టికెట్‌ అడిగారని.. చంటి బిడ్డను ఎయిర్‌పోర్టులో వదిలేసిన జంట..

విమానం(Plane) ఎక్కడ మిస్‌ అవుతుందోనన్న కంగారులో చంటి బిడ్డను వదిలి విమానం ఎక్కేందుకు వెళ్లిపోయిందో జంట. ఈ ఘటనతో విమానాశ్రయ సిబ్బంది అవాక్కయ్యారు.

Published : 02 Feb 2023 17:33 IST

టెల్‌ అవీవ్‌: ఇజ్రాయెల్‌(Israel) విమానాశ్రయంలో ఒక వింత ఘటన చోటుచేసుకుంది. తమ బిడ్డకు టికెట్ తీసుకునేందుకు నిరాకరించిన ఓ జంట.. ఆ చిన్నారిని చెక్‌ ఇన్‌ కౌంటర్ వద్దే వదిలి విమానం ఎక్కేందుకు వెళ్లిపోయారు.

బెల్జియం వెళ్లేందుకు ఓ జంట తమ బిడ్డతో కలిసి ఇజ్రాయెల్‌లోని బెన్ గురియన్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే విమానం ఎక్కాలంటే చిన్నారికి కూడా టికెట్ తీసుకోవాలని సిబ్బంది తెలిపారు. అప్పటికే ఎయిర్‌పోర్టుకు ఆలస్యంగా వచ్చిన ఆ జంట.. బిడ్డకు టికెట్ తీసుకోలేదు సరికదా.. స్ట్రోలర్‌లో ఉన్న బిడ్డను వదిలేసి బోర్డింగ్‌ పాయింట్ వద్దకు వెళ్లిపోయారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు భద్రతా సిబ్బందికి సమాచారం అందించారు. వారు ఆ జంటను వెనక్కి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఈ సమస్య పరిష్కారం అయిందని, ఆ చిన్నారి వారి తల్లిదండ్రుల చెంత ఉందని తెలిపారు. దీనిపై అక్కడి సిబ్బంది స్పందిస్తూ.. ‘ఇలాంటి ప్రవర్తనను మేం ఇంతకుముందెన్నడూ చూడలేదు. మా కళ్లను మేం నమ్మలేకపోయాం’ అని వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

విమానాశ్రయానికి ఆలస్యంగా చేరుకున్న ఆ జంట విమానం ఎక్కడ మిస్‌ అవుతుందోనన్న తొందరలో ఉన్నారని, ఆ కంగారులో తమ బిడ్డనే మర్చిపోతున్నామనే విషయాన్ని వారు గుర్తించలేకపోయారని మరో అధికారి వెల్లడించారు. ఏదేమైనా ప్రస్తుతం ఈ ఉదంతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని