున్నాయని అమెరికా అధికారి ఒకరు తెలిపారు. యూఎస్‌ కాంగ్రెస్‌ మాత్రమే దీన్ని మార్చగలదన్నారు.

ఉపాధి కోసం అగ్రరాజ్యానికి వెళ్లి అక్కడే శాశ్వతంగా స్థిరపడాలనుకునే వలసదారులకు అమెరికా పర్మనెంట్‌ రెసిడెంట్‌ కార్డ్ (గ్రీన్‌ కార్డు)లను ఇస్తుంటుంది. అయితే, ఒక్కో దేశానికి నిర్ణీత సంఖ్య (కోటా)లో మాత్రమే వీటిని జారీ చేస్తుంటారు. మొత్తం దరఖాస్తుల్లో ఒక్కో దేశానికి కేవలం 7% మాత్రమే కేటాయించాలన్నది ప్రస్తుత విధానం. దీనిపై అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ (USCIS) డైరెక్టర్‌కు సీనియర్‌ అడ్వైజర్‌ డాగ్లస్‌ రాండ్‌ తాజాగా స్పందించారు. ఇమ్మిగ్రేషన్ చట్టాల ప్రకారం అమెరికా ఏటా.. 2,26,000 ఫ్యామిలీ ప్రిఫరెన్స్‌, 1,40,000 ఉపాధి ఆధారిత గ్రీన్‌ కార్డు (Green Card)లను జారీ చేసేందుకు వీలుంటుందని తెలిపారు. ఇందులో ఒక్కో దేశానికి 7శాతం అంటే.. కేవలం 25,620 గ్రీన్‌ కార్డులను జారీ చేస్తారని పేర్కొన్నారు.

‘‘చిన్న దేశాలకు ఈ కోటా (Country-based quota) సరిపోతుంది. కానీ.. భారత్‌, చైనా, మెక్సికో, ఫిలిప్పీన్స్‌ వంటి దేశాల నుంచి ఈ కార్డుల కోసం విపరీతమైన పోటీ ఉంటుంది. ఏటా లక్షల మంది వీటి కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. దేశాల వారీ కోటా కారణంగానే.. వారు శాశ్వత నివాస పత్రాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సి వస్తుంది. దీన్ని అమెరికా కాంగ్రెస్‌ మాత్రమే మార్చగలదు. కార్డుల జారీపై కోటాను స్థిరంగా ఉంచారు. కానీ, డిమాండ్‌ మాత్రం ఏటేటా పెరుగుతోంది. అలాంటప్పుడు పరిమితులకు లోబడి డిమాండ్‌కు అనుగుణంగా గ్రీన్‌ కార్డుల జారీని పెంచడంపై కాంగ్రెస్‌ పునరాలోచన చేయాలి’’ అని రాడ్‌ సూచించారు.

గ్రీన్‌ కార్డుల (Green Card) జారీని వేగవంతం చేసేందుకు అధికార డెమోక్రటిక్‌ పార్టీ ఇటీవల అమెరికా కాంగ్రెస్‌లో 2023 పౌరసత్వ బిల్లు ప్రవేశపెట్టింది. గ్రీన్‌కార్డుల జారీకి దేశాలవారీ కోటాను ఎత్తివేయాలనీ, హెచ్‌ 1బి వీసాలలో ముఖ్యమైన మార్పులు చేయాలని ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది. దేశాలవారీ కోటాల వల్ల మునుపటి సంవత్సరాల్లో ఎవరికీ కేటాయించకుండా మిగిలిపోయిన గ్రీన్‌కార్డులను వలసదారుల సంతానానికీ, భార్యలు లేదా భర్తలకు మంజూరు చేయడం ద్వారా వారి కుటుంబాలను ఏకం చేయాలని సిఫార్సు చేసింది. కుటుంబాల వలసకు దేశాలవారీ కోటాలను పెంచాలనీ ప్రతిపాదించింది. ఈ బిల్లు ఆమోదం పొందితే లక్షలాది మంది భారతీయులతో పాటు మెక్సికన్‌, చైనీస్‌ దేశస్థులకు ఎంతో ఉపయోగకరంగా మారుతుందని ప్రవాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని